Telangana: రాష్ట్రవ్యాప్తంగా ముగియనున్న మున్సిపల్ పాలక వర్గాల పదవీ కాలం.. వాట్ నెక్ట్..?
తెలంగాణ వ్యాప్తంగా మునిసిపాలిటీ పాలక వర్గాల గడువు జనవరి 26తో ముగుస్తోంది. ఈ నేపథ్యంలో పట్టణ స్థానిక సంస్థల్లో స్పెషల్ ఆఫీసర్ల పాలన రానుంది. అత్యవసర, రెగ్యులర్ జరిగే పనులన్నింటికీ ఎలాంటి ఆటంకం లేకుండా ప్రత్యేకాధికారులు చర్యలు చేపట్టనున్నారు. మరోవైపు వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం.

తెలంగాణ రాష్ట్రంలో రేపటి(జనవరి 26) తో మున్సిపల్ పాలక వర్గాల పదవీ కాలం ముగియనుంది. ఇప్పటికే ఒకవైపు గ్రామ పంచాయితీలు, మరోవైపు మండల, జిల్లా పరిషత్ పాలక వర్గాల పదవీ కాలం ముగియడంతో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. ఇప్పుడు మెజార్టీ మున్సిపల్ పాలక వర్గాలు ముగియనుండటంతో అక్కడ ప్రత్యేక అధికారులను నియమించేందుకు కసరత్తు జరుగుతోంది.
రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో స్పెషల్ ఆఫీసర్ల పాలన రానున్నది. జనవరి 26న 130 పట్టణ స్థానిక సంస్థల పాలకవర్గాల పదవీకాలం ముగియనుంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేకపోవడంతో వాటిని ప్రత్యేక అధికారుల చేతుల్లో పెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మున్సిపాలిటీలకు ఆర్డీవోలు, మున్సిపల్ కార్పొరేషన్‌లకు కలెక్టర్లు స్పెషల్ ఆఫీసర్లుగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఇందుకు సంబంధించి పురపాలక శాఖ కసరత్తు పూర్తి చేసింది. మున్సిపల్ శాఖ సీఎం రేవంత్ వద్దే కొనసాగుతోంది.
గతంలో రాష్ట్రంలో 142 పట్టణ స్థానిక సంస్థలు ఉండగా.. 130 పట్టణ స్థానిక సంస్థలకు 2020లో ఎన్నికలు నిర్వహించారు. వీటి గడువు జనవరి 26తో ముగుస్తోంది. మరో 8 స్థానిక సంస్థలు జీహెచ్‌ఎంసీ, వరంగల్, ఖమ్మం, సిద్దిపేట, అచ్చంపేట, నకిరేకల్, జడ్చర్ల, కొత్తూరుకు 2021లో ఎలక్షన్స్ జరిగాయి. వీటి పదవీ కాలం వచ్చే ఏడాది పూర్తి కానుంది. మరో నాలుగు స్థానిక సంస్థలకు జహీరాబాద్ సహా మూడు షెడ్యూల్ ఏరియా మున్సిపాలిటీలు ఎన్నికలు నిర్వహించలేదు. మరోవైపు కొత్తగా 12 మున్సిపాలిటీలు ఏర్పడగా సంఖ్య 154కు చేరుకుంది. ఇంకో వైపు రెండు మున్సిపాలిటీలను కార్పొరేషన్లుగా అప్‌గ్రేడ్ అయ్యాయి. ప్రస్తుతం పదవీకాలం ముగుస్తున్న పట్టణ స్థానిక సంస్థలతో పాటుగానే కొత్తగా ఏర్పాటైన వాటికి కలిపి ఎన్నికలు జరగనున్నాయి.
పాలక వర్గాల గడువు ముగుస్తున్న పట్టణ స్థానిక సంస్థల్లో స్పెషల్ ఆఫీసర్ల పాలన రానుంది. అత్యవసర, రెగ్యులర్ జరిగే పనులన్నింటికీ ఎలాంటి ఆటంకం లేకుండా ప్రత్యేకాధికారులు చర్యలు చేపట్టనున్నారు. కీలక అభివృద్ధి పనులు జరగాలంటే కౌన్సిల్ తీర్మానం తప్పనిసరి కావడంతో వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం పూర్తి కాగానే పట్టణాల్లోనూ ఎలక్షన్స్ నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..