G20 Summit: జీ-20 విజయం వెనుక తెలుగోడి సత్తా.. జీ-20 షెర్పా ప్రశంసలు అందుకున్న ఈయన ఎవరో తెలుసా..

జీ20 సెక్రటరియట్‌లో జాయింట్ సెక్రటరీగా పనిచేసిన కాకనూర్ నాగరాజు నాయుడు ఢిల్లీ డిక్లరేషన్‌పై సభ్యదేశాలను ఏకతాటిపైకి తేవడంలో అత్యంత కీలకంగా, సమర్థవంతంగా పనిచేశారు. రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం మొదలైన తర్వాత ప్రపంచ దేశాలు నిట్టనిలువుగా చీలి రెండువర్గాలుగా మారిపోయాయి. సదస్సుకు ముందు భిన్న ధృవాలుగా ఉన్న ప్రపంచ దేశాలు ఉక్రెయిన్ - రష్యా యుద్ధం నేపథ్యంలో నిట్టనిలువునా రెండుగా చీలిపోయిన దశలో.. భారత్ రూపొందించిన ఢిల్లీ జాయింట్ డిక్లరేషన్‌పై ఏకాభిప్రాయం సాధించడం మామూలు విషయం కాదు.

G20 Summit: జీ-20 విజయం వెనుక తెలుగోడి సత్తా.. జీ-20 షెర్పా ప్రశంసలు అందుకున్న ఈయన ఎవరో తెలుసా..
Kakanur Nagaraj Naidu
Follow us
Mahatma Kodiyar, Delhi, TV9 Telugu

| Edited By: Surya Kala

Updated on: Sep 11, 2023 | 12:31 PM

దేశం సాధించే విజయం వెనుక నాయకత్వం అందించే ప్రోత్సాహంతో పాటు ఎంతో మంది కృషి ఉంటుంది. ఈ ఏడాది ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో, వందలాది మంది భారత దౌత్యవేత్తల కృషితో  జీ-20కి భారత నాయకత్వం వహించి అసాధారణ విజయాలు నమోదు చేసింది. సదస్సుకు ముందు భిన్న ధృవాలుగా ఉన్న ప్రపంచ దేశాలు ఉక్రెయిన్ – రష్యా యుద్ధం నేపథ్యంలో నిట్టనిలువునా రెండుగా చీలిపోయిన దశలో.. భారత్ రూపొందించిన ఢిల్లీ జాయింట్ డిక్లరేషన్‌పై ఏకాభిప్రాయం సాధించడం మామూలు విషయం కాదు. ఒకరకంగా చెప్పాలంటే అన్ని దేశాలను ఏకతాటిపైకి తేవడం బహుశా ఏ దేశానికీ సాధ్యమయ్యేది కాదేమో…! చంద్రుడి దక్షిణ ధృవంపై  కాలుమోపి యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తిన భారత్..  దాన్నుంచి తేరుకోక ముందే మరోసారి ఆశ్చర్యానికి గురిచేసింది. ఇంతటి ఘనత వెనుక ఓ తెలుగు అధికారి కృషి, పాత్ర ఎంతో ఉంది. తెలుగువాడన్న అభిమానంతో చెబుతున్నమాటలు కావివి. స్వయానా జీ-20 భారత ప్రెసిడెన్సీలో షెర్పాగా వ్యవహరించిన అమితాబ్ కాంత్ కు సామాజిక మాధ్యమాల సాక్షిగా ఇచ్చిన కితాబు.

