Telangana: తహశీల్దార్ సారు భూమాయ.. ప్రైవసీలో పెడితే తెలియదనుకున్నాడు.. చివరకు దిమ్మతిరిగే ట్విస్ట్..

Telangana: తాను తలుచుకుంటూ తిమ్మిని బమ్మిని చేయగలమని మరోసారి రుజువు చేశాడు. అయినవాళ్ల కోసం అడ్డగోలుగా వ్యవహరించాడు.

Telangana: తహశీల్దార్ సారు భూమాయ.. ప్రైవసీలో పెడితే తెలియదనుకున్నాడు.. చివరకు దిమ్మతిరిగే ట్విస్ట్..
Mro
Shiva Prajapati

|

Sep 22, 2022 | 10:47 AM

Telangana: తాను తలుచుకుంటూ తిమ్మిని బమ్మిని చేయగలమని మరోసారి రుజువు చేశాడు. అయినవాళ్ల కోసం అడ్డగోలుగా వ్యవహరించాడు. డబ్బుకు కక్కుర్తి పడి బతికున్న మహిళను రికార్డుల్లో చంపేశాడు. ఆ తరువాత స్క్రిప్ట్‌ మొత్తం మార్చేసి పాత కథను కొత్తగా చెప్పాడు. ఇంతకీ ఆ కథ.. స్క్నీన్‌ ప్లే..డైరెక్షన్‌ చేసింది ఎవరో కాదు తహశీల్దార్‌ రాజయ్య. బతికున్న మహిళను రికార్డుల్లో చంపేసిన వ్యవహారం రచ్చ రచ్చ అవుతోంది. పక్కా డాక్యుమెంట్లు ఉన్నా.. రైతులను కాళ్లరిగేలా తిప్పుకొనే రెవెన్యూ అధికారులు.. నచ్చినవాళ్లకు మాత్రం రెడ్‌కార్పెట్‌లు పరుస్తున్నారు. అడ్డగోలుగా వ్యవహరిస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు. ఇందుకు నిదర్శనమే తహశీల్దార్‌ రాజయ్య చేతివాటం.

వివరాల్లోకెళితే.. సంగారెడ్డి జిల్లా రాయికోడ్‌ మండలంలో జరిగిన వెలుగు చూసిన భూచౌర్యం ఘటన చర్చనీయాంశం అయింది. బతికున్న శివమ్మ చనిపోయిందని చెప్పి ఆమె పేరున ఉన్న భూమిని మరొకరి పేరి మీద పట్టా చేశాడు రాజయ్య. అంతేకాదు ఈ తార్‌మార్‌లో చనిపోయిన శివమ్మ భర్త డెత్‌ సర్టిఫికెట్‌ కూడా వాడుకున్నాడు.

రాయికోడ్‌ మండలం నాగన్‌పల్లికి చెందిన పట్లోళ్ల హన్మంత్‌రెడ్డికి సర్వే సంఖ్య 198లో 27.34 ఎకరాల భూమి ఉంది. గతేడాది ఏప్రిల్‌లో ఆయన చనిపోయాడు. ఆ తరువాత ఆభూమిని ఆయన భార్య శివమ్మ తన పేరున పట్టా చేయించుకుంది. భర్త మరణించిన తర్వాత ఆమె హైదరాబాద్‌లో కొడుకుల దగ్గర ఉంటోంది. అయితే సడెన్‌గా శివమ్మ చనిపోయిందని, ఆమె పేరున ఉన్న భూమిని తన పేరిట మార్చాలంటూ హన్మంత్‌రెడ్డి సోదరి అంజమ్మ ధరణిలో స్లాట్‌ బుక్‌ చేసుకుంది. అంతేకాదు తన అన్న హన్మంత్‌రెడ్డి మరణ ధ్రువీకరణ పత్రాన్ని కూడా అధికారులకు ఇచ్చింది. ఎంతకు డీల్‌ కుదిరిందో ఏమో కానీ.. ఎలాంటి వెరిఫికేషన్లు చేయకుండానే ఈనెల 19న మొత్తం భూమిని శివమ్మ పేరు నుంచి అంజమ్మ పేరుకు మార్చేశారు.

విషయం తెలుసుకున్న భూ హక్కుదారు శివమ్మ, తన కొడుకుని తీసుకుని సంగారెడ్డి జిల్లా పాలనాధికారి శరత్‌ను కలిశారు. అన్ని ఆధారాలను పరిశీలించిన శరత్‌.. నిబంధనలను విరుద్ధంగానే వ్యవహారం సాగిందని గుర్తించారు. ఆయన సూచన మేరకే రాయికోడ్‌ పోలీస్‌స్టేషన్‌లో అంజమ్మతో పాటు స్థానిక తహసీల్దారు రాజయ్యపై ఫిర్యాదు చేసింది శివమ్మ. ధరణిలో భూమికి సంబంధించిన వివరాలు చూసుకునే అవకాశం లేకుండా దాచిపెడుతున్నారని వాపోతోంది బాధితురాలు. బాధ్యులపై కఠినచర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తోంది. ఇంత జరిగినా తహశీల్దార్‌ రాజయ్య మాత్రం అన్ని పేపర్స్‌ పక్కాగా సమర్పించిన తరువాతే అంజమ్మ పేరున పట్టా చేశామంటున్నాడు. మరి ఈ వ్యవహారంపై అధికారులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu