Telangana: మరో మలుపు తీసుకున్న కొండా సురేఖపై ట్రోలింగ్ వ్యవహారం.. మధ్యలోకి సినిమా ఇండస్ట్రీ!

మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ వ్యవహారం మరో మలుపు తీసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు క్షమాపణలు చెప్పలేదంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూ.. సినీ ఇండస్ట్రీని మధ్యలోకి లాగారు సురేఖ.

Telangana: మరో మలుపు తీసుకున్న కొండా సురేఖపై ట్రోలింగ్ వ్యవహారం.. మధ్యలోకి సినిమా ఇండస్ట్రీ!
Ktr Konda Surekha
Follow us

|

Updated on: Oct 02, 2024 | 9:13 PM

మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ వ్యవహారం మరో మలుపు తీసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు క్షమాపణలు చెప్పలేదంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూ.. సినీ ఇండస్ట్రీని మధ్యలోకి లాగారు సురేఖ. టాలీవుడ్ ప్రముఖుల పేర్లు ప్రస్తావిస్తూ డ్రగ్ మరకలు అంటించారు. ఈ వ్యాఖ్యలతో రాజకీయ రగడ మరో లెవెల్‌కి వెళ్లిపోయింది.

మంత్రి కొండా సురేఖ ప్రెస్‌మీట్‌లో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఓ సభలో బీజేపీ ఎంపీ రఘునందన్‌ తనకు మెడలో దండ వేస్తే.. సోషల్ మీడియాలో అడ్డగోలుగా ట్రోల్ చేశారన్నది సురేఖ ఆవేదన. ఆ ట్రోల్ చేసింది కూడా బీఆర్ఎస్ సోషల్ మీడియా టీమేనని ఆరోపించారు. వెంటనే బీఆర్ఎస్ నేతలు టీఆర్, హరీష్‌ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇదే ట్రోల్‌పై బీజేపీ ఎంపీ రఘునందన్‌ రావు కూడా స్పందించారు. ట్రోల్ చేసిన వ్యక్తి బీఆర్ఎస్ కార్యకర్త అయితే పోలీసులకు అప్పగించాలని.. లేదంటే ఫిర్యాదు చేయాలని సలహా ఇచ్చారు.

ట్రోల్‌తో మొదలైన వివాదంపై మాజీ మంత్రి హరీష్‌రావు ట్వీట్ చేశారు. సురేఖకు కలిగిన అవమానానికి బాధపడుతున్నాను అన్నారు. అయితే కేటీఆర్ మాత్రం స్పందించలేదు. ఈ క్రమంలో సురేఖ మరోసారి కేటీఆర్‌పై విమర్శలు చేశారు. విమర్శలు చేసే క్రమంలో సినిమా ఇండస్ట్రీని మధ్యలోకి లాగారు. ఇండస్ట్రీలో చాలామందికి కేటీఆర్‌ డ్రగ్స్ అలవాటు చేశారన్నారు. ఒకరిద్దరి పేర్లను కూడా ప్రస్తావించారు.

కొండా సురేఖ కామెంట్లకు బీఆర్ఎస్ నుంచి కౌంటర్స్ మొదలయ్యాయి. ఖబడ్దార్.. నాలుక చీరేస్తాం, ఉరికిస్తాం అంటూ రివర్స్ ఎటాక్‌కి దిగారు గులాబీ నేతలు. పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు మాజీ ఎంపీ మాలోతు కవిత. మరోవైపు సురేఖ క్షమాపణ చెప్పకుంటే కోర్టుకెళ్తామన్నారు బీఆర్‌ఎస్ నేత ప్రవీణ్ కుమార్‌. కాగా, ట్రోలింగ్ వ్యవహారంపై స్పందించిన కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి.. సురేఖతో పెట్టుకోవద్దని సూచించారు.

ఇదిలావుంటే, సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన హీరో నాగార్జున.. ఆమె ఆరోపణలు అసంబద్ధం, అబద్దం అని కొట్టిపారేశారు. ఇక ఏపీలో లడ్డూ వివాదంపై వరుస ట్వీట్‌లతో హీట్ పుట్టిస్తున్న ప్రకాష్‌ రాజ్‌.. తెలంగాణలో ఏంటీ రాజకీయాలని ప్రశ్నించారు. సినిమా వాళ్లంటే అంత చిన్న చూపా అంటూ ట్వీట్ చేశారు.

మొత్తానికి కొండా సురేఖపై ఎవరు ట్రోల్ చేశారో.. ఎక్కడి నుంచి పోస్ట్ చేశారో తెలియదు.. కానీ ఇద్దరి మధ్య రాజకీయం సినిమా ఇండస్ట్రీని నలిగిపోయేలా చేస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..