ట్విట్టర్ (ఎక్స్)లో చేసిన పోస్ట్

“మొత్తం G20లో అత్యంత సంక్లిష్టమైన విషయం ఏమిటంటే భౌగోళిక రాజకీయ పరిస్థితుల్లో (రష్యా-ఉక్రెయిన్)పై ఏకాభిప్రాయాన్ని తీసుకురావడం. 200 గంటల పాటు నిరంతరాయ చర్చలు, 300 ద్వైపాక్షిక సమావేశాలు, 15 ముసాయితా పత్రాలతో ఇది సాధ్యపడింది. ఇందులో తనకు ఇద్దరు అత్యంత సమర్థులైన అధికారులు ఎంతగానో సహకరించారని.. వారే నాగరాజు నాయుడు, ఈనం గంభీర్ అని పేర్కొన్నారు. ఆ ఇద్దరు అధికారులతో దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

దీంతో పాటు మరో ట్వీట్ కూడా చేశారు. జీ20 వేదిక భారత మండపంలో ఏర్పాటు చేసిన కల్చర్ కారిడార్ వద్ద నాగరాజు నాయుడు, లిలీ పాండేయతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేసిన అమితాబ్ కాంత్.. అక్కడ కూడా తనతో పాటు ఉన్న ఇద్దరు అధికారులు తెలివైన, సమర్థవంతమైన, సృజనాత్మకత కల్గిన అధికారులుగా ఆయన కొనియాడారు. జీ-20లో ఆ ఇద్దరూ చాలా గొప్పగా పనిచేశారని ప్రశంసలతో ముంచెత్తారు.

అనేక రంగాల్లో దూసుకెళ్తున్న తెలుగువారు

సివిల్ సర్వీసెస్ (ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ తదితర) అధికారుల్లో తెలుగువారు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. పని చేసే విషయంలో అంకితభావం, చిత్తశుద్ధి, మిగతావారికంటే మెరుగ్గా పనిచేయాలన్న తపన తెలుగువారికి స్పెషల్ గుర్తింపు తీసుకొస్తూ ఉంటుంది. కేవలం సివిల్ సర్వీసుల్లోనే కాదు.. వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో కూడా తెలుగువారు తమకున్న ఈ లక్షణాలతో మిగతావారి కంటే ముందంజలో దూసుకెళ్తున్నారు. అగ్రరాజ్యం అమెరికాలో ఐటీ, వైద్య రంగాలతో పాటు శాస్త్ర సాంకేతిక రంగాల్లోనూ దూసుకెళ్తున్న తెలుగు ఇంజనీర్లు, డాక్టర్లు, శాస్త్రవేత్తలు ఎంతో మంది కనిపిస్తారు. ఎక్కడికైనా సరే వెళ్లడానికి వెనుకాడకపోవడం, ఎలాంటి క్లిష్ట పరిస్థితులనైనా ఎదుర్కోవాలన్న సంకల్పం తెలుగువారిలో ఎక్కువగా కనిపిస్తుంది. ఆ కోవలో మరో ఆణిముత్యం కాకనూర్ నాగరాజు నాయుడు. 1998 బ్యాచ్‌కు చెందిన ఇండియన్ ఫారిన్ సర్వీసెస్ (IFS) అధికారి.

జీ20 సెక్రటరియట్‌లో జాయింట్ సెక్రటరీగా పనిచేసిన కాకనూర్ నాగరాజు నాయుడు ఢిల్లీ డిక్లరేషన్‌పై సభ్యదేశాలను ఏకతాటిపైకి తేవడంలో అత్యంత కీలకంగా, సమర్థవంతంగా పనిచేశారు. రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం మొదలైన తర్వాత ప్రపంచ దేశాలు నిట్టనిలువుగా చీలి రెండువర్గాలుగా మారిపోయాయి. ఉక్రెయిన్ సార్వభౌమత్వాన్ని సమర్థిస్తూ ఆ దేశం వెనుక నిలిచిన అగ్రరాజ్యం అమెరికా సారథ్యంలోని నాటో దేశాలు ఒకవైపు, రష్యాను సమర్థిస్తూ ఆ దేశం పక్షాన నిలిచిన చైనా, బెలారస్ వంటి దేశాలు మరోవైపు.. ఈ రెండు పక్షాల్లో ఏ పక్షాన చేరకుండా యుద్ధం దేనికీ పరిష్కారం కాదు, చర్చలతోనే శాంతి సాధ్యం అంటూ భారత్ పోషించిన నిజమైన నిష్పక్షపాత వైఖరి తొలుత ఎవరికీ సరిగా అర్థంకాలేదు.

