Kishan Reddy: రేవంత్, కేసీఆర్‌లకు కిషన్ రెడ్డి సవాల్.. తెలంగాణ అభివృద్ధిపై బహిరంగ చర్చకు పిలుపు!
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారం ముగుస్తున్న వేళ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన సవాల్ విసిరారు. తెలంగాణ అభివృద్ధిలో కేంద్రం పాత్రపై.. సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్‌లతో బహిరంగ చర్చకు సిద్ధమని ప్రకటించారు. “ప్రజలకు నిజం తెలియాలి... కేంద్రం చేసినది ఏమిటో ఒకసారి స్పష్టంగా చెప్పుకుందాం” అంటూ ప్రెస్‌క్లబ్ హైదరాబాద్‌కు వారిని ఆహ్వానించారు.

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారం ముగింపు వేళ.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కొత్త సవాల్ విసిరారు. హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడికి లేఖ రాసిన ఆయన… తెలంగాణ అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వ పాత్రపై సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్‌లతో కలిసి బహిరంగ చర్చకు సిద్ధమని ప్రకటించారు
ప్రతీ ఎన్నికల సమయంలో తెలంగాణకు కేంద్రం న్యాయం చేయలేదని, కేంద్ర మంత్రిగా తాను అడ్డంకిగా మారానని బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతలు పదే, పదే ఆరోపణలు చేస్తున్నారని ఆయన లేఖలో పేర్కొన్నారు. అయితే ఈ ఆరోపణలు పూర్తిగా రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్నవేనని కిషన్ రెడ్డి ఖండించారు.
గత సంవత్సరం (జూన్ 17, 2023) ఆర్టీసీ కళాభవన్‌లో ‘తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ సహకారం’ పేరిట సమగ్ర ప్రజెంటేషన్ ఇచ్చామని, 2014–2023 మధ్య కేంద్రం నుంచి రాష్ట్రానికి రూ.9 లక్షల కోట్లకు పైగా నిధులు కేటాయించినట్లు వివరించామన్నారు. రోడ్లు, రైల్వేలు, ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, గృహ నిర్మాణం, డిజిటల్ కనెక్టివిటీ, పరిశ్రమల అభివృద్ధి ఇలా అన్ని రంగాల్లోనూ కేంద్రం ప్రాముఖ్యత గల పెట్టుబడులు పెట్టిందని చెప్పారు.
అయినా కూడా బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు ప్రజల్లో తప్పుదోవ పట్టించే ప్రచారం కొనసాగిస్తున్నాయని విమర్శించారు. అందుకే కేంద్రం నుంచి తెలంగాణకు సంవత్సరాల వారీగా, రంగాల వారీగా కేటాయింపులు, కేంద్ర సహాయాలు, గ్రాంట్లు, ప్రాజెక్టులు…. జాతీయ పథకాలు, కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాలు… ఇవన్నీ ప్రజల ముందుంచి నిజాన్ని స్పష్టం చేయాలనే ఉద్దేశంతో ఈ బహిరంగ చర్చకు ఆహ్వానిస్తున్నానని పేర్కొన్నారు.
“ప్రజలకు వాస్తవాలు తెలుసుకునే హక్కు ఉంది. కేంద్రం పాత్రపై నిజం ఏదో ఒక్కసారిగా స్పష్టమవ్వాలి” అని కిషన్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు.
