ఆ రహదారిపై రాత్రివేళ ప్రయాణిస్తున్నారా? ఆదమరిస్తే అంతే సంగతులు..
ఆదమరిచారో ఇక అంతే సంగతులు.! ఇటీవలి కాలంలో ఆ రహదారిపై దారి దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు. ఈ మార్గంలో రోజురోజుకు దొంగతనాలు ఎక్కువ అవుతున్నాయి. గత నెలన్నర రోజులుగా ఈ తరహా ఘటనలు ఎక్కువ కావడంతో రాత్రిపూట ప్రయాణించే వాహనదారులు భయాందోళనలకు గురవుతున్నారు. ఈ హైవేపై అర్ధరాత్రి ప్రయాణించాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుంటున్నారు.

ఆదమరిచారో ఇక అంతే సంగతులు.! ఇటీవలి కాలంలో ఆ రహదారిపై దారి దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు. ఈ మార్గంలో రోజురోజుకు దొంగతనాలు ఎక్కువ అవుతున్నాయి. గత నెలన్నర రోజులుగా ఈ తరహా ఘటనలు ఎక్కువ కావడంతో రాత్రిపూట ప్రయాణించే వాహనదారులు భయాందోళనలకు గురవుతున్నారు. ఈ హైవేపై అర్ధరాత్రి ప్రయాణించాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుంటున్నారు.
ఇది నేషనల్ హైవే 65. దేశంలోనే అత్యంత వాహనాల రద్దీ కలిగిన హైవేగా దీనికి పేరు ఉంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 181 కిలోమీటర్ల మేర ఈ హైవే విస్తరించి ఉంది. నిత్యం వాహనాల రద్దీతో ఉండే ఈ హైవేపై దోపిడీ దొంగతనాలు జరుగుతున్నాయి. ఆదమరిచి హైవే వెంట పార్క్ చేసి పడుకుంటే మాత్రం అంతే సంగతులు. సాధారణ వ్యక్తుల మాదిరిగానే వచ్చి కత్తులతో బెదిరించి అందిన కాడికి దోచుకుంటున్నారు. వాహనాలను ఆపి దోపిడీ చేస్తున్నారు. కొన్ని రోజులుగా రహదారిపై దొంగతనాలు, దోపిడీలు విపరీతంగా పెరిగిపోయాయి. రాత్రిపూట ప్రయాణాలు అంటేనే వాహనదారులు వణికిపోతున్నారు. తాజాగా చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం వద్ద హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్తున్న వాహనదారులు.. అలసిపోయి స్వాతి హోటల్ వద్ద పక్కకు పార్కు చేసి నిద్రపోయారు. ఇది అదునుగా భావించిన దోపిడీ దొంగలు కారులో రెండు లక్షల రూపాయలను ఎత్తుకెళ్లారు. ఈ ఘటనతో హైవేపై దోపిడీ దొంగల కలకలం రేపింది.
రాత్రివేళ పార్క్ చేస్తే అంతే సంగతులు..
చీకటి పడితేచాలు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలు దాబాల ముందు పార్క్ చేయాలంటేనే భయపడిపోతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదని బాంబేలేత్తుతున్నారు. గత నెల 18న ఏపీ నుంచి సరకును హైదరాబాద్‌లో దిగుమతి చేసి తిరిగి వెళ్తున్న క్రమంలో అలసిపోయి కట్టంగూరు మండలం ఎర్రసానిగూడెం వద్ద పార్కింగ్ స్థలంలో ఆపిన మినీ డీసీఎం డ్రైవర్ హత్యకు గురయ్యాడు. దుండగులు అతని కాళ్లను కట్టేసి, గొంతు నులిమి దారుణంగా హత్య చేసి అవతలి వైపు రహదారి పక్కన పడేశారు. మే 19 తేదీన అదే ప్రాంతంలో ఆగి ఉన్న లారీ నుంచి 250 లీటర్ల డీజిల్‌ను దొంగతనం చేశారు. 23వ తేదీన కట్టంగూర్ మండలం అయిటిపాముల వద్ద మరో దొంగతనం చేశారు. ఈ నెల 9న తెల్లవారుజామున ఏపీ నుంచి హైదరాబాద్ వెళ్తున్న తూర్పుగోదావరి జిల్లా వాసులు ప్రయాణంలో అలసిపోయి చిట్యాల మండలం పెద్దకాపర్తి వద్ద సర్వీసు రోడ్డులో కారు ఆపారు. అందులో నిద్రిస్తున్న వారిపై ఇద్దరు దుండగులు బైక్‌పై వచ్చి దాడి చేశారు. ప్రయాణికుల దగ్గర ఉన్న సుమారు 10 తులాల బంగారాన్ని అపహరించారు.
