Telangana: వేముల చేరికకు లైన్ క్లియర్ అయిందా? ఆ రోజునే కాంగ్రెస్ కండువా కప్పుకుంటారా?
హైదరాబాద్‌లో ఈనెల 17వ తేదీన జరగబోయే బహిరంగ సభలో పార్టీ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ సమక్షంలో బడా నేతల చేరికకు కాంగ్రెస్ పార్టీ రంగం సిద్ధం చేసింది. బీఆర్ఎస్ కు చెందిన తుమ్మల నాగేశ్వరరావు, మైనంపల్లి హనుమంతరావులు కాంగ్రెస్ కండువా కప్పుకొనున్నారు. అయితే నల్లగొండ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారు.
హైదరాబాద్‌లో ఈనెల 17వ తేదీన జరగబోయే బహిరంగ సభలో పార్టీ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ సమక్షంలో బడా నేతల చేరికకు కాంగ్రెస్ పార్టీ రంగం సిద్ధం చేసింది. బీఆర్ఎస్ కు చెందిన తుమ్మల నాగేశ్వరరావు, మైనంపల్లి హనుమంతరావులు కాంగ్రెస్ కండువా కప్పుకొనున్నారు. అయితే నల్లగొండ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారు.
నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం బీఆర్ఎస్ పార్టీ టికెట్ దక్కక పోవడం, పార్టీలో ప్రాధాన్యత ఇవ్వక పోవడం వంటి కారణాలతో పార్టీకి గుడ్ బై చెప్పారు. ఆ తర్వాత ఆయన అభిమానులు, మెజారిటీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఒత్తిడి చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ద్వారా వీరేశం ప్రయత్నాలు చేశారు. వీరేశం రాకకు రేవంత్ రెడ్డి టీమ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే వేముల వీరేశం చేరికకు భువనగిరి ఎంపీ, పార్టీ స్టార్ క్యాంపెనర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమ్మతి కూడా ఉండాలని రేవంత్ టీం అంతర్గతంగా సూచించింది.
అయితే పార్టీలోకి వేముల వీరేశం రాకను ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. నల్లగొండ కాంగ్రెస్ చేరికలపై కోమటిరెడ్డి తోపాటు మరో సీనియర్.. ఎంపీ ఉత్తమ్ కుమార్ సైతం తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే కోమటిరెడ్డి మాత్రం కార్యకర్తల మనోభావాల్ని పరిగణనలోకి తీసుకోవాలని పీసీసీకి, కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరారు. అయితే అందరినీ కూడదీసుకుని బీఆర్‌ఎస్‌కు ఢీ కొట్టాలనే ఆలోచనతో ఉన్న పీసీసీ చేరికలకు ఆటంకం కలగకుండా ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని బుజ్జగిస్తోంది. ఈ నేపథ్యంలో వీరేశం చేరికకు తెలంగాణ పీసీసీ సైతం పచ్చ జెండా ఊపిందనే ప్రచారం జోరుగా సాగుతోంది.
మరోవైపు కాంగ్రెస్ పార్టీలో వీరేశం చేరికను నియోజక వర్గ కాంగ్రెస్ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తాజాగా భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు శ్రీనివాస్ మానే నకిరేకల్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. అయితే నకిరేకల్ లో ఎప్పటి నుంచో టికెట్ ఆశిస్తున్న దైద రవీందర్, కొండేటి మల్లయ్య, వేదాసు శ్రీధర్, ప్రసన్న రాజ్ నేతలంతా తమ అభిప్రాయం చెప్పేశారట. కొత్తగా పార్టీలో చేరే వారికి వ్యతిరేకంగా తీర్మానం చేయడమే కాకుండా, తమలో ఒకరికి టికెట్ ఇవ్వాలని కొత్తగా చేరే వారికి టికెట్ ఇవ్వవద్దని వారి డిమాండ్ వినిపించారట. అయితే జిల్లా సీనియర్ నేతల అండదండలతో టికెట్ కొత్త వారికి ఇవ్వకుండా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారట.
మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కాంగ్రెస్ పార్టీలో చేరితే నకిరేకల్ తప్ప.. వేరే నియోజక వర్గం నుంచి పోటీ చేసే అవకాశం లేదు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎస్సీ నియోజకవర్గాలైన నకిరేకల్, తుంగతుర్తి ఉన్నాయి. అయితే తుంగతుర్తి నుంచి పిసిసి అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ టికెట్ రేసులో ఉన్నారు. దీంతో తుంగతుర్తి నుంచి వేముల వీరేశమును బరిలో దించే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. 2014లో ఎమ్మెల్యేగా గెలిచిన నకిరేకల్ నియోజకవర్గంలో వేముల వీరేశంకు బలమైన అనుచర గణం ఉంది. వేముల వీరేశమును పార్టీలో చేర్చుకుంటే నకరేకల్ టికెట్ ఇవ్వాల్సి ఉంటుందని కొందరు కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు.
కాంగ్రెస్ నేత పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి ద్వారా ఈ నెల 17వ తేదీన పార్టీ అధినేతల సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు వేముల వీరేశం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే పిసిసి అగ్రనేతలతో అంతర్గత భేటీలు కూడా పూర్తయ్యాయి. ఇక ఎవరేమి చేసినా ప్రజల్లో ఉన్న ఆదరణ, పార్టీ ముఖ్య నేతలతో ఉన్న భరోసాతో కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చే ఎన్నికల్లో వేముల వీరేశం బరిలో ఉంటారని ఆయన అనుచరులు అంటున్నారు. అయితే వేముల వీరేశం చేరిక 17వ తేదీన ఉంటుందని ఆయన అనుచరులు చెబుతున్నారు. మొత్తానికి మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కాంగ్రెస్ పార్టీలో చేరిక జరుగుతుందో లేదో తెలియాలంటే సెప్టెంబర్ 17వరకు వేచి చూడాల్సిందే.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..