Harish Rao: బీజేపీ నేతల మాటలకు మైకులు పగిలిపోతాయి తప్పా.. పేద ప్రజలకు ఒరిగిందేమీ లేదుః హరీష్ రావు
తెలంగాణ రాష్ట్ర సమితి 21వ ప్లీనరీ సమావేశాల్లో మంత్రి హరీష్ రావు కేంద్రంపై విరుచుకుపడ్డారు .తప్పనిసరిగా భవిష్యత్‌లో జాతీయ రాజకీయాల్లో టీఆర్ఎస్ కీలక పాత్ర పోషిస్తుందని హరీష్ రావు ధీమా వ్యక్తంచేశారు.
Telangana Minister Harish Rao: తెలంగాణ రాష్ట్ర సమితి 21వ ప్లీనరీ సమావేశాల్లో మంత్రి హరీష్ రావు కేంద్రంపై విరుచుకుపడ్డారు .తప్పనిసరిగా భవిష్యత్‌లో జాతీయ రాజకీయాల్లో టీఆర్ఎస్ కీలక పాత్ర పోషిస్తుందని హరీష్ రావు ధీమా వ్యక్తంచేశారు. తెలంగాణ సర్కార్ అమలు చేస్తున్న రైతుబంధు, మిషన్ భగీరథ ఇతర రాష్ట్రాలకు ఆదర్శమన్నారు. తెలంగాణ ఇతర రాష్ట్రాలకు దశ, దిశగా మారిపోయిందన్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతితో రాష్ట్రం అద్భుత ప్రగతి సాధించిందన్నారు హరీష్‌రావు.
కేంద్రంలోని బీజేపీ పాలనతో దేశంలోని అన్ని వర్గాలు ఇబ్బంది పడుతున్నాయని ఆరోపించారు. దేశంలో రైతులకు, నిరుద్యోగులకు బీజేపీ చేసిందేమీ లేదన్నారు. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ పాదయాత్రకు ప్రజాస్పందన లేదని ఎద్దేవా చేశారు. బండి సంజయ్ పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయని చెబుతారా అని ప్రశ్నించారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చిన బీజేపీ ఆ పనిచేయలేదని హరీష్ రావు అన్నారు. కాని, రైతుల పెట్టుబడి ఖర్చును రెట్టింపు చేసిందని అన్నారు. పెద్ద నోట్ల రద్దు చేసి గొప్ప మాటలు చెప్పారు కాని ఎక్కడా ఆ ఫలితాలు కనిపించలేదని తెలిపారు.
కేంద్రం నుంచి రావాల్సి న నిధులు విషయంలో బీజేపీ ప్రభుత్వం వ్యవహారశైలి సవ్యంగా లేదని తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావు ధ్వజమెత్తారు. ప్లీనరీలో తాను ప్రవేశపెట్టిన తీర్మానంపై హరీష్ రావు మాట్లాడారు. బీజేపీ నేతల మాటలకు మైకులు పగిలిపోతాయని, కాని చేతల విషయానికొస్తే ఎక్కడా కనిపించవని అన్నారు. నల్లధనాన్ని వెలికి తీస్తామని చెప్పిన బీజేపీ ఆ పని చేయకుండా నల్లచట్టాలు తెచ్చి అన్నదాతలను అష్టకష్టాల పాలు చేసిందని హరీష్ రావు అన్నారు. ఉద్యోగాల విషయంలోనూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాట తప్పిందని తెలిపారు. ప్రజలు పేదలుగా ఉండాలన్నది బీజేపీ ఆలోచనని హరీష్ రావు ఆరోపించారు. కేసీఆర్ మాత్రం సంపద సృష్టించి ప్రజలకు మేలుచేస్తారని గుర్తు చేశారు.