Dandari Festival: అడవిలో అంబరాన్నంటిన ‘దండారి’ సంబరాలు.. గిరిజనులంతా కలిసి..
Dandari Festival: ఆదివాసీల పెద్దపండుగ.. గిరిజనలంతా కలిసి దండిగా జరుపుకునే ‘దండారి’ పండుగ అడవుల జిల్లా ఆదిలాబాద్‌లో ఘనంగా కొనసాగుతుంది.

Dandari Festival: ఆదివాసీల పెద్దపండుగ.. గిరిజనలంతా కలిసి దండిగా జరుపుకునే ‘దండారి’ పండుగ అడవుల జిల్లా ఆదిలాబాద్‌లో ఘనంగా కొనసాగుతుంది. జిల్లాలోని ఇంద్రవెళ్లి, నార్నూర్, ఉట్నూర్ పరిధిలో దండారి వేడుకల్లో కేంద్ర బృందం పాలుపంచుకుంటోంది. గిరిజనులకు ఆరాధ్య దైవం అమ్మమ్మ పద్మల్ పురి కాకో దేవాలయానికి భారీగా ఆదివాసీ భక్తులు తరలి వస్తున్నారు. తెలుగు రాష్ట్రంలో ఆదివాసీలు జరుపుకునే అతి పెద్ద పండుగ ‘దండారి’ కావడంతో ఆదివాసీ తెగల వంశస్తులు చత్తీస్‌ఘడ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తెలంగాణలోని వివిధ ఆదివాసీ ప్రాంతాల నుండి భారీగా తరలి వస్తున్నారు. దండారి వేడుకలో గుస్సాడి వేషదారణ, రేలారే రేలా ఆటపాటలు, ఆదివాసీ మహిళల ప్రత్యేక పూజలు ఆకట్టుకుంటున్నాయి.
అడవి తల్లి ఒడిలో ‘దండారి’ సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. దీపావళి పండుగ వేళ లోకమంతా వెలుగులతో మురిసిపోతుంటే.. ఆదివాసీ గూడాలు గుస్సాడీ నాట్యాలతో మరింత శోభాయమానంగా కనిపిస్తున్నాయి. గోండ్ గూడాలు దండారితో మారుమోగుతున్నాయి. వాయిద్యాల చప్పుళ్లతో గల్లు గల్లుమనే గజ్జల రవళుల మధ్య సాగుతున్న నృత్యగానాలు కోలాహలంతో గోండు గూడాలు సందడిగా మారాయి. దండారి సంబరాలు అడవి బిడ్డల గుండెల్లో ఆనందోత్సవాలు నింపుతున్నాయి.
ఆదివాసీ సంస్కృతిలో దీపావళి పండుగకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. దీపావళి పండుగ సందర్భంగా జరుపుకునే దండారి పండుగ ఆదివాసీలకు అత్యంత ప్రాధాన్యమైనది. దండారి సంబురాలు దీపావళి రోజుతో ముగుస్తాయి. దండారి పండుగ ఆదివాసుల్లో ఐక్యతను మరింత బలోపేతం చేస్తుంది. దండారి బృందాలు ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి వెళ్లి వారితో కలిసి ఆటా పాట వినోదాల్లో పాలుపంచుకుంటాయి. దండారిలో ఆట పాటలకు ఉపయోగించే డప్పు, రడమేళా, డోల్, వెట్టి, కర్ర, పెప్రి, తుడుం సంగీత పరికరాలను నెమలి ఈకలతో పేర్చిన గుస్సాడి కిరీటీలను ముఖానికి ధరించే పువ్వులను గ్రామం మధ్యన గుట్టపైన పేర్చి, సంప్రదాయ రీతిలో పూజలు జరిపి, మేకలు, కోళ్లను బలివ్వడం ఆచారం. దేవతల అనుగ్రహం పొందామని సంతృప్తి చెందిన తర్వాతనే నృత్యాలు ప్రారంభిస్తారు.
గుస్సాడి నృత్యం చేసే వారిని దేవతలు ఆవహిస్తారని, అతను అతని రోకలితో శరీరాన్ని తాకితే ఎలాంటి రోగాలైన నయమవుతాయని ఆదివాసులు అపార నమ్మకం. మెడలో రుద్రాక్షలు అడవిలో దొరికే కాయలతో, గువ్వలతో పేర్చిన దండలు గుస్సాడీల ఒంటిపై వేలాడుతుంటాయి. తలపై నెమలి ఈకలతో కూర్చిన కిరీటం చిన్న చిన్న అద్దాలు, జింక కొమ్ములు, నడుముకు, కాళ్లకు గజ్జలు ఇలాంటి వేషదారణతో ప్రత్యేకంగా కనిపిస్తారు గుస్సాడీలు. ఇప్పటికీ అడవిబిడ్డల సంస్కృతి సంప్రదాయాలు కల్తీ లేకుండా కొనసాగుతూనే ఉన్నాయి. లోకమంతా దీపావళి వేళ పూజలు, విద్యుత్ అలంకరణలతో దీపారాధనతో పండుగ జరుపుకుంటంటే.. ఆదివాసీల పండుగ దీపావళి మాత్రం దండారి రూపంలో అట్టహాసంగా అడవితో మమేకమవుతూ సాగుతుంది.
Also read:
T20 World Cup 2021, IND vs SCO: వంద శాతం ప్రయత్నిస్తాం.. కోహ్లీసేనను ఓడిస్తాం: స్కాంట్లాండ్ సారథి
Eggs Farming: కోడి సంవత్సరానికి ఎన్ని గుడ్లు పెడుతుందో తెలుసా? ఇంట్రస్టింగ్ విశేషాలు మీకోసం..
America Diwali: హౌట్‌హౌస్‌లో దీపావళి వేడుకలు.. శుభాకాంక్షలు తెలిపిన అధ్యక్షుడు జో బైడెన్
