Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో కాక రేపుతున్న ఆ నియోజకవర్గం.. ఆ ఇద్దరు లీడర్ల మధ్య సీటు కోసం సీటు చిరిగేలా ఫైటు..
ఒకప్పుడు అది కాంగ్రెస్‌కు కంచుకోట. ఇప్పుడు ఖాళీ కోటగా మారిపోయిందట. అయినా కాంగ్రెస్ సీటు కోసం సీటు చిరిగేలా ఫైటు జరుగుతోందంటున్నారు. టికెట్ కోసం నేతలు ఇప్పట్నించే యుద్ధం మొదలు పెట్టారట. గ్రూపులుగా విడిపోయి మరీ టికెట్ ఫైట్ చేస్తున్నారని సమాచారం. తెలంగాణ కాంగ్రెస్‌లో కాక రేపుతున్న ఆ నియోజకవర్గం ఏది?
టికెట్ కోసం నేతలు ఇప్పట్నించే యుద్ధం మొదలు పెట్టారట. గ్రూపులుగా విడిపోయి మరీ టికెట్ ఫైట్ చేస్తున్నారని సమాచారం. తెలంగాణ కాంగ్రెస్‌లో కాక రేపుతున్న ఆ నియోజకవర్గం ఏది?. దుబ్బాక నియోజకవర్గం ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అని చెబుతారు. మాజీ మంత్రి ముత్యంరెడ్డి ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నన్ని రోజులు కాంగ్రెస్ హవా కొనసాగిందట. కానీ ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందని టాక్. దీనికి తోడు నేతల మధ్య వర్గపోరు కూడా ఎక్కువగానే ఉందంటున్నారు. దుబ్బాక నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు నేతలు వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ నాకే వస్తుందంటే నాకే వస్తుందంటూ ప్రచారం చేస్తున్నారని చెబుతున్నారని లోకల్ టాక్. అయితే వారికి వీలైనప్పుడు మాత్రమే నియోజక వర్గంలో ప్రత్యక్షమవుతున్నారట.
పన్యాల శ్రవణ్ కుమార్ రెడ్డి మెదక్ పార్లమెంటు సభ్యునిగా 2009, 2014లో రెండు సార్లు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. వచ్చే ఎన్నికల్లో దుబ్బాక ఎమ్మెల్యేగా పోటీ చేయాలని, టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు. ఎంపీగా పోటీ చేసి రెండుసార్లు ఓడిపోవడంతో, ఆ సానుభూతితో ఈసారి ఎమ్మెల్యేగా పోటీచేసి అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారట.
టికెట్ రేసులో చెరుకు శ్రీనివాస్‌రెడ్డి
ఇక నియోజకవర్గంలోని మరో నాయకుడు చెరుకు శ్రీనివాస్ రెడ్డి.. ఈయన మాజీ మంత్రి ముత్యంరెడ్డి కొడుకు. మొదట కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేసి తర్వాత టిఆర్ఎస్‌లో చేరారు. అయితే సోలిపేట రామలింగారెడ్డి ఆకస్మిక మృతితో వచ్చిన ఉపఎన్నికలో టిఆర్ఎస్ టికెట్ రాకపోవడంతో కాంగ్రెస్ టికెట్ తెచ్చుకొని ఓటమిని చవిచూశారు. శ్రీనివాస్‌రెడ్డి ఈసారి కూడా ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారట. అయితే కాంగ్రెస్ టికెట్ కోసం పోటీ పడుతున్న ఇద్దరు నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి ఉందని చెబుతున్నారు.
పన్యాల, చెరుకు వర్గాల మధ్య పోరు
గతంలో ఎంపీగా పోటీచేసిన శ్రవణ్ రెడ్డి మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేయడం ఏంటి అని శ్రీనివాస్‌రెడ్డి ప్రశ్నిస్తుంటే, గతంలో పార్టీ మారిన శ్రీనివాస్ రెడ్డికి మళ్ళీ టికెట్ ఎలా ఇస్తారు అని పార్టీ పెద్దలను ప్రశ్నిస్తున్నారుట శ్రవణ్‌రెడ్డి.
గతంలో రేవంత్ పీసీసీ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టిన సందర్భంలో దుబ్బాకలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఇరు వర్గాలు గొడవ పడ్డాయి. ఈమధ్యే ముగిసిన రాహుల్ జోడో యాత్రలో కూడా ఇద్దరు నేతలు ఎవరికివాళ్లే యమునాతీరే అన్నట్టు వ్యవహరించారని చెబుతున్నారు.
కేడర్‌ను పట్టించుకోని ఇద్దరు నేతలు
అయితే టికెట్ కోసం ఇంత ఆరాట పడుతూ పోరాటం చేస్తున్న నేతలు ఇద్దరూ కేడర్‌ను అస్సలు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దుబ్బాకలో కూడా తమకు వీలైనప్పుడు ప్రత్యక్షమై అందరికి దర్శనమిచ్చి వెళ్లిపోతారట. దీంతో నియోజకవర్గాన్ని, కార్యకర్తలను పట్టించుకోని వీళ్లకు టికెట్ ఎందుకు ఇవ్వాలి అని ప్రశ్నిస్తున్నారట పార్టీ కేడర్. మరి వీరి విషయంలో కాంగ్రెస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని సమాచారం.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం