Telangana Rains: అలెర్ట్.. తెలంగాణలో 3 రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
రాష్ట్రంలో రాగల మూడురోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి.
మాండౌస్ తుపాను ఎఫెక్ట్ ఇప్పటికే ఏపీపై భారీగా పడింది. ఇటు తెలంగాణ కేపిటల్ హైదరాబాద్‌లోనూ పలు ప్రాంతాల్లో చిరు జల్లులు పడ్డాయి. పడుతున్నాయి. ఉదయం నుంచి ఆకాశం మేఘవృతం అయ్యి ఉంది. కాగా తుఫాన్ ప్రభావంతో.. వచ్చే 3 రోజుల పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలోకి కిందిస్థాయి గాలులు తూర్పు ఆగ్నేయ దిశల నుంచి వీస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. శనివారం ఉదయం ఏర్పడిన తీవ్ర వాయుగుండం బలహీనపడి.. సాయంత్రానికి వాయుగుండంగా, ఆదివారం ఉదయం ఐదున్నర గంటలకు తీవ్ర అల్పపీడనంగా మారిందన్నారు. ప్రజంట్ ఈ అల్పపీడనం కూడా బలహీనపడిందని తెలిపారు.
కాగా లక్డికపూల్, మాసబ్‌ట్యాంక్, ఫిర్జాదిగూడ, బషీర్‌బాగ్, చార్మినార్, సికింద్రాబాద్, ఖైరతాబాద్, బంజారాహిల్స్, జూబ్లిహిల్స్, పంజాగుట్ట, నాంపల్లి, అబిడ్స్, సుల్తాన్‌బజార్, బేగంబజార్, అఫ్జల్‌గంజ్, మలక్‌పేట్, దిల్‌సుఖ్‌నగర్, చైతన్యపురి, కొత్తపేట, ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్‌నగర్, అల్వాల్, బేగంపేట్, సికింద్రాబాద్, పాట్నీలో చిరు జల్లులు పలకరించాయి.
ఎడతెరిపి లేకుండా పడుతున్న చిరుజల్లులతో ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారు. సండే హాలీడే కావడంతో ఎక్కువ మంది ఇళ్లకే పరిమితమయ్యారు. పనుల కోసం బయటికొచ్చిన వాహనదారులు చినుకులతో ఇబ్బందులు పడ్డారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందన్న వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికలు మరింత ఆందోళన మొదలైంది.
ఏపీపై భారీగానే తుఫాన్ ఎఫెక్ట్
మాండూస్ ప్రభావంతో తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. సత్యవేడు, నగరి, శ్రీకాళహస్తిలో ఈదురుగాలుల ధాటికి పలుచోట్ల చెట్లు, హోర్డింగులు నేలకూలాయి. నెల్లూరు, కడప, ప్రకాశంతో పాటు బాపట్ల జిల్లాలోనూ తుఫాన్ ప్రభావం స్పష్టంగా కనిపించింది. రెండు రోజులుగా నాన్‌స్టాప్‌గా వర్షం కురుస్తుండడంతో ఏడుకొండలపై ఎటుచూసినా జల సిరులే కనిపిస్తున్నాయి. శ్రీవారి భక్తుల దాహార్తి తీర్చే ప్రధాన జలాశయాలైన పసుపుధార, కుమారధార, పాపవినాశనం నిండు కుండలా మారాయి. పాపవినాశనం జలాశయం ఒక గేటును ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. శ్రీవారి మెట్టు మార్గంలో మెట్లపై వరద నీరు ప్రవహించింది. దీంతో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మెట్ల మార్గాన్ని ముందు జాగ్రత్తగా మూసివేశారు. ప్రవాహం తగ్గడంతో మధ్యాహ్నం నుంచి అనుమతించారు. కపిల తీర్థంలో పుణ్యస్నానాలకు అనుమతి రద్దు చేశారు.
కడప, అన్నమయ్య జిల్లాలో తుఫాన్ బీభత్సం సృష్టించింది. ఇక ప్రకాశం జిల్లాలోనూ వానముసురు పట్టింది. జిల్లా వ్యాప్తంగా జోరు వానలు కురిశాయి. కాకినాడ జిల్లాపై కూడా మాండూస్ ఎఫెక్ట్ పడింది. యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ సముద్ర తీరంలో అలలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. ఉప్పాడ-కాకినాడ బీచ్ రోడ్డులో తీరం వెంబడి భీకర గాలులు వీచాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..