పెళ్లైన ఏడాదికే భార్య మృతి.. ఆమె ఇద్దరు చెల్లెల్లని పెళ్లాడతానంటూ టవరెక్కిన అల్లుడు గారు!
పెళ్లైన ఏడాది తర్వాత అనారోగ్యంతో భార్య కన్నుమూసింది. దీంతో సదరు పతిదేవుడు.. చనిపోయిన భార్య ఇద్దరు చెల్లెల్లలో ఒకరిని పెళ్లి చేసుకున్నాడు. ఆనక చివరి మరదలిని కూడా పెళ్లాడతానని పట్టుబట్టాడు. అత్తమామలు ఒప్పుకోకపోవడంతో దగ్గర్లోని ఓ హై-వోల్టేజ్ విద్యుత్ టవర్ ఎక్కి పెళ్లి చేస్తారా..? చావమంటారా? అంటూ..

లక్నో, ఆగస్ట్ 30: ఓ వ్యక్తికి నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే భార్య ఏడాది తర్వాత అనారోగ్యంతో కన్నుమూసింది. దీంతో సదరు పతిదేవుడు.. చనిపోయిన భార్య ఇద్దరు చెల్లెల్లలో ఒకరిని పెళ్లి చేసుకున్నాడు. ఆనక చివరి మరదలిని కూడా పెళ్లాడతానని పట్టుబట్టాడు. అత్తమామలు ఒప్పుకోకపోవడంతో దగ్గర్లోని ఓ హై-వోల్టేజ్ విద్యుత్ టవర్ ఎక్కి పెళ్లి చేస్తారా..? చావమంటారా? అని నానాయాగి చేశాడు. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
రాజ్ సక్సేనా అనే వ్యక్తి 2021లో ఓ యువతిని వివాహం చేసుకున్నాడు. అయితే ఆమె అనారోగ్య కారణాల వల్ల ఏడాది తిరకగక ముందే చనిపోయింది. దీంతో రాజ్ సక్సేనా సోదరిని పెళ్లి చేసుకున్నాడు. రెండేళ్ల తర్వాత అతగాడు భార్య చివరి చెల్లెలిపై మనసుపడ్డాడు. ఈ విషయం భార్యకు గురువారం ఉదయం తెలిపాడు. చిన్న మరదలును పెళ్లి చేసుకుని ఆమెకు కూడా మంచి భవిష్యత్తు ఇస్తానని వగలుపోయాడు. చిర్రెత్తుకొచ్చిన భార్య ససేమిరా అని తెగేసి చెప్పింది. అయితే సదరు మొగుడు గారు చిన్న మరదలిని తనకు ఇచ్చి పెళ్లి చేస్తారా? లేదా? అంటూ భీష్మించాడు. బాలీవుడ్ మువీ ‘షోలే’లోని సీన్‌ని పెళ్లి కోసం వాడేశాడు. చకచకా వెళ్లి దగ్గర్లోని హై-ఓల్టేజ్ విద్యుత్ టవర్ ఎక్కి మరదలితో పెళ్లి జరిపించాలని డిమాండ్ చేశాడు.
రంగంలోకి దిగిన పోలీసులు, కుటుంబ సభ్యులు అతన్ని ఒప్పించే ప్రయత్నం చేశారు. సుమారు ఏడు గంటల పాటు హైడ్రామా నడిపించాడు. చివరకు చేసేదిలేక చిన్న మరదల్ని ఇచ్చి పెళ్లి చేస్తామని హామీ ఇవ్వడంతో అలకమాని టవర్ దిగి వచ్చాడు. చిన్న మరదలు కూడా తనను ప్రేమిస్తుందని చెప్పడం విశేషం.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.




