Telangana: కలిసొచ్చిన రిజర్వేషన్లకు నడిచొచ్చిన పదవులు.. ఆ ఊర్లో ముందే ఫిక్సైన సర్పంచ్ పోస్ట్!
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. ఆయా గ్రామాల్లో రిజర్వేషన్ల ఆధారంగా ఎవరు సర్పంచ్ గా పోటీ చేయాలో.. ఎవరు వార్డ్ మెంబర్లుగా పోటీ చేయాలో గల్లీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. కానీ వికారాబాద్ జిల్లాలోని ఓ గ్రామంలో మాత్రం సర్పంచ్ సహా రెండు వార్డు మెంబర్లు ముందే ఫిక్స్ అయ్యాయి. అది కూడా ఒకే కుటుంబంలోని వ్యక్తులకు. ఇదేదో ఏకగ్రీవ హామీతో జరిగింది కాదు. కలిసొచ్చిన రిజర్వేషన్లకు నడిచొచ్చిన పదవులు.

ఇంత లక్కీ ఫ్యామిలీ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం మంతన్ గౌడ్ లో ఉంది. ఇక్కడ 494 మంది ఓటర్లు ఉండగా, 8 వార్డులు ఉన్నాయి. సర్పంచ్ ఎస్టీ జనరల్ కు కేటాయించగా,. రెండు వార్డుల్లో ఒకటి ఎస్టీ జనరల్, మరొకటి ఎస్టీ మహిళకు రిజర్వేషన్ దక్కింది. అయితే మంతన్ గౌడ్ గ్రామంలో ఎరుకలి బీమప్పకు చెందిన ఒకే ఒక ఎస్టీ కులానికి చెందిన కుటుంబం ఉంది. ఎరుకలి భీమప్ప, భార్య వెంకటమ్మ దంపతులు బుట్టలు అల్లుతూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఎల్లప్ప, మహేష్ అనే ఇద్దరు కుమారులు, స్వప్న, సుజాత అని ఇద్దరు కోడళ్ళు ఉన్నారు. మొత్తం ఈ ఫ్యామిలీలో ఆరుగురు ఓటు హక్కు కలిగి ఉన్నారు.
ఇద్దరు కుమారులు హైదరాబాదులో ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. సర్పంచ్ ఎన్నికలు రావడంతో ఆ గ్రామానికి ఎస్టీ జనరల్ సర్పంచ్ రిజర్వేషన్ దక్కడంతో ఇక ఉన్న ఏకైక ఎస్టీ ఫ్యామిలిలోనే సర్పంచ్ ఖాయమని వారు భావిస్తున్నారు. పోటీకి మరో ఎస్టీ వ్యక్తి కూడా ఆ గ్రామంలో లేకపోవడంతో ఒక సర్పంచ్, రెండు వార్డు సభ్యులతో మొత్తం మూడు పదవుల్లో ఆ కుటుంబం ఏకగ్రీవం కానుంది.
గ్రామస్తులందరూ కలిసి సూచించిన మేరకు మా కుటుంబంలో ఎవరు సర్పంచ్ గా.. ఎవరు వార్డు సభ్యులుగా ఉండాలో నిర్ణయించుకుంటామంటున్నారు ఆ కుటుంబ పెద్ద భీమప్ప. కలహాలు లేకుండా కలిసిమెలిసి ఉంటున్న కుటుంబంలో పదవులను ఆనందంగా పంచుకుంటామని అంటున్నారు. మంతన్ గౌడ్ గ్రామంలో గత సర్పంచ్ ఎన్నికల్లో సర్పంచ్ ఎస్సీ రిజర్వేషన్ కాగా, 2 వార్డులను మాత్రం ఎస్టీకి కేటాయించారు. ఆ సమయంలో సైతం రెండు ఎస్టీ స్థానాల్లో పెద్దకొడుకు, పెద్ద కోడలు వార్డు సభ్యులుగా కొనసాగారు. మొత్తంగా మంతన్ గౌడ్ గ్రామ సర్పంచ్ ఎవరో ముందే డిక్లేర్ అయినట్లు ఉందని గ్రామస్థులు అంటున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




