Telangana: తెలంగాణ ప్రజలకు మరో వరం ప్రకటించనున్న సీఎం.. ఆ కొత్త పథకం విశేషాలేంటంటే..
Telangana: తెలంగాణలో మరో పథకం పరిచయం కాబోతోంది. కేసీఆర్ కిట్ మాదిరిగానే.. అద్భుతమైన పథకానికి శ్రీకారం చుట్టనుంది రాష్ట్ర ప్రభుత్వం.

Telangana: తెలంగాణలో మరో పథకం పరిచయం కాబోతోంది. కేసీఆర్ కిట్ మాదిరిగానే.. అద్భుతమైన పథకానికి శ్రీకారం చుట్టనుంది రాష్ట్ర ప్రభుత్వం. కేసీఆర్ కిట్ మాదిరిగా.. న్యూట్రిషన్ కిట్‌ను తీసుకురాబోతోంది సర్కార్. ఈ విషయాన్ని స్వయంగా ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అసెంబ్లీలో ప్రకటించారు. మంత్రి ప్రకటన ప్రకారం.. ఈ ఏడాది తెలంగాణలో మరో పథకం పట్టాలెక్కనుంది. 9 జిల్లాల్లో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకం అమలు చేయబోతున్నామని ప్రకటించారు మంత్రి హరీశ్‌రావు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో కేసీఆర్ కిట్ పథకం అమలుపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు హరీశ్‌రావు ఈ సమాధానం ఇచ్చారు.
కేసీఆర్ కిట్ పథకం ప్రవేశపెట్టిన తర్వాత ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగిందని చెప్పారు మంత్రి. ఈ పథకం కింద 2017 జూన్ 2 నుంచి ఇప్పటి వరకు 13,29,951 మందికి లబ్ధి చేకూరిందన్నారు. ఈ పథకం అమలు కోసం రూ.1387.19 కోట్లు ఖర్చు చేసినట్లు స్పష్టం చేశారు. రాష్ట్రంలో మాతా శిశు ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు, ప్రత్యేక నవజాత శిశు సంరక్షణ కేంద్రాలను పటిష్టం చేస్తున్నామని చెప్పారు. మహిళల సంక్షేమం, అభివృద్ధి కోసం ఈ పథకాన్ని తీసుకొచ్చామని.. ఈ పథకం ఫలితాలు అద్భుతంగా ఉన్నాయన్నారు మంత్రి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య 54 శాతానికి పెరిగిందన్నారు.
గతంలో ప్రసవాలకు వచ్చిన తల్లుల మరణాలు ప్రతి లక్షకు 94 ఉండేవన్నారు మంత్రి హరీశ్‌రావు. కేసీఆర్ కిట్ అమలుతో తల్లుల మరణాలు ఇవాళ 63కు తగ్గించామన్నారు. శిశు మరణాలను కూడా తగ్గించుకున్నామని.. ప్రభుత్వాస్పత్రుల్లో మౌలిక వసతులను పెద్ద ఎత్తున కల్పించామన్నారు. కొత్తగా 23 మాతా శిశు సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. న్యూట్రిషన్ కిట్ పథకం త్వరలో అమలు చేయబోతున్నామని స్పష్టం చేశారు. గర్భిణులు రక్తహీనతతో బాధపడుతున్నారని.. ఇలాంటి వారికి న్యూట్రిషన్ కిట్ అందిస్తామన్నారు. కుమ్రం భీం, ఆదిలాబాద్, భూపాలపల్లి, భద్రాద్రి, కామారెడ్డి, వికారాబాద్, గద్వాల్, నాగర్‌కర్నూల్, ములుగు జిల్లాల్లో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకాన్ని అమలు చేయబోతున్నామన్నారు మంత్రి.
Also read:
Psychological Stress: మానసిక ఒత్తిడి నుంచి బయటపడటం ఎలా..? సింపుల్ చిట్కాలు..!
Pooja Hegde: డిఫరెంట్ డ్రెస్సులతో పిచ్చెకిస్తున్న పూజ హెగ్డే.. చూస్తే వావ్ అనాల్సిందే
