AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహాకుంభ మేళాకు వెళ్లి వస్తుండగా తెలంగాణ బస్సు దగ్ధం.. ఒకరు సజీవ దహనం

ఉత్తరప్రదేశ్‌లోని మధుర సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. బృందావన్‌లోని టూరిస్ట్ ఫెసిలిటేషన్ సెంటర్‌లో బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసినా, అప్పటికి బస్సు పూర్తిగా దగ్ధమైంది. నిర్మల్ జిల్లాకు చెందిన భక్తులతో మహాకుంభస్నానం చేసి బస్సు తిరిగి వస్తున్నట్లు సమాచారం.

మహాకుంభ మేళాకు వెళ్లి వస్తుండగా తెలంగాణ బస్సు దగ్ధం.. ఒకరు సజీవ దహనం
Bus Fire
Balaraju Goud
|

Updated on: Jan 15, 2025 | 8:13 AM

Share

ఉత్తరప్రదేశ్‌కు విహారయాత్రలో విషాదం చోటుచేసుకుంది. నిర్మల్ జిల్లాకు చెందిన యాత్రికులు ఉత్తరప్రదేశ్‌కు విహారయాత్రకు వెళ్లారు. ప్రమాదావశాత్తు వారు ప్రయాణిస్తున్న బస్సు మంటల్లో చిక్కుకొని దగ్ధమైంది. అందులో ఒకరు సజీవదహనమయ్యారు. మిగతా వారిని స్వస్థలాలకు చేర్చేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

ఉత్తరప్రదేశ్‌లోని మధుర-బృందావన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. మంగళవారం(జనవరి 14) బృందావన్‌లోని టూరిస్ట్ ఫెసిలిటేషన్ సెంటర్‌లో బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఫైర్‌ సేఫ్టీ సిస్టమ్‌తో మంటలను అదుపు చేసినా, అప్పటికి బస్సు పూర్తిగా దగ్ధమైంది. నిర్మల్ జిల్లాకు చెందిన భక్తులతో మహాకుంభస్నానం చేసి బస్సు తిరిగి వస్తున్నట్లు సమాచారం.

యాత్రికులను బైంసా రప్పించేందుకు చర్యలు కొనసాగుతున్నాయి. కేంద్ర మంత్రి బండి సంజయ్, ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ చొరవ చూపారు. అక్కడి కలెక్టర్, ఎస్పీతో మాట్లాడారు. యాత్రికులను క్షేమంగా తరలించే చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. సానుకూలంగా స్పందించిన ఉత్తరప్రదేశ్‌కు చెందిన బృందావన్ అధికారులు. ప్రత్యేక వాహనాల ద్వారా యాత్రికులను స్వస్థలాలకు తరలించేందుకు చర్యలు చేపట్టారు.

ఉత్తరప్రదేశ్ బృందావన్‌లో బస్సు దగ్ధమైంది. ప్రమాద సమయంలో బస్సులో 50 మంది యాత్రికులు ఉన్నారు. అయితే ఈ ఘటనలో నిజామాబాద్ జిల్లా కుబీర్ మండలం పల్సీకి చెందిన శీలం ద్రుపత్ ప్రమాదంలో సజీవదహనమయ్యారు. మిగిలిన యాత్రికులంతా సురక్షితంగా బయటపడ్డారు. కాగా, బస్సు, యాత్రికుల సామాగ్రి పూర్తిగా దగ్ధమైంది. ప్రస్తుతం యాత్రికులు యూపీ పోలీసుశాఖ, ఆర్ఎస్‌ఎస్‌ సంరక్షణలో ఉన్నారు.

ఇదిలావుండగా, బస్సులో బీడీలు కాల్చడమే అగ్నిప్రమాదానికి కారణమని ప్రాథమిక విచారణలో తేలింది. వంట కోసం గ్యాస్ సిలిండర్లను బస్సులో ఉంచడంతో మంటలు భారీ రూపం దాల్చాయి. మంటలు చెలరేగడంతో ప్రయాణికులు అద్దాలు పగులగొట్టి ప్రాణాలు కాపాడుకున్నారు. తెలంగాణలోని నిర్మల్ జిల్లా నుంచి 50 మంది భక్తులతో బస్సు బృందావనం చేరుకుంది. ఈ బస్సు మధ్యాహ్నం 2:30 గంటలకు టూరిస్ట్ ఫెసిలిటేషన్ సెంటర్‌కు చేరుకుంది. భక్తులు ఆలయ దర్శనానికి వెళ్లారు. కాగా, సాయంత్రం 5:30 గంటలకు బస్సులో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది బస్సులో మంటలను ఆర్పివేయడంతో ఈ ప్రయాణికుడి గురించిన సమాచారం వెలుగులోకి వచ్చింది.

బస్సులోపల చూసేసరికి ఓ భక్తుడి అస్థిపంజరం కనిపించింది. అనారోగ్యం కారణంగా ద్రుపదుడు మరో 50 మంది యాత్రికులతో ఆలయానికి వెళ్లలేకపోయాడు. వెనుక సీటులో కూర్చుని బీడీ తాగుతున్నాడు. ఇంతలో ఒక్కసారిగా బస్సులో మంటలు చెలరేగడంతో వారిని బయటకు తీసేందుకు కూడా అవకాశం లేకపోయింది. ఆ తర్వాత అతని అస్థిపంజరాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

సమాచారం అందుకున్న వెంటనే జిల్లా మేజిస్ట్రేట్ శైలేంద్ర కుమార్ సింగ్ ఇతర అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై పోలీసులు, అగ్నిమాపక శాఖలు సమగ్ర విచారణలో నిమగ్నమై ఉన్నాయి. బాధిత ప్రయాణికులకు అన్ని విధాలా సాయం చేస్తామని స్థానిక యంత్రాంగం హామీ ఇచ్చింది. ఈ ఘటనపై అధికారులు సంబంధిత వర్గాలకు సమాచారం అందించారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..