ముసలవ్వ బావిలో పడిందనీ నీళ్లన్నీ తోడేశారు.. కట్‌చేస్తే ఫ్యూజులు ఎగిరిపోయే ట్విస్ట్!
ఓ ముసలవ్వ పొద్దునే ఇంటి నుంచి బయటకు వెళ్లింది. ఎంతకూ తిరిగి రాకపోవడంతో ఇరుగు పొరుగు ముసలవ్వ బావిలో పడిందని భావించి, వెంటనే అధికారులకు సమాచారం అందించారు. దీంతో పరుగు పరుగున వచ్చిన అధికారులు వర్షానికి నిండు కుండలా ఉన్న బావిలోని నీరు మొత్తాన్ని భారీ మోటార్ల సాయంతో తోడేశారు..

వరంగల్, సెప్టెంబర్ 1: తెల్లవారు జామున ఓ వృద్ధురాలు ఇంటి నుంచి బయటకు వెళ్లింది. ఆ తర్వాత ఎంతకూ తిరిగి రాలేదు. దీంతో ఇరుగు పొరుగు ముసలవ్వ బావిలో పడిందని భావించి, వెంటనే అధికారులకు సమాచారం అందించారు. దీంతో పరుగు పరుగున వచ్చిన అధికారులు వర్షానికి నిండు కుండలా ఉన్న బావిలోని నీరు మొత్తాన్ని భారీ మోటార్ల సాయంతో తోడేశారు. అయితే నీరు అడుగుకి చేరినా వృద్ధురాలి జాడ కనిపించలేదు. ఇంతలో పక్కనే ఉన్న పత్తిచేలో అలికిడై అటుగా వెళ్లిన వారికి ఫ్యూజులు ఎగిరిపోయాయ్. ఈ వింత ఘటన వరంగల్ జిల్లా దుగ్గొండి మండల కేంద్రంలో ఆదివారం (ఆగస్ట్ 31) జరిగింది. అసలింతకీ ఏం జరిగిందంటే..
వరంగల్ జిల్లా దుగ్గొండికి చెందిన మాడిశెట్టి రాజ్యలక్ష్మి అనే 75 ఏళ్ల వృద్ధురాలు ఆదివారం తెల్లవారుజామున ఇంటి నుంచి బయటకు వెళ్లింది. అలా ఆమె బయటకు వెళ్లడం కుటుంబ సభ్యులతోపాటు ఇరుగుపొరుగు కూడా చూశారు. అయితే ఎంతకూ ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆమె కనిపించకపోవడం లేదంటూ కుటుంబ సభ్యులు చుట్టుపక్కల అంతటా వెదకసాగారు. పైగా ఓ పొలంలో ఉన్న బావి వద్ద వృద్ధురాలి చీర, బావిలోకి జారిన గుర్తులు కనిపించాయి. దీంతో రాజ్యలక్ష్మి బావిలోకి దూకేసి ఉంటుందని కుటుంబ సభ్యులు భావించారు. అంతే.. వెంటనే అధికారులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న అధికారులు ఐదు విద్యుత్ మోటార్లు, ఫైరింజన్‌తో సహా సంఘటనా స్థలానికి చేరుకుని నీటినంతా తోడేయసాగారు. అలా నీరు మొత్తం తోడినప్పటికీ వృద్ధురాలి జాడ వారికి కనిపించలేదు. ఈ క్రమంలో అక్కడే ఉన్న కొందరు యువకులు మూత్ర విసర్జన కోసం పక్కనే ఉన్న పత్తి చేను లోపలికి వెళ్లారు. అక్కడ పత్తి మొక్కల మధ్య ఏదో వింత ఆకారం కనిపించింది. దగ్గరికి వెళ్లి చూడగా ఉదయం నుంచి కనబడకుండా పోయిన రాజ్యలక్ష్మి.. అక్కడ పొలంలో నిద్రపోతూ కనిపించింది. వెంటనే యువకులు వృద్ధురాలిని నిద్రలేపి చేనులో నుంచి బయటికి తీసుకుని రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. రాజ్యలక్ష్మికి మతిమరుపు సమస్య ఉండటం వల్ల ఎక్కడి వెళ్తుందో, ఏం చేస్తుందో ఆమెకే తెలియని పరిస్థితి. అయితే ఆమె నిజంగానే బావిలో దూకి ఉంటుందని భావించి దాదాపు 100 మంది గ్రామ పంచాయతీ సిబ్బంది ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కష్టపడి బావిలో జల్లెడపట్టారు. అసలు సంగతి బయటకు రావడంతో.. అంతా అవాక్కయ్యారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.








