4 రోజుల ఐటీ దాడుల తర్వాత స్పందించిన సినీ నిర్మాత దిల్ రాజు..!
తన ఇల్లు, కార్యాలయాల్లో ఆదాయ పన్ను శాఖ అధికారుల సోదాలపై ప్రముఖ్య సినీ నిర్మాత దిల్‌రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. సోదాల తర్వాత ఐటీ అధికారులు ఏం చెప్పారో.. తనిఖీల పంచనామాలో ఏం తేల్చారో క్లారిటీ ఇచ్చారు. ఆ డబ్బునే తనిఖీల పంచనామాలో ఐటీ అధికారులు తేల్చినట్టు చెప్పారు. మళ్లీ ఫిబ్రవరి మూడున ఐటీ అధికారులను కలవమన్నట్టు చెప్పారు దిల్‌రాజు.

నాలుగు రోజులపాటు తన ఇంట్లో జరిగిన ఐటి దాడుల గురించి మొదటిసారి దిల్ రాజు మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్‌లో ఆయన నివాసం తోపాటు శ్రీనగర్ కాలనీలోని ఆయన ఆఫీస్, మరి కొంతమంది నిర్మాణ సంస్థల కార్యాలయాలపై అధికారులు సోదాలు జరిపిన విషయం తెలిసిందే. ఐటీ సోదాలు శుక్రవారం(జనవరి 24) సాయంత్రం ముగిశాయి. కొన్ని ఛానెల్స్, సోషల్ మీడియాలో ఆయనకు చెందిన నగదు, డాక్యుమెంట్లు అధికంగా లభించాయని ప్రచారం జరిగింది. అయితే ఈ విషయంపై దిల్ రాజు తానే స్వయంగా ముందుకు వచ్చి వివరణ ఇచ్చారు.
వ్యాపారాలు చేస్తున్నప్పుడు ఐటీ సోదాలు చాలా సర్వసాధారణం అని సినీ నిర్మాత దిల్ రాజు అన్నారు. తమ లావాదేవీలన్నీ క్లీన్‌గా క్లియర్‌గా ఉన్నాయన్నారు. ప్రచారంలో ఉన్నట్లు ఏ కోట్ల రూపాయల నగదు తమ వద్ద లభించలేదని ఆయన స్పష్టం చేశారు. దాడుల సమయంలో దాదాపు 20 లక్షల రూపాయల లోపు మాత్రమే నగదు తమ వద్ద ఉన్నట్లు ఐటీ అధికారులు గుర్తించారని తెలిపారు. తప్పుడు వార్తలు ప్రచారం చేయడం ద్వారా తమ కుటుంబం పేరు భంగం కలిగించకూడదని కోరారు. ఐటీ అధికారులు 24 క్రాఫ్ట్స్ ప్రొడక్షన్ హౌస్ నుంచి సంబంధించిన అన్ని లావాదేవీలను పరిశీలించారని, అన్నింటినీ రికార్డుల్లో ఉంచి చూశారని అన్నారు. ప్రొడక్షన్ సంస్థ నుండి లభ్యమైన డాక్యుమెంట్లు పరిశీలించిన తరువాత, అన్ని లావాదేవీలు పారదర్శకంగా ఉన్నాయని అధికారులు తమకు తెలిపారని దిల్ రాజు తెలిపారు.
తాము గత అయిదేళ్లుగా ఎక్కడా పెద్దగా పెట్టుబడులు పెట్టలేదని, అన్ని లావాదేవీలు ఆన్‌లైన్ ద్వారా చేయబడుతున్నాయని దిల్ రాజు పేర్కొన్నారు. తన వ్యక్తిగత వ్యవహారాల్లో లేదా సంస్థ ఆధ్వర్యంలో ఎలాంటి అక్రమాలు లేవని, అధికారులు కూడా దీనిని ధృవీకరించారని చెప్పారు. ఐటీ దాడుల నేపథ్యంలో వచ్చిన ఆరోపణలు తప్పని తేల్చారు. అదేవిధంగా, తన తల్లి ఆరోగ్యం గురించి కూడా ప్రస్తావించారు. లంగ్ ఇన్ఫెక్షన్ కారణంగా చికిత్స పొందుతున్న తమ తల్లిపై తప్పుడు ప్రచారాలు చేయడం బాధాకరమని తెలిపారు.
తెలుగు చిత్ర పరిశ్రమలో ఆన్‌లైన్ బుకింగ్, ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ల విధానాలు కొనసాగుతున్నాయని, అయితే కలెక్షన్లను అధికంగా చూపించడం వంటి తీరు పరిశ్రమ మొత్తానికీ హానికరమని అన్నారు. అందువల్ల ఈ వ్యవహారంపై పరిశ్రమలోని పెద్దలు కలిసి చర్చించి మార్గదర్శకాలు నిర్ణయించుకోవాలని సూచించారు. ఫిబ్రవరి 3న తమ ముందు హాజరు కావాలని ఐటీ అధికారులు నోటిస్ జారీ చేసినట్లు దిల్ రాజు స్పష్టం చేశారు.
మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..