ఈ పరిస్థితుల్లో నాగరాజు నాయుడు తనకు అప్పగించిన బాధ్యతను చురుగ్గా.. సమయస్ఫూర్తితో సమర్థవంతంగా నిర్వర్తించారు. వివిధ దేశాలను ఒప్పించి, మెప్పించి ఏకతాటిపైకి తీసుకొచ్చారు. ఆ క్రమంలో వివిధ దేశాలతో పలు దఫాలుగా చర్చలు జరిపారు. సంప్రదింపులు, మంతనాలు సాగించారు. నిర్విరామంగా కొన్ని నెలల పాటు పనిచేశారు. జీ-20 భారత ప్రెసిడెన్సీలో ఏం చేయగలదో చేసి చూపించాలని కంకణం కట్టుకుని మరీ పనిచేశారు. ఆ కృషి ఫలితమే ఢిల్లీ డిక్లరేషన్‌కు జీ-20 సభ్యదేశాల ఏకగ్రీవ ఆమోదం. రష్యా-ఉక్రెయిన్ మధ్య నెలకొన్న యుద్ధం ఒక్కటే కాదు, ప్రపంచ దేశాల మధ్య విబేధాలకు ఇంకా అనేక కారణాలున్నాయి. శుద్ధ ఇంధనాల వినియోగాన్ని పెంచే విషయంలో చమురు ఉత్పత్తి దేశాలు – కొనుగోలు దేశాల మధ్య భేదాభిప్రాయాలున్నాయి.

చైనా-అమెరికా దేశాల మధ్య ఆధిపత్య పోరు గతంలో అమెరికా-సోవియట్ యూనియన్‌ మధ్య నెలకొన్న ప్రచ్ఛన్న యుద్ధాన్నే తలపిస్తోంది. ఇలాంటి ఎన్నో అంశాలు ప్రపంచ దేశాల ఐక్యతను దెబ్బతీస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఓవైపు శాంతి మంత్రం జపిస్తూ.. అవసరమైతే దేశ భద్రత కోసం ఎంతటి కఠిన నిర్ణయాలైనా తీసుకోగలం అంటూ సర్జికల్ స్ట్రైక్స్ చేస్తూ భారత నాయకత్వం ప్రపంచ అగ్రరాజ్యాల సరసన నిలిచింది. నాయకత్వం మనోగతాన్ని అర్థం చేసుకుంటూ.. అందించే ప్రోత్సాహాన్ని సద్వినియోగం చేసుకుంటూ నాగరాజు నాయుడు వంటి చురుకైన అధికారులు పోషించే పాత్ర చరిత్రలో నిలిచిపోతుంది. ఒక్కో దేశం అభ్యంతరాన్ని లోతుగా అధ్యయనం చేసి, విశ్లేషించి, వాటికి పరిష్కార మార్గాలు చూపి, అవసరమైతే డ్రాఫ్ట్ కాపీలో సవరణలు చేసి.. మొత్తంగా అన్ని దేశాలూ ముక్తకంఠంతో ఆమోదించేలా జాయింట్ డిక్లరేషన్ రూపొందించడంలో ఆయన కీలకంగా వ్యవహరించారు.

హైదరాబాదీ నాయుడు

కాకనూర్ నాగరాజు నాయుడు పుట్టి, పెరిగింది అంతా హైదరాబాద్ లోనే. సికింద్రాబాద్ సెయింట్ ప్యాట్రిక్స్ స్కూల్‌లో పాఠశాల విద్యను పూర్తి చేశారు. నిజాం కాలేజీలో యూనివర్సిటీ విద్య (డిగ్రీ) పూర్తి చేశారు. ఆ తర్వాత అమెరికాలోని మసాచూషెట్స్ ‘ది ఫ్లెచర్ స్కూల్ ఎట్ టఫ్స్ యూనివర్సిటీ’లో ‘లా అండ్ డిప్లమసీ, ఇంటర్నేషనల్ బిజినెస్’లో మాస్టర్స్ పూర్తిచేశారు. 1998 బ్యాచ్ ఐఎఫ్ఎస్ అధికారిగా ఎంపికైన తర్వాత అప్పగించిన అన్ని బాధ్యతల్లోనూ సమర్థవంతంగా పనిచేసి పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం జీ-20 భారత ప్రెసిడెన్సీ సచివాలయంలో జాయింట్ సెక్రటరీ హోదాలో ఉన్నారు. ఈ బాధ్యత అప్పగించే వరకు ఆయన ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 76వ సెషన్ అధ్యక్షుడికి ‘చెఫ్ డి కేబినెట్’గా పనిచేశారు. అంతకంటే ముందు ఐక్యరాజ్య సమితిలో భారత్ తరఫున పర్మనెంట్ డిప్యూటీ రిప్రజెంటేటివ్‌గా పనిచేశారు.

