పొలంలో పనులు చేసి తింటున్న రైతులు.. కాసిన్ని నీళ్లు తాగుదామని బిందె దగ్గరకు వెళ్లగా
పొలం పనులు చేస్తున్న కూలీలు.. మధ్యాహ్నం అయ్యింది కదా అని.. భోజనానికి కూర్చున్నారు. కాసిన్ని మంచినీళ్లు తాగుదామని బిందెలో నుంచి తీసుకోగా.. ఆ తర్వాత జరిగిందిదే.. అసలేం జరిగింది.? ఆ వివరాలు ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి. ఓ సారి లుక్కేయండి.

ప్రతి రోజూ పొలంలో కూలీలు పని చేస్తున్నారు. పొలంలో ఉన్న బిందెలో నీళ్లు తాగి కూలీలు ఒకరు తర్వాత ఒకరు అస్వస్థతకు గురయ్యారు. అసలు ఏమి జరిగిందో తెలియక ఆందోళన చెందారు. ఏమి జరిగిందంటే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం 9వ మైలు తండాలో పురుగు మందు(గడ్డి మందు)కలిపిన బిందెలో మంచినీళ్లు త్రాగి 15 మందికి అస్వస్థత గురయ్యారు. 9వ మైల్ తండాకు చెందిన 15 మంది కూలీలు మిర్చి తోట నాటడానికి పొలానికి వెళ్ళారు. మధ్యాహ్నం భోజనం చేసే టైంలో తోటకు మందు కొట్టిన బిందెలో మంచినీళ్లు తెచ్చుకుని తాగారు. ఆ తర్వాత తాగిన మరుక్షణమే అందరికీ ఒకరి తర్వాత ఒకరికి వాంతులు మొదలయ్యాయి.
ఆ క్రమంలో పురుగుమందు కొట్టిన బిందెను కడగకుండా అక్కడే పెట్టడంతో దాంట్లోనే మంచినీళ్లు తీసుకుని తాగడం వల్ల వాంతులు అవుతున్నాయని గమనించి హుటాహుటిన 15 మందిని కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం కూలీలు చికిత్స పొందుతున్నారు. వారికి ప్రాణాపాయ పరిస్థితి తప్పిందని డాక్టర్లు తెలియజేయడంతో ఊపిరి పీల్చుకున్నారు కూలీలు. రైతులకు అనేకమార్లు అవగాహన సదస్సులు కల్పిస్తున్నప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.




