AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Inter Board: తెలంగాణలో ఇంటర్ కాలేజీల రేషనలైజేషన్‌.. ప్రతిపాదనలు సిద్ధం చేసిన విద్యా శాఖ అధికారులు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోబోతుంది. ప్రభుత్వ పాఠశాలల తరహాలోనే ఇంటర్‌ కళాశాల రేషనలైజేషన్‌ ప్రక్రియను చేపట్టేందుకు సిద్ధమవుతోంది.

Inter Board: తెలంగాణలో ఇంటర్ కాలేజీల రేషనలైజేషన్‌.. ప్రతిపాదనలు సిద్ధం చేసిన విద్యా శాఖ అధికారులు
Telangana Inter Colleges
Balaraju Goud
|

Updated on: Aug 21, 2021 | 9:44 AM

Share

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోబోతుంది. ప్రభుత్వ పాఠశాలల తరహాలోనే ఇంటర్‌ కళాశాల రేషనలైజేషన్‌ ప్రక్రియను చేపట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండి, అధ్యాపకుల సంఖ్య అధికంగా ఉంటే వారిని బదిలీచేసి, విద్యార్థుల సంఖ్య అధికంగా ఉన్న కాలేజీల్లో సర్దుబాటు చేయాలని భావిస్తోంది.

ఈ ఏడాది ప్రభుత్వ కాలేజీల్లో అడ్మిషన్లు గణనీయంగా పెరిగాయి. 10కిపైగా కాలేజీల్లో వెయ్యి మందికిపైగా విద్యార్థులు అడ్మిషన్లు పొందగా, 30కిపైగా కాలేజీల్లో 500 మందికిపైగా చేరారు. ప్రస్తుతం కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వీరికి ఆన్‌లైన్‌ తరగతు లు నిర్వహిస్తున్నారు. ప్రత్యక్ష తరగతులు ప్రారంభిస్తే, అధ్యాపకుల కొరత సమస్య తలెత్తే అవకాశముంది. ఈ నేపథ్యంలో రేషనలైజేషన్‌ ప్రక్రియ నిర్వహించడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు ప్రతిపాదనలను వారం రోజుల్లో ప్రభుత్వానికి పంపి, అనుమతి వచ్చిన వెంటనే హేతుబద్ధీకరణ చేపట్టనున్నారు.

కాగా, తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 405 ప్రభుత్వ కాలేజీలున్నాయి. వీటి లో మొత్తం 6,008 పోస్టులుండగా, ప్రస్తుతానికి 817 మంది రెగ్యులర్‌ అధ్యాపకులు, 3,599 మంది కాంట్రాక్ట్‌ అధ్యాపకులు పనిచేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,592 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇటీవల పలువురు అధ్యాపకులకు ప్రిన్సిపాళ్లుగా పదోన్నతి కల్పించడంతో మరో 120 వరకు ఖాళీలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో హేతుబద్ధీకరణ ద్వారా వివిధ కాలేజీల్లో ఉన్న ఈ ఖాళీలను భర్తీచేయాలనుకుంటున్నారు.

ఇంటర్‌ కాలేజీల్లో ఒక్కో సెక్షన్‌కు గరిష్ఠంగా 88 మంది విద్యార్థులుండాలి. ఈ సంఖ్యను బట్టే అధ్యాపక పోస్టులను కేటాయించే అవకాశాలున్నాయి. కోర్సులు, సబ్జెక్టులను బట్టి అధ్యాపకులను కేటాయిస్తారు. ఉదాహరణకు ఎంపీసీ విద్యార్థులకు ఫిజిక్స్‌, కెమిస్ట్రీలను బోధించే అధ్యాపకులే బైపీసీ విద్యార్థులకు ఆయా సబ్జెక్టులను బోధించాల్సి ఉంటుంది. సీఈసీ విద్యార్థులకు ఎకనామిక్స్‌, సివిక్స్‌ సబ్జెక్టులను బోధించే అధ్యాపకులే హెచ్‌ఈసీ విద్యార్థులకు ఆ సబ్జెక్టులను బోధించాలి. ఇంగ్లిష్‌, తెలుగు, ఉర్దూ లాంటి భాషలను బోధించే అధ్యాపకులు అన్ని రకాల కోర్సుల్లోని వారికి బోధించాల్సి ఉంటుంది.

ఇదిలావుంటే, ఇంటర్‌ అధ్యాపకుల బదిలీలు చాలా ఏండ్ల నుంచి పెండింగ్‌లో ఉంది. ఒకేచోట ఐదేండ్లకు మించి పనిచేసిన వారిని తప్పనిసరిగా బదిలీచేయాలి. కానీ గత 13 సంవత్సరాల నుంచి అలాంటిదేమీ జరగలేదు. అధికారులు వెంటనే ఈ అంశంపై దృష్టి సారించి కాంట్రాక్ట్‌, రెగ్యులర్‌ అధ్యాపకులను బదిలీ చేయాలి. అలాగైతేనే సంఖ్య అధికంగా ఉన్న కాలేజీల్లోని విద్యార్థులకు న్యాయం చేయగలుగుతాం. – మాచెర్ల రామకృష్ణగౌడ్‌, తెలంగాణ ఇంటర్‌ విద్యా పరిరక్షణ సమితి.

Read Also… Afghan Crisis: ఆఫ్ఘనిస్తాన్‌లో కొత్త ట్విస్ట్ రంగంలోకి అహ్మెద్ మసూద్ ఎంట్రీ .. మరోసారి అంతర్యుద్ధంలోకి వెళ్లబోతుందా