78ఏళ్లుగా నిరంతరాయంగా ఎగురుతోన్న మువ్వన్నెల జెండా.. ఎక్కడో తెలుసా..?
ఎంతోమంది వీరుల ప్రాణ త్యాగంతో దేశానికి స్వాతంత్య్రం సిద్ధించింది. వారి త్యాగాలను గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. స్వాతంత్ర భారతావనిలో ప్రతి భారతీయుడు స్వేచ్ఛ వాయువులను పీల్చుతూ గుండె నిండా నింపుకున్నదే మన మువ్వన్నెల త్రివర్ణ పతాకం. ప్రతి ఒక్కరూ తలెత్తి సగర్వంగా సెల్యూట్ చేసి దేశభక్తిని చాటుకోవాలి. భారతీయుల ఏకత్వానికి, శౌర్యానికి, స్వాభిమానానికి, సార్వభౌమత్వానికి, సమున్నతకి ప్రతీక మన త్రివర్ణ పతాకం.

ఎంతోమంది వీరుల ప్రాణ త్యాగంతో దేశానికి స్వాతంత్య్రం సిద్ధించింది. వారి త్యాగాలను గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. స్వాతంత్ర భారతావనిలో ప్రతి భారతీయుడు స్వేచ్ఛ వాయువులను పీల్చుతూ గుండె నిండా నింపుకున్నదే మన మువ్వన్నెల త్రివర్ణ పతాకం. ప్రతి ఒక్కరూ తలెత్తి సగర్వంగా సెల్యూట్ చేసి దేశభక్తిని చాటుకోవాలి. భారతీయుల ఏకత్వానికి, శౌర్యానికి, స్వాభిమానానికి, సార్వభౌమత్వానికి, సమున్నతకి ప్రతీక మన త్రివర్ణ పతాకం. దేశభక్తిని అలవర్చుకునేందుకు స్వాతంత్య్రం సాధించుకున్నప్పటి నుంచి అంటే 78 ఏళ్లుగా ఆ గ్రామంలో నిరంతరాయంగా మువ్వన్నెల జాతీయ జెండా ఎగురుతూనే ఉంది. నిరంతరాయంగా మూడు రంగుల జాతీయ పతాకం ఎగురుతున్న గ్రామం ఎక్కడో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..!
బ్రిటిష్ బానిస సంకెళ్ళ నుంచి దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చింది. అదే రోజున యాదాద్రి జిల్లా రాజపేట మండలం బేగంపేటకు చెందిన స్వాతంత్య్ర సమర యోధులు బద్దం నర్సిరెడ్డి, బల్జె వీరయ్య, చీగుళ్ల మల్లయ్యలు గ్రామ చౌరస్తాలో మువ్వన్నెల జాతీయ జెండాను ఎగురవేసి తమ దేశభక్తిని చాటుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు.. 78 ఏళ్లుగా మువ్వన్నెల జెండా రెపరెపలాడుతూనే ఉంది. తమ పెద్దలు చూపిన మార్గాన్ని ఇప్పటికీ గ్రామస్తులు పాటిస్తున్నారు. నిరంతరాయంగా మువ్వన్నెల జాతీయ జెండాను ఎగరవేసే ఆనవాయితీని కొనసాగిస్తున్నారు గ్రామస్తులు.
అంతేకాదు, దేశభక్తి, జాతీయ భావం స్ఫూర్తితో బేగంపేట గ్రామస్తులు చందాలు వేసుకుని 1979లో జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహం ఏర్పాటు చేసుకున్నారు. యువతతోపాటు భావి భారత పౌరులలో దేశభక్తిని పెంపొందించేందుకు జాతీయ నాయకులను స్మరించుకుంటున్నారు. వారి త్యాగాలను కీర్తిస్తున్నారు. వారిని స్మరించుకుంటూ మువ్వన్నెల జెండాను ఎగురవేసే ఆనవాయితీని కొనసాగిస్తున్నామని గ్రామస్తులు చెబుతున్నారు. ప్రతిఏటా పంద్రాగస్టు, గణతంత్ర దినోత్సవం, దసరా రోజున గ్రామ పెద్దలు పాత జెండాను తొలగించి, నూతన జాతీయ జెండాను అమర్చి ఎగుర వేస్తామని గ్రామస్తులు చెబుతున్నారు. దేశ స్వాతంత్య్ర పోరాటంలో మహనీయులు చేసిన ప్రాణ త్యాగాలను గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. 78 ఏళ్లుగా మువ్వన్నెల జాతీయ జెండాను ఎగుర వేస్తున్న ఆ గ్రామస్తులకు సెల్యూట్ చేయాల్సిందే..!
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
