Vegetable prices: కొనేదెలా… తినేదెలా… వెజి’ట్రబుల్స్’
మొంథా తుఫాన్ ప్రభావంతో కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. కూరగాయల కోసం మార్కెట్ కి వెళ్లాలంటే భయపడే పరిస్థితి ఏర్పడింది. వంద రూపాయలకే కాదు కొన్ని కూరగాయలు కేజీ 120, 150 రూపాయలు కూడా దాటుతున్నాయి. పూర్తి వివరాలు కథనం లోపల తెలుసుకుందాం...

ఉమ్మడి కరీంనగర్‌లో కూరగాయల ధరలు దడ పుట్టిస్తున్నాయ్…! కొందామని మార్కెట్‌కి వెళ్తే… కొండెక్కి కూర్చుంటున్నాయి. మొన్నటిదాకా ఐదు వందల రూపాయలకే నిండిపోయే బ్యాగ్… ఇప్పుడు వెయ్యి రూపాయలు పెట్టినా వెలవెలబోతోంది. నెలరోజుల ముందువరకు నిగనిగలాడుతూ ఇంటికొచ్చిన వెజిటబుల్స్… ఇప్పుడు ట్రబుల్స్ క్రియేట్ చేయడంతో సామాన్యుడు చిన్నబోతున్నాడు. కొనేదెలా… తినేదెలా అంటూ వర్రీ అవుతున్నాడు.
సాధారణంగా నవంబర్, డిసెంబర్ నెలల్లో కూరగాయల దిగుబడి ఎక్కువగా ఉండి రేట్లు తక్కువగా ఉంటాయ్. ఈ ఏడాది పరిస్థితి రివర్స్ అయ్యింది. వరుస వర్షాలు, మొంథా తుఫాన్ ఎఫెక్తో కూరగాయల దిగుబడి భారీగా తగ్గింది. అలాగే రవాణా మార్గాలకు ఆటంకం కలుగడం, రవాణా ఖర్చులు పెరగడంతోనూ మార్కెట్లకు కూరగాయల దిగుమతులు తగ్గుతున్నాయి. ఇటు కొత్త పంట చేతికి అందడానికి సమయం పట్టడంతో మార్కెట్‌లో కొరత ఏర్పడుతోంది. ఫలితంగా కూరగాయల ధరలు మండుతున్నాయ్.
పాత-కొత్త రేట్లకు మధ్య తేడాని ఓసారి చూద్దాం..
తుఫాన్‌కి ముందు… టమటా 30 నుంచి 40 రూపాయలుండేది. ఇప్పుడు 80 నుంచి 100 రూపాయలు పలుకుతోంది. ఆకు కూరలు ఏవైనా తుఫాన్‌కి ముందు కట్ట 30 నుంచి 40 రూపాయలుంటే… ఇప్పుడు 80 నుంచి 100 రూపాయలుంది. అప్పుడు గోరు చిక్కుడు 30 నుంచి 40 రూపాయలుంటే… ఇప్పుడు 60 నుంచి 65 రూపాయలకు పెరిగింది. ఇకప్పుడు 30 నుంచి 40 రూపాయలకే ఇంటకొచ్చే బెండకాయ… ఇప్పుడు హాఫ్ సెంచరీ దాటేసింది. 40 నుంచి 45 రూపాయలుండే బీరకాయ… ఇప్పుడు 70 నుంచి 80 పెడితేగానీ సంచిలోకి రానంటోంది.
కూరగాయల ధరలు ఒక్కసారిగా పెరిగిపోవడంతో సామాన్య జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 500లతో కూరగాయలు కొనుగోలు చేస్తే చిన్న కుటుంబానికి సైతం వారం రోజులు రావట్లేదంటున్నారు. మొత్తంగా… పేద, సామాన్యులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సబ్పిడీపై కూరగాయలు అందించడానికి చర్యలు తీసుకోవాలని పలువురు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
