వెరైటీ దొంగతనం.. డబ్బు, నగలు వదిలేసి.. ఏం పట్టుకెళ్లాడో తెలుసా..?
దొంగతనాలు(theft) ఎక్కువగా బంగారం కోసమో, డబ్బు కోసమో జరుగుతుంటాయి. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలు ఇంట్లోకి చొరబడి విలువైన వస్తువులను చోరీ చేస్తారు. అయితే...
దొంగతనాలు(theft) ఎక్కువగా బంగారం కోసమో, డబ్బు కోసమో జరుగుతుంటాయి. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలు ఇంట్లోకి చొరబడి విలువైన వస్తువులను చోరీ చేస్తారు. అయితే తెలంగాణలోని తాండూరు(Tandur)లో జరిగిన ఈ దొంగతనం విస్మయం కలిగిస్తోంది. రాత్రి సమయంలో ఇంట్లో ప్రవేశించిన దుండగుడు.. బీరువాలోని నగలు, నగదును దొంగిలించకుండా కేవలం కొత్త బట్టలను మాత్రమే పట్టుకెళ్లాడు. దొంగతనం జరిగిందని గ్రహించిన ఇంటి యజమానులు.. పోలీసులకు సమాచారం అందించారు. విలువైన వస్తువులు దొంగతనానికి గురికాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. తెలంగాణలోని వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం కొడంగల్ రోడ్డు మార్గంలోని ఓ ఇంట్లో మోనాచారి అనే వ్యక్తి తన భార్య,కుమారులతో కలిసి నివాసం ఉంటున్నారు. తమ బంధువులకు అనారోగ్యంగా ఉండటంతో ఇంటికి తాళం వేసి పరిగికి వెళ్లారు. పది రోజులుగా అక్కడే ఉన్నారు.
ఈ క్రమంలో తాళం వేసి ఉన్న ఇంటిని గమనించిన దొంగ.. శుక్రవారం రాత్రి తాళం పగలగొట్టి లోపలికి ప్రవేశించాడు. సామగ్రిని చిందరవందర పడేశాడు. బీరువాలో 6 తులాల బంగారం, 30 తులాల వెండి ఆభరణాలు, కొంత నగదు, దుస్తులు ఉన్నాయి. ఇటీవలే కుమారుడి వివాహం కావడంతో కొత్త దుస్తులే ఎక్కువగా ఉన్నాయి. అయితే ఆ దొంగ మాత్రం.. బంగారం, వెండి ఆభరణాలను వదిలేసి, కేవలం కొత్త ప్యాట్లు, షర్టులు, చీరలు, ఇతర వస్త్రాలను మాత్రమే పట్టుకెళ్లాడు. శనివారం ఉదయం విషయం తెలుసుకున్న ఇంటి యజమానురాలు హైమావతి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చిన తరువాత ఇంటి తలుపులు తీసి చూశారు. బంగారం, వెండి భద్రంగానే ఉన్నాయని, కేవలం దుస్తులు మాత్రమే పోయాయని ఆమె చెప్పారు.
Also Read
Post Office Scheme: నెలనెలా ఆదాయం వచ్చే పోస్టాఫీస్ పథకం.. ఖాతా ఎలా తెరవాలంటే..