Watch: కొరడా చేతపట్టి వీధుల్లోకి ప్రభుత్వ బడి టీచర్.. పోతురాజు వేషంలో హల్‌చల్! అసలు సంగతి ఏమంటే?
ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు వినూత్న వేషధారణతో జనం దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ప్రస్తుతం ఆషాడంలో ఫుల్ ట్రెండింగ్ లో ఉన్న పోతరాజుల వేషం ధరించి ఊళ్ళల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. గంజాయి, మత్తు పదార్థాలు, ఎలా యువత భవిష్యత్తును ఛిద్రం చేస్తున్నాయో వినూత్న రీతిలో అవగాహన కల్పిస్తున్నారు..

పాలకుర్తి, ఆగస్ట్ 11: జనగామ జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు వినూత్న వేషధారణతో జనం దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ప్రస్తుతం ఆషాడంలో ఫుల్ ట్రెండింగ్ లో ఉన్న పోతరాజుల వేషం ధరించి ఊళ్ళల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. గంజాయి, మత్తు పదార్థాలు, ఎలా యువత భవిష్యత్తును ఛిద్రం చేస్తున్నాయో వినూత్న రీతిలో అవగాహన కల్పిస్తున్నారు. ఆయన ఓ ప్రభుత్వ బడి పంతులు. నిత్యం విద్యార్థులకు విద్యాబోధన చేసే ఉపాధ్యాయుడు పోతురాజు వేషధారణలో ప్రత్యక్షం అయ్యాడు. కొరడా చేత పట్టుకొని వీధుల్లోకి వచ్చి..మత్తుకు దూరంగా ఉండాలంటూ యువతకు సందేశమిచ్చారు. అంతేకాదు.. హెల్మెట్, సీటుబెల్ట్ ప్రాధాన్యతను వివరిస్తూ రోడ్డు భద్రతపై కూడా అవగాహన కల్పించారు. జనగామ జిల్లా పాలకుర్తిలో జరిగిన ఈ వినూత్న కార్యక్రమానికి వారంతా సంత వేదికైంది.
పాలకుర్తి మండల కేంద్రంలోని వారంతపు సంతలో పోతరాజు వేషధారణలో సందడి చేశాడు. ఇతను సూర్యాపేట జిల్లా గోరంట్ల ZPHS పాఠశాలలో పని చేస్తున్న తెలుగు ఉపాధ్యాయుడు ప్రభాకర్… పోతురాజు వేషధారణలో ప్రజలకు వినూత్నంగా అవగాహన కల్పించారు. పోతురాజు వేషధారణలో నో డ్రగ్స్.. సేవ్ లైఫ్ అంటూ కరపత్రాలు పంపిణీ చేశాడు. డ్రగ్స్ గంజాయి పొగాకు మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. అంతేకాదు ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కారులో ప్రయాణించేవారు సీటుబెల్ట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు.
మరుగున పడుతున్న జానపద కళను ప్రజలకు పరిచయం చేస్తూనే పోతురాజు స్ఫూర్తితో సమాజాన్ని మత్తు మహమ్మారి నుంచి కాపాడాలనే సందేశాన్ని వినూత్నంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. యువత మత్తుకు దూరంగా ఉండాలన్నారు. జీవితంలో మంచి లక్ష్యాలను చేరుకునేందుకు కష్టపడాలన్నారు. రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ ప్రాణాలను కాపాడుకోవాలనే సందేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వ తెలుగు ఉపాధ్యాయుడు రాచకొండ ప్రభాకర్ పోతరాజు వేషంలో అవగాహన క కార్యక్రమం సంతలో ప్రతిఒక్కరినీ ఆకట్టుకున్నాయి.




