iBomma: డామిట్… ఐబొమ్మ అడ్డం తిరిగింది…!
ఐబొమ్మ ఆట కట్టయింది. నాకు కోపం వస్తే మనిషిని కాను, కోట్ల మంది పర్సనల్ డేటా నా దగ్గరుంది, నా వెబ్‌సైట్ మీద ఫోకస్ చేస్తే మీకే డేంజర్.. అని ఓపెన్‌గా బెదిరింపులకు పాల్పడ్డ ఐబొమ్మ ఆటగాడికి చెక్ పెట్టేశారు సైబర్‌క్రైమ్ పోలీసులు. పైరసీ కంటెట్‌తో చెలరేగిపోయిన ఐబొమ్మ, బప్పం టీవీ వెబ్‌సైట్లను అతడి చేతులతోనే మూసి వేయించారు. అక్కడితోనే ఆగలేదు, వెబ్ లాగిన్స్, సర్వర్ డీటెయిల్స్ రాబట్టి మరోసారి పైరసీతో బొమ్మలాటకు తెగించకుండా తోక కత్తించే ప్రయత్నం కూడా జరుగుతోంది.

పైరసీ వెబ్‌సైట్ ఐబొమ్మకు హోల్ అండ్ సోల్ ఓనర్ ఇమ్మడి రవి.. ఇప్పుడు పోలీసుల చెరలో చిక్కాడు. అక్టోబర్ 1 నుంచి అతడి కదలికలపై నిఘా పెట్టి శనివారం ఉదయం కూకట్‌పల్లిలోని రెయిన్‌బో విస్టా అపార్ట్‌మెంట్‌లో అరెస్ట్ చేసి, మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిస్తే, 14 రోజుల రిమాండ్ విధించారు. 7 రోజుల కస్టడీని కోరి, పైరసీ వ్యవహారంలో రవికి ఎవరెవరు సహకరించారు..? ఇప్పటి వరకు ఎంత సంపాదించాడు..? ఇంకా ఎక్కడెక్కడ దాచాడనే కోణంలో దర్యాప్తు చేయబోతున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు.
ఇమ్మడి రవి ఇంట్లో హార్డ్ డిస్క్‌లు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని, బ్యాంకుల ఖాతాలో ఉన్న 3 కోట్ల నగదును కూడా సీజ్ చేశారు. డిలీటైన ఫైళ్లు కూడా రికవరీ చేశారు. 2018 నుంచి రెయిన్‌బో విస్టా నుంచే విదేశాలకు IPలు బదిలీ ఐనట్టు, యూకేలో కూడా టీమ్ నడిపినట్లు తేల్చారు. ఏడేళ్ల కిందట కూకట్‌పల్లిలో ఫ్లాట్ కొని ఉనికి బయట పడకుండా జాగ్రత్తపడ్డ రవి.. ఇప్పుడు కోర్టు కేసు విచారణ కోసం వచ్చి దొరికిపోయాడు. ఇన్నాళ్లూ తమ మధ్యనే ఉన్నది సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కాదని, ఇంటర్నేషనల్ కేటుగాడని తెలిసి ఇరుగూపొరుగు ఆశ్చర్యపోతున్నారు.
ఇమ్మడి రవి… పైరసీ కింగ్‌పిన్‌గా మారిన ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. సొంతూరు విశాఖపట్నం. ముంబై యూనివర్సిటీలో ఎంబీఏ చదివి, హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ కంపెనీ ఏర్పాటుచేసి, GettingUp, ER Infotech అనే సాఫ్ట్‌వేర్ కంపెనీలకి CEOగా కూడా పనిచేశాడు. అక్కడి నుంచి నెదర్ల్యాండ్స్, కరేబియన్ దీవులకు మకాం మార్చేశాడు. OTT సర్వర్లను హ్యాక్ చేసి, కంటెంట్‌ను చోరీ చేసి Cloud flareలో దాచేవాడు. ఐబొమ్మ, ఐవిన్, బప్పం అనే పోర్టల్స్ ద్వారా పైరసీకి పాల్పడ్డమే కాదు, వ్యూయర్స్‌ను బెట్టింగ్ యాప్స్ వైపు మళ్లిస్తున్నట్టు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు.
ఇప్పటికే ఐబొమ్మ, బప్పమ్ వెబ్‌సైట్లు బ్లాక్ చేయించిన పోలీసులు, అతని నెట్‌వర్క్, పైరసీ సామ్రాజ్యంపై ఫోకస్ పెంచారు. అటు, ఐబొమ్మ నిర్వాహకుడి అరెస్ట్‌పై స్పందించారు తెలంగాణ హోంశాఖ స్పెషల్ సీఎస్ సీవీ ఆనంద్. దమ్ముంటే పట్టుకోండి అని విర్రవీగినలాడిని పట్టుకున్నారుగా అంటూ సైబర్ క్రైమ్ పోలీసుల పనితీరును అభినందించారు.
