Heart Attack: మూడో తరగతి విద్యార్థికి గుండెపోటు.. ఆడుకుంటుండగా కుప్పకూలి మృతి!

గుడిలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంటే సందడిగా గంతులు వేస్తూ నవ్వులు చిందిన చిన్నారి గుండెపోటుతో అక్కడికక్కడి మృతి చెందాడు. మూడో తరగతి చదువుతున్న బాలుడు గుండె పోటుతో హఠాత్తుగా మృతి చెందడంతో స్థానికంగా విషాద చాయలు అలముకున్నాయి. ఈ విషాద ఘటన జగిత్యాల రూరల్ మండలం పోరండ్ల గ్రామంలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..

Heart Attack: మూడో తరగతి విద్యార్థికి గుండెపోటు.. ఆడుకుంటుండగా కుప్పకూలి మృతి!
3rd Class Student Dies Of Heart Attack

Updated on: Apr 08, 2026 | 6:51 PM

జగిత్యాల రూరల్‌, ఏప్రిల్‌ 8: జగిత్యాల రూరల్‌ మండలం పొరండ్ల గ్రామంకి చెందిన తోపారపు చంద్రశేఖర్‌, నవిత దంపతుల కుమారుడు నిశాంత్‌ (9). అదే గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో నిషాంత్‌ 3వ తరగతి చదువుతున్నాడు. మంగళవారం గ్రామ శివారులోని శివాలయంలో అన్నదాన కార్యక్రమానికి కుటుంబంతో కలిసి వెళ్లాడు. అన్నదానం జరుగుతున్న సమయంలో అప్పటిదాకా కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడిపిన నిశాంత్‌ పిల్లలతో ఆడుకుంటూ ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయాడు. అపస్మారక స్థితిలో ఉన్న బాలుడిని కుటుంబ సభ్యులు చికిత్స కోసం హుటాహుటీన జగిత్యాల ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే గుండెపోటుతో మృతి చెందినట్టు ధ్రువీకరించారు.

బాలుడికి కేవలం 9 ఏళ్ల వయసులోనే గుండెపోటు రావడం, ఆసుపత్రికి చేరేలోపే ప్రాణాలు కోల్పోవడం చూసిన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఒక్కగానొక్క కొడుకు కళ్ల ఎదుటే మృతి చెందడంతో కన్నోళ్ల వేదన వర్ణనాతీతంగా మారింది. ఈ ఘటనతో పోరండ్ల గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. కాగా ఇటీవల కాలంలో వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల్లో కూడా గుండెపోటు సంభవించడం నిత్యం ఏదో ఒక చోట చోటుచేసుకుంటుంది. ఒకప్పుడు 60 ఏళ్లు పైబడిన ముదుసలి తనంలో వచ్చే గుండె జబ్బులు పసివాళ్లను సైతం మృతి ఒడికి చేర్చుతున్నాయి.

జీవనశైలిలో మార్పుల వల్లనే చిన్నపిల్లల్లో గుండెపోటు వస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. అధిక బరువు, జంక్ ఫుడ్ తీసుకోవడం, శారీరక శ్రమ లేకపోవడం వంటి కారణాలతో చిన్న వయసులోనే శరీరంలో కొలెస్ట్రాల్ పెరుగుతోంది. దీనికితోడు పుట్టుకతో వచ్చే గుండె లోపాలను సకాలంలో గుర్తించకపోవడం కూడా కారణమే. కార్డియోమయోపతి అనే గుండె కండరాలకు సంబంధించిన వ్యాధి బారిన పడిన పిల్లల్లో గుండె రక్తాన్ని సరిగా పంపింగ్ చేయలేదు. దీంతో హఠాత్తుగా గుండె ఆగిపోయే ప్రమాదం ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us