Janasena: తెలంగాణలో ఎన్నికలకు జనసేన సై.. 32 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు పార్టీ ప్రకటన..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి జనసేన పార్టీ సిద్ధమైంది. తెలంగాణ వ్యాప్తంగా 32 చోట్ల పోటీ చేయనున్నట్లు ప్రకటించడం ఆసక్తిగా మారింది. కూకట్‌పల్లి, ఎల్బీనగర్, నాగర్‌కర్నూల్, వైరా, ఖమ్మం, మునుగోడు, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, పటాన్‌చెరు, సనత్‌నగర్, కొత్తగూడెం, ఉప్పల్, అశ్వారావుపేట వంటి జనసేన సంస్థాగతంగా బలమైన ప్రాంతాల్లో జనసేన పార్టీ పోటీకి రెడీ అయింది.
త్వరలో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీకి జనసేన పార్టీ రెడీ అవుతోంది. తెలంగాణలో 32 స్థానాల్లో పోటీ చేయనున్నట్టు ఆ పార్టీ ప్రకటించింది. ఈ మేరకు పోటీ చేసే స్థానాల జాబితాను విడుదల చేసింది. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చడమే తమ పార్టీ లక్ష్యమని జనసేన తెలంగాణ శాఖ పేర్కొంది. తెలంగాణ ఎన్నికల్లో పోటీ అంశంపై పూర్తి సన్నద్ధతతో ఉన్నామని.. ఈసారి పోటీలో ఉంటున్నట్టు ఆ పార్టీ ఉపాధ్యక్షుడు బొంగునూరి మహేందర్‌రెడ్డి తెలిపారు. ఒకవేళ చివరి క్షణంలో పొత్తులేమైనా ఉంటే ఆయా స్థానాల్లో మార్పులు ఉండొచ్చన్నారు.
తెలంగానలో జనసేన పోటీ చేసే నియోజకవర్గాలను ఒకసారి పరిశీలిస్తే.. కూకట్‌పల్లి, ఎల్బీనగర్, నాగర్‌కర్నూల్, వైరా, ఖమ్మం, మునుగోడు, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, పటాన్‌చెరు, సనత్‌నగర్, కొత్తగూడెం, ఉప్పల్, అశ్వారావుపేట, పాలకుర్తి, నర్సంపేట, స్టేషన్‌ఘన్‌పూర్, హుస్నాబాద్, రామగుండం, జగిత్యాల, నకిరేకల్, హుజూర్‌నగర్, మంథని, కోదాడ, సత్తుపల్లి, వరంగల్ వెస్ట్, వరంగల్ ఈస్ట్, మల్కాజిగిరి, ఖానాపూర్, మేడ్చల్, పాలేరు, ఇల్లందు, మధిరలో జనసేన పార్టీ పోటీకి రెడీ అయింది. యువత, మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశంతోనే పవన్ కల్యాణ్ జనసేనను స్థాపించారని.. అందులో భాగంగా ఇప్పటికే నాయకత్వాన్ని తయారు చేసినట్టు మహేందర్‌రెడ్డి చెప్పారు.
దాదాపు 25 సీట్లలో పార్టీకి బలమైన ఓటు బ్యాంకు ఉందన్నారు. గెలుపోటములు నిర్ణయించే స్థాయిలో ఓటింగ్ ఉందని.. గత ఎన్నికల్లో మల్కాజిగిరి పార్లమెంట్ ఎన్నికే అందుకు ఉదాహరణ అన్నారు. సింగిల్‌గా వెళ్లడానికి సిద్ధంగా ఉన్నామన్న ఆయన.. గత పదేళ్లలో అనేక సమస్యలపై తెలంగాణ జనసేన పోరాటం చేసిందన్నారు. నల్లమల యురేనియం తవ్వకాలు, మహిళలపై దాడులు, డ్రగ్స్ సమస్య, ఆర్టీసీ కార్మికుల సమస్య, బీసీ, ఎస్టీ వర్గాలతో పాటు విద్యార్థుల సమస్యలు ఇలా.. అనేక అంశాలపై తాము పోరాటం చేసినట్టు గుర్తు చేశారు జనసేన నేత మహేందర్‌రెడ్డి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..