AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kishan Reddy: మహిళ పట్ల చూపుతున్న దురహంకారం మంచిది కాదు.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వార్నింగ్..

వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిల అరెస్టుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ప్రగతి భవన్ ముట్టడికి ప్రయత్నించినందుకు అడ్డుకుని అరెస్టు చేయడం సమంజసం కాదని మండిపడ్డారు. మహిళ పట్ల...

Kishan Reddy: మహిళ పట్ల చూపుతున్న దురహంకారం మంచిది కాదు.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వార్నింగ్..
Kishan Reddy
Ganesh Mudavath
|

Updated on: Nov 29, 2022 | 7:10 PM

Share

వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిల అరెస్టుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ప్రగతి భవన్ ముట్టడికి ప్రయత్నించినందుకు అడ్డుకుని అరెస్టు చేయడం సమంజసం కాదని మండిపడ్డారు. మహిళ పట్ల అసభ్యకరమైన రీతిలో టీఆర్ఎస్ ప్రభుత్వం చూపుతున్న దురహంకారం మంచిది కాదని హెచ్చరించారు. తన వాహనంలో ఉండగానే వైఎస్ షర్మిలను వాహనంతో సహా క్రేన్‌ సహాయంతో లాక్కెళ్లడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు వెల్లడించారు. ప్రతిపక్షాల గొంతునొక్కడమే ప్రధాన అజెండాగా టీఆర్ఎస్ పాలన సాగుతోందని కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. నర్సంపేట అసెంబ్లీ నియోజకవర్గంలోని లింగగిరిలో వైఎస్ షర్మిలకు చెందిన బస్సుకు టీఆర్ఎస్ శ్రేణులు నిప్పు పెట్టారు. వాహనాలపై దాడి చేశారు. ఈ దాడిలో నాలుగు వాహనాలు ధ్వంసమయ్యాయి. దీంతో ఉద్రిక్తత నెలకొంది. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు షర్మిలను అరెస్టు చేసి హైదరాబాద్ తీసుకువచ్చారు. నర్సంపేటలో టీఆర్ఎస్ శ్రేణుల దాడికి నిరసనగా ఇవాళ (మంగళవారం) ప్రగతి భవన్ ను ముట్టడించేందుకు షర్మిల బయల్దేరారు. ఈ క్రమంలో జరిగిన నాటకీయ పరిణామాలతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

కారులో వెళ్తున్న ఆమెను పంజాగుట్ట చౌరస్తా వద్ద పోలీసులు అడ్డుకున్నారు. అయినా ఆమె కారు దిగలేదు. దీంతో షర్మిల కారులో ఉండగానే క్రేన్ సహాయంతో పోలీసులు ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ పరిస్థితుల నడుమ అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కుమార్తెను చూసేందుకు ఎస్‌ఆర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌కు బయల్దేరిన వైఎస్‌ విజయమ్మను పోలీసులు అడ్డుకున్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా హౌజ్ అరెస్టు చేశారు. దీనిపై స్పందించిన ఆమె.. కూతురిని చూడనీయకుండా అడుగడుగునా అడ్డుకుంటున్నారని, నిరసన, ఆందోళనలు చేస్తే దాడి చేస్తారా అని వైఎస్.విజయమ్మ పోలీసులను ప్రశ్నించారు. ఈ ఘటన తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

మరోవైపు.. వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల పాదయాత్రకు తెలంగాణ హైకోర్టు అనుమతిచ్చింది. అత్యున్నత న్యాయస్థానంలో వైఎస్సార్టీపీ లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. ఆ పార్టీ నేత రవీంద్రనాథ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. టీఆర్ఎస్ కార్యకర్తలు పాదయాత్రకు ఆటంకం సృష్టించారని వ్యాజ్యంలో యాడ్ చేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం.. వైఎస్ షర్మిల పాదయాత్రకు అనుమతిస్తూ తీర్పు వెల్లడించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..