చైనా రాజధాని బీజింగ్‌లోని భారత రాయబార కార్యాలయంలో నాలుగు విడతలుగా సుదీర్ఘకాలం పనిచేసిన నాగరాజు నాయుడు.. మాండరిన్ (చైనీయుల భాష) అనర్గళంగా మాట్లాడగలరు. 2013 నుంచి 2015 వరకు చైనాలోని గాంగ్జూలో ఉన్న భారత రాయబార కార్యాలయంలో కాన్సులేట్ జనరల్‌గా పనిచేశారు. అంతర్జాతీయ దౌత్యంతో పాటు వ్యూహాత్మక సంప్రదింపులు, ప్రభుత్వ వ్యవహారాల్లో నాయుడుకి గట్టి పట్టుంది. ముఖ్యంగా చైనా వ్యవహారాల్లో ఆయనకు లోతైన అవగాహన, అనుభవం, నైపుణ్యం ఉన్నాయి. 2019లో భారత ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దు చేసినప్పుడు ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్ ఈ అంశాన్ని అంతర్జాతీయ అంశంగా చూపించే ప్రయత్నం చేసింది. ఆ సమయంలో భారత్ తరఫున అక్కడ శాశ్వత ఉప ప్రతినిధిగా ఉన్న ఆయన.. పాక్ ప్రయత్నాలను సమర్థవంతంగా తిప్పికొట్టారు. అంతకంటే ముందు ఓసారి కాశ్మీర్‌పై భారత వైఖరిని బలంగా చాటి చెప్పారు.

యునైటెడ్ నేషన్స్ నుంచి భారత్ తిరిగొచ్చిన తర్వాత నాయుడు విదేశీ వ్యవహారాల శాఖలో ‘ఎకనమిక్ డిప్లొమసీ డివిజన్’లో జాయింట్ సెక్రటరీగా కొన్నాళ్లు.. యూరప్ వెస్ట్ డివిజన్ డైరెక్టర్ జనరల్‌గా కొన్నాళ్లు పనిచేశారు. ఈ సమయంలోనే బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్, ఇటలీ, పోర్చుగల్, ఇర్లాండ్, బెల్జియం, లగ్జెంబర్గ్, నెదర్లాండ్స్, మొనాకో, ఆండోరా, సాన్‌మారినో వంటి దేశాలతో పాటు యూరోపియన్ యూనియన్‌లతో ద్వైపాక్షిక రాజకీయ చర్చలకు నేతృత్వం వహించారు. వాటిని విజయవంతం చేశారు. ‘ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఇన్ ఇండియా’ ఏర్పాటు చేయడంలో నేషనల్ కోఆర్డినేటర్‌గా పనిచేశారు. జీ-20 ప్రెసిడెన్సీ బాధ్యతల్ని ప్రధాని మోదీ బ్రెజిల్‌కు అప్పగించడంతో ఆయన ప్రస్తుత బాధ్యతలు ముగిశాయి. స్వయంగా జీ20 షెర్పాగా వ్యవహరించిన అమితాబ్ కాంత్ ప్రశంసలు అందుకున్న నాగరాజు నాయుడుకు ప్రభుత్వం తదుపరి ఏ బాధ్యతలు అప్పగిస్తుందో చూడాలి మరి..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే