AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తల్లిదండ్రులకు అలర్ట్! నిండు జీవితానికి రెండు చుక్కలు.. ఆదివారం పల్స్ పోలియో

Telangana Pulse Polio Drive: తెలంగాణలో జూన్ 28న రాష్ట్రవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించనున్నారు. 0 నుంచి 5 ఏళ్లలోపు సుమారు 40.97 లక్షల మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయనుండగా, జూన్ 29–30 తేదీల్లో ఇంటింటికీ వెళ్లి మిగిలిన పిల్లలకు టీకాలు అందించనున్నారు. గతంలో టీకా వేయించినా మరోసారి వేయించడం తప్పనిసరి అని వైద్య ఆరోగ్య శాఖ తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేసింది.

తల్లిదండ్రులకు అలర్ట్! నిండు జీవితానికి రెండు చుక్కలు.. ఆదివారం పల్స్ పోలియో
Pulse Polio Telangana 2026
Yellender Reddy Ramasagram
| Edited By: |

Updated on: Jun 27, 2026 | 8:12 PM

Share

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా జూన్ 28న పోలియో బూత్‌లలో పిల్లలకు డ్రాప్స్ వేయనున్నారు. జూన్ 29, 30 తేదీల్లో ఇంటింటికీ వెళ్లి మిగిలిపోయిన చిన్నారులకు పోలియో డ్రాప్స్ వేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు వైద్య సిబ్బంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల్లో పట్టణ ప్రాంతాలు విస్తృతంగా ఉండటంతో జూలై 1న అదనంగా మరో రోజు కార్యక్రమాన్ని నిర్వహించాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సూచించారు.

ఈ కార్యక్రమం కోసం రాష్ట్రవ్యాప్తంగా 22,979 పోలియో బూత్‌లు, 903 మొబైల్ బృందాలు, 903 ట్రాన్సిట్ పాయింట్లు ఏర్పాటు చేశారు. సుమారు 40.97 లక్షల మంది 0–5 ఏళ్ల చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నారు. ఇందుకోసం 52.04 లక్షల బీవోపీవీ (bOPV) టీకా డోసులు జిల్లాలకు సరఫరా చేశారు. కార్యక్రమంలో 8,393 ఏఎన్‌ఎంలు, 27,181 ఆశా కార్యకర్తలు, 34,442 అంగన్‌వాడీ కార్యకర్తలు, నర్సింగ్ విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొననున్నారు.

వలస కార్మికుల పిల్లలు, ఇటుక బట్టీలు, నిర్మాణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాల్లోని బస్తీలు, కొత్త కాలనీలు, గిరిజన ప్రాంతాల్లోని చిన్నారులపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి ఆదేశించారు. మహిళా శిశు సంక్షేమం, మున్సిపల్, పంచాయతీరాజ్, విద్యాశాఖ, ఆర్టీసీ తదితర శాఖల సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు.

తెలంగాణలో చివరి పోలియో కేసు 2007లో నమోదు అయిందని, పోలియో రహిత తెలంగాణ లక్ష్యాన్ని ఉమ్మడి రాష్ట్రంలోనే సాధించామని‌ ఈ సందర్భంగా అధికారులు గుర్తు చేశారు.

జూన్ 28న నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమంలో 0 నుంచి 5 సంవత్సరాల వయస్సు గల ప్రతి చిన్నారికి తప్పనిసరిగా రెండు చుక్కల పోలియో టీకా వేయించాలి. గతంలో పోలియో చుక్కలు వేయించినా మరోసారి వేయించడం వల్లే పూర్తి రక్షణ లభిస్తుంది. తల్లిదండ్రులందరూ తమ పిల్లలను సమీపంలోని పోలియో బూత్‌కు తీసుకువచ్చి టీకా వేయించాలి. ఒక్క చిన్నారి కూడా మిగిలిపోకుండా అందరూ సహకరించి తెలంగాణ, దేశం పోలియో రహిత హోదాను కొనసాగిద్దాం అని ప్రజలకు పిలుపునిచ్చారు వైద్య ఆరోగ్య శాఖ.

Follow Us