RTC Bus Charges: తెలంగాణలో ఆర్టీసీ చార్జీల పెంపు తప్పదా..? కీలక వ్యాఖ్యలు చేసిన ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్
తప్పని పరస్థితుల్లో ఆర్టీసీ చార్జీలు పెంచాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రజలు అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నామని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ పేర్కొన్నారు.
Telangana RTC Bus Charges hike: తప్పని పరస్థితుల్లో ఆర్టీసీ చార్జీలు పెంచాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రజలు అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నామని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ పేర్కొన్నారు. ఆర్టీసీ ఛార్జీల పెంపుపై సమీక్ష సందర్భంగా బాజిరెడ్డి గోవర్ధన్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మీడియాతో మాట్లాడారు. ఛార్జీల పెంపు ప్రతిపాదనను గత నెలలోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నివేదించామని తెలిపారు.
ఆర్డినరీ పల్లె వెలుగు బస్సుల్లో కిలోమీటర్‌కు 20 పైసలు, ఇతర బస్సుల్లో కిలోమీటర్‌కు 30 పైసలు చొప్పున పెంచాలని ప్రతిపాదించామని ఆయన వెల్లడించారు. కేంద్రం విధానాల వల్లే ఛార్జీలు పెంచాల్సి వస్తోందన్నారు. డీజిల్ ధరల పెరుగుదల ఆర్టీసీకి భారంగా మారిందన్నారు. ఆర్టీసీ రోజుకు 6.8 లక్షల లీటర్ల డీజిల్ వినియోగిస్తోందని బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. పెరుగుతున్న నష్టాలు భరించే స్థితిలో ఆర్టీసి లేదన్న బాజిరెడ్డి.. కొత్త బస్సులు కొనాల్సిన అవసరం ఉందన్నారు. డీజిల్ ధరలు, స్పేర్ పార్ట్స్ ధరలు పెరగటం ఇబ్బందిగా మారిందన్నారు. టికెట్ ధరల పెంపు మీద మంత్రి, ముఖ్యమంత్రి త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నామన్నారు. లాంగ్ డిస్టన్స్ రూట్ లలో బస్సులను నడపడం వల్ల లాభాలు వస్తాయని సీఎం సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 14 వందల బస్సులు పూర్తిగా పడయ్యాయి. వాటి స్థానంలో కొత్త వాటిని కొనాల్సిన అవసరం ఉందన్నారు.
నష్టాల్లో ఉన్న ఆర్టీసీ ఆదుకునేందుకు కొత్త సర్వీసులు, కొత్త ట్రిప్స్ ప్రవేశపెట్టబోతున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ప్రజలకు ఆర్టీసీపై పడే భారాన్ని అవగాహన కల్పించాల్సిన అవసరముందన్నారు. మెజారిటీ ప్రజలు చార్జీలు పెంచడాన్ని సమర్థిస్తున్న ఆయన.. సాధ్యమైనంత త్వరగా చార్జీలు పెంచేందుకు నిర్ణయం తీసుకుంటామన్నారు. కేవలం డీజిల్ మాత్రమే కాదు.. టైర్లు, స్పేర్ పార్ట్స్ ధరలు కూడా భారీగా పెరిగాయన్నారు.గతంలో డీజిల్ ధరలు పెరిగినప్పుడు టికెట్ ధరలు పెరిగేవన్న ఆయన.. రెండేళ్ల క్రితం టికెట్ ధరలు పెంచినా కోవిడ్ రావటంతో ఫలితం లేకుండా పోయిందన్నారు. ఆర్టీసీ తీవ్ర స్థాయిలో నష్టాలు చవిచూసింది. ప్రస్తుతం డీజిల్ ధరలు మళ్లీ పెరగటంతో రూ.468 కోట్ల అదనపు భారం పడిందన్నారు. మొత్తంగా చూస్తే, ఈ ఏడాది రూ.1,400 కోట్ల నష్టాల్లో ఆర్టీసి ఉందన్నారు. దీంతో టికెట్ ధరలు పెంపు తప్పనిసరి అయిందన్నారు.
Read Also…. IRCTC Tour : రాజస్థాన్ అందాలను చూడాలనుకుంటున్నారా.. అయితే ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ వివరాలు మీకోసమే..