జాతీయ రహదారి ప్రయాణంలో అలసిపోయి రహదారి పక్కన వాహన దారులు విశ్రాంతి తీసుకుంటున్నారు. భారీ వాహనాలు లారీ డ్రైవర్లు అయితే హైవే వెంట ఉన్న బస్సులో విశ్రాంతి తీసుకుంటారు. వీరిని దోపిడి దొంగల ముఠా టార్గెట్‌గా చేసుకొని దోపిడీ చేస్తుంది. ఇలా పార్క్ చేసిన వాహనాల దగ్గరికి వెళ్లి ప్రయాణికులను లారీ డ్రైవర్లను కత్తులతో బెదిరించి నగదు సొమ్ములను దోచుకుంటున్నారు.
ఈ ప్రాంతాల్లోనే దోపిడీలు ఎక్కువ..
జాతీయ రహదారిపై ఉమ్మడి జిల్లా పరిధి ప్రారంభమయ్యే చౌటుప్పల్ మండలం మల్కాపురం నుంచి కోదాడ మండలం కొమరబండ వరకు పోలీసులు రాత్రి పూట నిత్యం పెట్రోలింగ్ చేయాల్సి ఉంటుంది. ఎక్కువగా చౌటుప్పల్, కట్టంగూరు, నార్కట్పల్లి, కేతేపల్లి పరిధిలోనే ఇటీవల నేరాలు జరుగుతున్నాయి. నిత్యం వేలాది వాహనాలు ప్రయాణించే ఈ జాతీయ రహదారిపై దోపిడీ దొంగతనాలు జరుగుతుండడంతో హైవేపై పోలీసుల నిఘా కొరవడిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. రెండు నెలలుగా ఎన్నికల్లో విధుల్లో బిజీగా ఉన్న పోలీసులు హైవేపై నిఘా పెట్టడంలో కొంత నిర్లక్ష్యం వహించారు. దీనికి తోడు జాతీయ రహదారి నిర్మాణ సంస్థ జిఎంఆర్ కూడా రాత్రులు పెట్రోలింగ్‌ను నిర్లక్ష్యం చేసిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొన్ని రోజులుగా రహదారిపై దొంగతనాలు, దోపిడీలు విపరీతంగా పెరిగిపోయాయి. జాతీయ రహదారిపై పోయేవారికి ఇటు ప్రమాదాల నుంచి ఆటు దారి దోపిడీ దొంగల నుంచి రక్షణ లేకుండా వాహనదారులు వాపోతున్నారు. వరుస దొంగతనాలు జరగడంతో వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. రహదారిపై పెట్రోలింగ్ పెంచి దొంగతనాలను అరికట్టాలని వాహనదారులు కోరుతున్నారు.
పోలీసులకు ఛాలెంజ్‌గా మారిన హైవే దోపిడీలు..
జాతీయ రహదారిపై దారి దోపిడీలు, దొంగతనాలను పోలీసులకు ఛాలెంజ్‌గా మారాయి. హైవేపై జరుగుతున్న దారి దోపిడీలను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇప్పటికే కొన్ని ఆధారాలు సేకరించారు. నిందితులు ఉపయోగించిన బైకులు, దోపిడీలు చేసే విధానం ప్రకారం ఒక అంచనాకు వచ్చారు. దొంగతనా ల్లో ఆరితేరిన ముఠా.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి దొంగతనాలు చేస్తున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. దారి దోపిడీలు, దొంగతనాల నివారణకు అన్ని చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. హైవేపై దోపిడీ దొంగతనాలు జరగకుండా నివారణ చర్యలు, నమోదైన కేసులను చేదించేందుకు నాలుగు టీమ్‌లను ఏర్పాటు చేశామని పోలీసులు చెబుతున్నారు.
హైవేపై నిఘా పెంచాం.. పోలీసులు
జాతీయ రహదారిపై దారి దోపిడీలు, దొంగతనాలపై నల్గొండ జిల్లా పోలీసులు నిఘా పెంచి దర్యాప్తు ముమ్మరం చేశారు. రాత్రి పూట జాతీయ రహదారిపైనా పెట్రోలింగ్ పెంచామని పోలీసులు తెలిపారు. ప్రజలెవరూ భయపడాల్సిన అవసరం లేదని, హైవేపై నిఘాను మరింత పట్టిష్టం చేస్తామని పోలీసు అధికారులు చెబుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..