UNWTO – Pochampally: పల్లె సీమకు ప్రపంచ గుర్తింపు.. భూదాన్ పోచంపల్లికి మంచి రోజులొచ్చాయి..
UNWTO – Pochampally: యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లికి మంచి రోజులు వచ్చాయి. ఎంతో ప్రాముఖ్యత, ఆహ్లాదకరమైన వాతావరణం ఉన్న ఈ పోచంపల్లి గ్రామం
UNWTO – Pochampally: యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లికి మంచి రోజులు వచ్చాయి. ఎంతో ప్రాముఖ్యత, ఆహ్లాదకరమైన వాతావరణం ఉన్న ఈ పోచంపల్లి గ్రామం ప్రపంచ పర్యాటక గ్రామం గా ఎంపికైంది. దీంతో ఈ గ్రామానికి మహార్దశ పట్టనుంది..
రాష్ట్రంలోని చారిత్రక, పర్యాటక కేంద్రాల ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసే ప్రక్రియలో కాకతీయుల కళా వైభవానికి ప్రతీకగా నిలిచిన రామప్ప దేవాలయానికి ఇటీవలే యునెస్కో వారసత్వ హోదా లభించిన విషయం తెలిసిందే. తాజాగా ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా పని చేస్తున్న ప్రపంచ పర్యాటక సంస్థ (యూఎన్‌డబ్ల్యూటీవో) నిర్వహించే బెస్ట్ టూరిజం విలేజ్ పోటీకి భారత్ తరఫున తెలంగాణలోని యాదాద్రి జిల్లాలోని భూదాన్ పోచంపల్లి ఎంపికైంది.
దీని కోసం మేఘాలయలోని కాంగ్‌థాన్, మధ్యప్రదేశ్‌లోని లద్‌పురాఖాస్ గ్రామాలు పోటీ పడ్డాయి. కానీ బెస్ట్ టూరిజం విలేజ్ గా పోచంపల్లి ఎంపికైంది. ఈ ఎంపిక కోసం కేంద్రం నుంచి మూడు ప్రతిపాదనలు వెళ్లాయి. స్వాతంత్రోద్యమ సమయంలో భూదానోద్యమానికి నాంది పలికిన పోచంపల్లి (భూదాన్ పోచంపల్లి) గ్రామీణ పర్యాటక కేంద్రంగా బాసిల్లుతోంది. ప్రపంచ పర్యాటక సంస్థ పోటీలో స్థానం దక్కడంతో ఉత్తమ పర్యాటక గ్రామంగా విశ్వవ్యాప్త గుర్తింపు పొందింది.
యాదాద్రి జిల్లాలోని భూదాన్ పోచంపల్లి తొలుత గ్రామ పంచాయతీ కాగా.. కొన్నేళ్ల క్రితం మునిసిపాలిటీగా మారింది. 1951 ఏప్రిల్ 18న ఆచార్య వినోబాబావే పాదయాత్రలో భాగంగా పోచంపల్లికి చేరుకున్నప్పుడు ఆయన పిలుపు మేరకు ఇక్కడి భూ స్వామి వెదిరె రామచంద్రారెడ్డి వంద ఎకరాలు దానం చేశారు. దీంతో ఇక్కడి నుంచే భూదానోద్యమానికి అంకురార్పణ జరిగింది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా సుమారు 4 లక్షల ఎకరాల భూమిని సేకరించి 40లక్షల మంది నిరుపేదలకు పంచిపెట్టారు.
దీంతో పోచంపల్లి పేరు కాస్తా భూదాన్ పోచంపల్లిగా మారింది. అంతేకాదు.. టై అండ్ డై ఇక్కత్ పట్టుచీరల ఉత్పత్తి కేంద్రంగా ఖండాంతర ఖ్యాతిని ఆర్జించింది. నిజాం నవాబుతో పాటు అరబ్ దేశాలకు తేలియా రుమాళ్లు, గాజులు, పూసలు ఎగుమతి చేసిన నాటి గాజుల పోచంపల్లి.. కాలక్రమంలో టైఅండ్‌డై పట్టుచీరల తయారీ కేంద్రంగా పేరొందింది. ఇక్కడి చేనేత కళాకారుల అద్భుత ప్రతిభతో సిల్క్ సిటీ ఆఫ్ ఇండియాగా గుర్తింపు సాధించింది.
గ్రామీణ ప్రజల జీవనశైలి, కుటీర పరిశ్రమలు, ప్రభుత్వ పథకాల అమలు, మహిళా సాధికారితకు కేరాఫ్‌గా నిలిచింది. అందుకే యూఎస్, రష్యాతో పాటు 78దేశాలకు చెం దిన అధికారులు, పర్యాటకులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఈ గ్రామాన్ని సందర్శించి అధ్యయనం చేశారు. తాజాగా ప్రపంచ పర్యాటక సంస్థ నిర్వహిస్తున్న పోటీకి భారత్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తోంది. రాష్ట్రం నుంచి పోటీలో భూదాన్ పోచంపల్లి ఎంపికైంది. ఈ మేరకు ఐక్య రాజ్య సమితి అనుబంధ ప్రపంచ పర్యాటక సంస్థ పోటీలో బెస్ట్ టూరిజం విలేజ్ గా ఎంపిక కావడం పట్ల పోచంపల్లి గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Also read:
Pushpa Song: పుష్ప రాజ్ ఊరమాస్ లుక్.. ఏయ్ బిడ్డా ఇది నా అడ్డ లిరికల్ ప్రోమో రిలీజ్..
Ramya Krishna: మెగాస్టార్ సినిమాలో రమ్యకృష్ణ.. కీలక పాత్రలో నటించనున్న శివగామి..