Hyderabad: నగరం నడిబొడ్డున భయం అనేదే లేకుండా దందా.. విస్మయాన్ని కలిగిస్తున్న కిడ్నీ రాకెట్
కిడ్నీలా... ఇడ్లీలా..? 30 రూపాయలకు ప్లేట్ ఇడ్లీ అన్నంత ఈజీగా 55లక్షలకు ఓ కిడ్నీ అంటూ దందా చేస్తున్నారు కేటుగాళ్లు. సామాన్యుల కష్టాలను క్యాష్ చేసుకుంటున్నారు. ఇక వరుస ఘటనలతో సీరియస్‌గా ఉన్న ప్రభుత్వం.. కిడ్నీ ఆపరేషన్లపై సీఐడీ ఎంక్వైరీకి ఆదేశించింది. ప్రైవేట్, ప్రభుత్వ ఆస్పత్రుల్లో జరిగిన కిడ్నీ ఆపరేషన్లపై సీఐడీ దర్యాప్తు చేయనుంది. మరి ఎంక్వైరీ ఎలా జరగబోతోంది...? పాతకేసులనూ సీఐడీ బయటకు తీస్తుందా...?

సామాన్య, మధ్య తరగతి ప్రజల్ని టార్గెట్ చేసుకొని కిడ్నీ మాఫియా వల విసురుతోంది. ఒక్క కిడ్నీ ఇస్తే చాలు లైఫ్ టైమ్ సెటిల్మెంట్ అంటూ ట్రాప్‌లోకి దింపుతోంది. లక్షలు ఎర చూపి… కోట్లు దండుకుంటున్నారు కేటుగాళ్లు. హైదరాబాద్ సరూర్‌నగర్ అలకనంద ఆస్పత్రిలో కిడ్నీ మార్పిడి ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనలో అనుమతి లేకుండా కిడ్పీ మార్పిడులు చేయడంతోపాటు.. గుట్టుచప్పుడు కాకుండా 55 లక్షలు రూపాయలు కాజేసేందుకు కొందరు కేటుగాళ్లు ప్రయత్నించడం సంచలనం సృష్టించింది. అయితే.. వైద్యశాఖ అధికారులకు సమాచారం అందడంతో గుట్టురట్టయ్యింది. అనుమతి లేకుండా కిడ్నీ మార్పిడి జరిగినట్లు గుర్తించి పోలీసులు కేసు నమోదు చేశారు. దాంతో.. అలకనంద ఆస్పత్రి యాజమాని సుమంత్ సహా 8మందిని అదుపులోకి తీసుకొని కీలక విషయాలు రాబడుతున్నారు.
తెలంగాణతో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన వ్యక్తులకు ఈ అక్రమ వ్యవహారంతో సంబంధం ఉందంటున్నారు అధికారులు. అమాయకులు, అత్యంత నిరుపేదల ఆర్థిక దుస్థితిని ఆసరాగా తీసుకుని, వారిని మభ్యపెట్టి కిడ్నీల డొనేషన్‌కు ఒప్పిస్తున్నారని తెలిపారు. అలకనంద హాస్పిటల్‌లో తమిళనాడుకు చెందిన ఇద్దరు మహిళల నుంచి కిడ్నీలు తీసుకుని, కర్ణాటకకు చెందిన వారికి అమర్చారని అధికారులు వెల్లడించారు. ఇక అలకనంద ఆసుపత్రిలో ఘటనపై సీరియస్ అయిన ప్రభుత్వం… కిడ్నీ ఆపరేషన్లపై సీఐడీ ఎంక్వైరీకి ఆదేశించింది.
కిడ్నీ రాకెట్ కేసును సీఐడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేశారు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ. ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలన్నారు. కేసు పూర్వపరాలను సమీక్షించిన మంత్రి.. తమిళనాడు, కేరళ, కర్ణాటక ప్రభుత్వాలకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఇక అలకనంద కేసు మాత్రమే కాదు… తెలంగాణలో కొన్నేళ్లుగా జరిగిన అన్ని కిడ్నీ ఆపరేషన్లపై సీఐడీ ఎంక్వైరీకి ఆదేశింది ప్రభుత్వం. గతంలో జరిగిన వ్యవహారాలకు, ప్రస్తుత కేసుకు ఏమైనా సంబంధం ఉందా…? అనే దానిపై ఆరా తీయనున్నారు. ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అక్రమాలలో ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్ల పాత్ర ఉన్నట్టు గతంలో వచ్చిన ఆరోపణలపైనా ఎంక్వైరీ జరపనున్నారు.ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రిల్లో జరుగుతున్న శస్త్ర చికిత్సలపైనా నిఘా పెట్టనున్నారు. గర్భిణుల వివరాలను నమోదు చేస్తున్నట్టుగానే, ఇతర సర్జరీలకు సంబంధించిన వివరాలను నమోదు చేసేలా చర్యలు తీసుకోనున్నారు.
మొత్తంగా అలకనంద కేసుతోపాటు పాత కేసులను బయటకు తీసేందుకు రెడీ అయ్యారు సీఐడీ అధికారులు. మరి చూడాలి ఇంకెన్ని దుర్మార్గాలు బయటపడతాయో…!
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..