KTR in Plenary: బీజేపీ చేతిలో అధికారం – భారతావనికి అంధకారం.. కేసీఆర్ లాంటి టార్చ్ బేరర్ దేశానికి అవసరంః కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర సమితి 21వ ప్లీనరీ సమావేశంలో దేశ విస్తృత ప్రయోజనాల రీత్యా జాతీయ రాజకీయాల్లో టీఆర్ఎస్ పార్టీ కీలక భూమిక పోషించాలని రాజకీయ తీర్మానాన్ని ప్రతిపాదించారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.

KTR in Plenary: బీజేపీ చేతిలో అధికారం - భారతావనికి అంధకారం.. కేసీఆర్ లాంటి టార్చ్ బేరర్ దేశానికి అవసరంః కేటీఆర్
Ktr
Balaraju Goud

|

Apr 27, 2022 | 4:50 PM


TRS Working President KTR in Plenary: తెలంగాణ రాష్ట్రం నేడు తలెత్తుకొని నిలబడిందంటే దానికి వన్‌ అండ్‌ ఓన్లీ రీజన్‌ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి 21వ వార్షికోత్సవం ప్లీనరీ సమావేశంలో దేశ విస్తృత ప్రయోజనాల రీత్యా జాతీయ రాజకీయాల్లో టీఆర్ఎస్ పార్టీ కీలక భూమిక పోషించాలని రాజకీయ తీర్మానాన్ని ప్రతిపాదించిన అనంతరం మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. జనహితమే అభిమతమంటూ టీఆర్ఎస్ పరిపాలన సాగుతోందని ఆయన తెలిపారు. నేడు దేశానికి తెలంగాణ తరహా అభివృద్ధి కావాలని అన్నారు. ఈ దేశానికి ఒక విజనరీ కావాల్సిన అవసరం ఉందని అన్నారు. దేశానికి బంగారు తెలంగాణ విధానాన్ని పరిచయం చేయాల్సిన అవసరముందని కేటీఆర్‌ అన్నారు. నేడు తెలంగాణ ఆచరిస్తున్న విధానాలను రేపు యావత్‌ దేశం ఆచరించడం తథ్యమని తెలిపారు.

తెలుగుజాతి చరిత్రలో ఇద్దరు మహనీయులు రాజకీయాలను మలుపు తిప్పారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు చరిత్ర సృష్టిస్తే, మన కేసీఆర్ గారు చరిత్రతో పాటు…రాష్ట్రాన్ని సాధించారు. ఇతర రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు ఉంటే, రాష్ట్రాన్ని తేచ్చిన వారే మనకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. తెలంగాణ ప్రజల ప్రత్యేక ఆకాంక్ష రాష్ట్రాన్ని సాధించి, ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నికైన కేసీఆర్ జన్మ ధన్యమని అప్పటి స్వర్గీయ ప్రణబ్ ముఖర్జీ తెలిపారని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. నా జీవితంలో గొప్ప ఆందోళనకారులను గొప్ప పరిపాలకులను చూశాను కానీ ఒక ఆందోళన కారుణిగా, ఒక గొప్ప పరిపాలకునిగా ఉన్న వ్యక్తి కెసిఆర్ గారి అని అరుణ్జైట్లీ అన్నారన్నారు. ఈరోజు తెలంగాణ ఆచరిస్తున్నది, రేపు దేశం తప్పక ఆచరించాల్సిన పరిస్థితి వచ్చే గొప్ప స్థాయికి మనరాష్ట్రం చేరుకుంటుందని కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు.

ప్రధానిగా మోదీ ఉంటే ఈ దేశానికే ముప్పు అని మంత్రి కేటీఆర్‌ అన్నారు. దేశాన్ని అంతర్జాతీయంగా నెంబర్‌ వన్ స్థానంలో నిలుపుతానని చెప్పిన ప్రధాని సిలిండర్‌ ధరల విషయంలో మాత్రం ఆ పనిచేశారని ఎద్దేవా చేశారు. గోల్‌మాల్‌ గుజరాత్‌ మోడల్‌తో ప్రజలను తప్పుదోవ పండించి గుజరాత్‌ పెద్దలు నేడు ఢిల్లీలో కూర్చున్నారని కేటీఆర్‌ ఆరోపించారు. నల్లచట్టాలు తెచ్చి రైతులను 13 నెలల పాటు అష్టకష్టాలపాలు చేసిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీదని విమర్శించారు. రైతులను మజ్‌బూత్‌ చేస్తానని చెప్పిన మోదీ నేడు వారిని మజ్దూర్లుగా మార్చుతున్నారని మండిపడ్డారు.

కేసీఆర్‌ రైతుబంధు పథకం తెచ్చేంత వరకు భారతదేశ రైతులకు న్యాయం జరగలేదని ఐటీ మంత్రి కేటీఆర్‌ అన్నారు. నేడు కేసీఆర్‌ తెచ్చిన రైతుబంధు కారణంగానే పీఎం కిసాన్‌ బంధు పథకం పేరు మార్పుతో కేంద్రం తీసుకువచ్చిందని తెలిపారు. దేశంలో విద్యుత్‌ సమస్యలు లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ అని KTR అన్నారు. రాష్ట్రం ఏర్పడిన ఆరు నెలల కాలంలోనే విద్యుత్‌ సమస్యల నుంచి గట్టెక్కామంటే దానికి కేసీఆర్‌ కృషి కారణమని అన్నారు. తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమం సమానంగా సాగుతున్నాయంటే దానికి సీఎం కేసీఆర్‌ దక్షతే కారణమని కేటీఆర్‌ అన్నారు. కాలంతో పోటీపడిన ప్రపంచంలోనే అతి భారీ లిఫ్ట్ ఇరిగేషన్‌ ప్రాజెక్టును పూర్తి చేసి రాష్ట్రంలో జలసమస్యలను తొలగించారని అన్నారు.

