TPCC team: టీమ్ లీడర్ ఓకే.. మెంబర్స్ ఎవరుంటారు? పాతవారు కొనసాగుతారా?
ఏ పార్టీకైనా అధికారం అంటే ఆ హడావుడే వేరే లెవల్‌లో ఉంటుంది. తెలంగాణలో పదేళ్ల తర్వాత అధికారం దక్కించుకున్న కాంగ్రెస్ పరిస్థితి ప్రస్తుతం అలాగే ఉంది. పదవుల విషయంలో గాంధీభవన్‌లో జరుగుతున్న చర్చోపచర్చలు.. చక్కర్లు కొడుతున్న నేతలు.. ఒకరకంగా చెప్పాలంటే, సందడి వాతావరణం కనిపిస్తోంది.
ఏ పార్టీకైనా అధికారం అంటే ఆ హడావుడే వేరే లెవల్‌లో ఉంటుంది. తెలంగాణలో పదేళ్ల తర్వాత అధికారం దక్కించుకున్న కాంగ్రెస్ పరిస్థితి ప్రస్తుతం అలాగే ఉంది. పదవుల విషయంలో గాంధీభవన్‌లో జరుగుతున్న చర్చోపచర్చలు.. చక్కర్లు కొడుతున్న నేతలు.. ఒకరకంగా చెప్పాలంటే, సందడి వాతావరణం కనిపిస్తోంది. అయితే, పీసీసీ కన్ఫామ్ అయిపోయారు కాబట్టి, ఇక కొత్త టీమ్ ఎలా ఉంటుందనే ఆసక్తికరంగా మారింది.
తెలంగాణ కొత్త పిసిసి అధ్యక్షుడిగా.. బీసీ నేత, ప్రస్తుత వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్‌కుమార్‌గౌడ్‌ను నియమించింది కాంగ్రెస్ హై కమాండ్. దీనికి సంబంధించి.. ఈ నెల 15న గాంధీ భవన్‌లో భాద్యతల స్వీకరణ కోసం ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. అంతా బాగానే ఉంది గానీ.. కొత్త పీసీసీ చీఫ్‌కు.. మున్ముందు పెను సవాళ్లే ఉండబోతున్నాయని పరిస్థితిని చూస్తే అర్థమవుతోంది. టీమ్ లీడర్ ఓకే.. మరి ఇప్పుడు టీమ్ మెంబర్స్ ఎలా ఉండబోతున్నారు? ఎవరెవరికి ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తారు? అసలు పాత కార్యకవర్గంలో ఒక్కరికైనా ఛాన్స్ దక్కుతుందా? లేక అంతా కొత్తవారికే అవకాశం ఇస్తారా? అనే చర్చ గాంధీభవన్ సర్కిల్‌లో జోరుగా సాగుతోంది.
మరోవైపు, పీసీసీ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసినవెంటనే.. పాత కార్యవర్గం మొత్తాన్ని రద్దు చేసి.. కొత్త కమిటీని ఏర్పాటు చేసుకునేందుకు ఇప్పటికే కసరత్తు ముమ్మరం చేశారట మహేష్‌కుమార్‌గౌడ్. ముఖ్యమంత్రి రేవంత్‌కు సన్నిహితుడిగా, వివాదరహితుడిగా ఉండటంతో… బీసీ నేతగా మహేష్ కుమార్ గౌడ్‌కు పీసీసీగా అవకాశం కల్పించింది అధిష్ఠానం. తన టీమ్‌ను ఎంపిక చేసుకునే విషయంలో కొత్త పీసీసీ చీఫ్ ఎలా వ్యవహరిస్తారన్నది ఆసక్తి రేపుతోంది. ఇప్పటికే, పార్టీలో సమన్యాయం కొరవడిందని.. తమ వర్గానికి ప్రాధాన్యత దక్కడం లేదని.. కొందరు నేతలు ధిక్కార స్వరం వినిపిస్తున్న పరిస్థితి ఉంది. కార్పొరేషన్లలో అవకాశం దక్కని నేతలు సైతం… పార్టీ పదవులకు పోటీ పడుతున్నారు. ఇలాంటి సిట్యుయేషన్ లో కొత్త టీమ్‌ను సెట్ చేసుకోవడం మహేష్ కుమార్ గౌడ్‌కు కత్తిమీద సామే అంటున్నారు విశ్లేషకులు.
అందరకీ సమన్యాయం చేసేలా వర్కింగ్ ప్రెసిడెంట్లు, ప్రధాన కార్యదర్శులు, వివిధ విభాగాల నాయకులను ఎంపిక చేసుకోవడం ఒకెత్తయితే… ఆ జాబితాను అధిష్ఠానం దగ్గర ఆమోదింపజేసుకోవడం ఒకెత్తు. అందుకే, ఆ కసరత్తును గట్టిగానే చేస్తున్నారట కొత్త బాస్. హై కామాండ్‌ను సంప్రదించి, ఒక లిస్టును వారిముందుపెట్టి గ్రీన్ సిగ్నల్ పొందాలని చూస్తున్నారట. సీనియర్లను, జూనియర్లను సమన్వయం చేసేలా ఈ పదవుల చిట్టా ఉంటుందని తెలుస్తోంది.
సీనియర్ నేత, ప్రస్తుత వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డికి ప్రచార కమిటీ చైర్మన్ పదవి దాదాపు ఖరారైనట్టు ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. ఐదుగురు వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టుల కోసం చామల కిరణ్ కుమార్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, అడ్లూరి లక్ష్మణ్, అంజన్ కుమార్ యాదవ్, ఫిరోజ్ ఖాన్, రోహిన్ రెడ్డి, వంశీ చంద్ రెడ్డి , సునీత రావు, సరితా తిరుపతయ్య, బలరాం నాయక్ సహా పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. మిగితా పదవుల రేసులోనూ.. చాలామంది సీనియర్లు, జూనియర్లు ఉన్నారు.
ఈ ప్రచారాలన్నీ ఎలా ఉన్నా.. కాంగ్రెస్ పార్టీలో హైకమాండ్ చెప్పిందే ఫైనల్. కాబట్టి, త్వరలోనే అధిష్ఠానం పెద్దల ఆశీర్వాదం తీసుకుని, వర్కింగ్ ప్రెసిడెంట్‌లతో పాటు ప్రధాన కార్యదర్శులు, సీనియర్ వైస్ ప్రెసిడెంట్లు, అధికార ప్రతినిధులను నియమించి.. పూర్తిస్థాయిలో పార్టీ కార్యక్రమాలపై దృష్టి పెట్టేందుకు మహేష్‌కుమార్ గౌడ్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. అయితే, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ఆయనకు అగ్నిపరీక్షే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మెజారిటీ స్థానాలను గెలిపిస్తేనే పార్టీలో అయినా, హైకమాండ్ దగ్గరయినా ఆయన పరపతి మరింత పెరుగుతుంది. లేదంటే, సొంత పార్టీలోనే ఆయనకు వ్యతిరేకంగా, కుంపట్లు తయారయ్యే అవకాశం లేకపోలేదు. పీసీసీ కొత్త టీమ్ కూర్పు ఎలా ఉంటుంది.. నూతన అధ్యక్షుడు ఎలాంటి కార్యాచరణతో పార్టీని ముందుకు తీసుకెళ్తారో చూడాలి మరి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..