బీజేపీ చేతిలో అధికారం – దేశాన్ని అంధకారం చేసిందని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. నరేంద్ర మోడీ తన పాలనలో దేశాన్ని చీకట్లో నిల్చోపెట్టారు. ఇది NDA ప్రభుత్వం కాదు.. NPA ప్రభుత్వం అన్న కేటీఆర్.. NPA అంటే నాన్ పర్ఫామింగ్ అసెట్స్ అనాలి అని మంత్రి పిలుపునిచ్చారు. మతాల పేరుతో కొట్లాడాలి అని ఏ దేవుడు చెప్పిండు? మేరా భారత్ మహాన్ అనే నాయకుడు దేశానికి కావాలి.. కానీ ఆ నాయకుని తెలంగాణ అందిస్తుందేమో చెప్పాలన్నారు. ఉద్వేగాల దేశం కాదు- ఉద్యోగాల దేశం కావాలన్నారు కేటీఆర్. కేసీఆర్ లాంటి టార్చ్ బేరర్ దేశానికి అవసరమని కేటీఆర్ స్పష్టం చేశారు.

75 ఏళ్ల స్వతంత్ర భారతంలో అనేక మంది పరిపాలకులున్నా… రైతులకు వ్యవసాయ రంగానికి, రైతుబంధు లాంటి కార్యక్రమంతో అద్భుతమైన కార్యక్రమం తీసుకువచ్చిన పాలకులు ఎవరు లేరు. తెలంగాణ పథకాలు రైతుబంధు, మిషన్ భగీరథ, టీఎస్ ఐపాస్ వంటి అనేక కార్యక్రమాలను కేంద్రం కాపీకోడుతుంది. ప్రాజెక్టుల నిర్మాణంలో చైనా ను తలదన్నే వేగంతో ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టారు. వలస పోయిన పాలమూరు ను తిరిగి తీసుకు వచ్చినా.. దశాబ్దాల ఫ్లోరోసిస్ తరిమికొట్టినా.. వర్గ, మత విభేదాలు లేకుండా… అభివృద్ధి కొనసాగుతుందన్నా ఇదంతా కేసీఆర్ నాయకత్వం వల్లనే సాధ్యమైందన్నారు.

భారతదేశానికి బంగారు తెలంగాణ మోడల్ ని పరిచయం చేయాలి. లక్ష ఇరవై నాలుగు వేల రూపాయలున్న తలసరి ఆదాయం 278000 పెరిగింది. రాష్ట్ర gsdp రెట్టింపు అయింది. తెలంగాణ ప్రజలు కట్టిన పన్నులు బీజేపీ నాయకత్వంలోని భీమారు రాష్ట్రాలకి అందుతున్నాయి. మత పిచ్చి లేని, కుల పిచ్చి లేని పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడాలన్న.. విశ్వమానవ సౌభ్రాతృత్వమే తెలంగాణ మోడల్ అన్న కేటీఆర్.. తెలంగాణది అద్భుతమైన సాఫల్య చరిత్ర అయితే, బీజేపీది, కేంద్రానిది అంతులేని వైఫల్యాల చరిత్ర అని ఎద్దేవా చేశారు.

ఏడాదికి రెండు కోట్ల చొప్పున ఎనిమిది ఏళ్లలో 16 కోట్ల ఉద్యోగాలు ఇయ్యయాల్సింది పోయి…. ఉన్న ఉద్యోగాలను పడగొట్టి, ప్రభుత్వరంగ సంస్థలను అమ్ముతున్నారు… పకోడీలు వేసుకోవడం కూడా ఉద్యోగం అని చెప్పి దభాయిస్తున్నారని విమర్శించారు. లోకల్ ఫర్ వోకల్ అనే నరేంద్రమోడీ తెలంగాణ సాధించిన విజయాలను కట్టిన ప్రాజెక్టులకు గురించి ఒక్క మాట చెప్పరు…. తెలంగాణ విజయాలు దేశం విజయాలు కావా అని ప్రశ్నించారు. ఆత్మ నిర్భర్ భారత్ అంటు మనో నిబ్బరం కోల్పోయే విధంగా చేస్తున్నారు… హర్ ఘర్ జల్ అనే మోడీ… ప్రతి ఇంటిలో జహర్ ను నింపుతున్నారు. 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీ పేరెత్తితే అది ఒక జుమ్లా అంటారు. దేశభక్తి పేరు చెప్పి దేశంలోని సంస్థలను అమ్ముతున్నారు… భేచో ఇండియా అంటున్నారు. ఇప్పుడు కావాల్సింది ఉద్వేగ భారతం కాదు… ఉద్యోగాల భారతమని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ లాంటి వ్యవసాయ అనుకూల పథకాలు.. సంక్షేమ పథకాలు దేశానికి అవసరమన్నారు. బుల్డోజర్ మాడలు… బిల్డప్ మోడల్… గోల్ మాల్ గుజరాత్ మోడల్ కాదు… తెలంగాణ మోడల్ కావాలి. ఇందుకోసం తెలంగాణను విజయవంతంగా ముందుకు నడిపిన కేసీఆర్ నాయకత్వం దేశానికి కావాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu