AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KCR on MLC Elections: ఎమ్మెల్సీ బరిలో అనుహ్యంగా కొత్త వ్యక్తులు.. అభ్యర్థుల ఎంపికలో తనదైన మార్క్‌ చూపించిన కేసీఆర్

ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో ఊహించని ట్విస్ట్‌లు ఇచ్చారు టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు. అనూహ్యంగా అభ్యర్థుల్ని ఎంపిక చేసి తనదైన మార్క్‌ చూపించారు.

KCR on MLC Elections: ఎమ్మెల్సీ బరిలో అనుహ్యంగా కొత్త వ్యక్తులు.. అభ్యర్థుల ఎంపికలో తనదైన మార్క్‌ చూపించిన కేసీఆర్
Kcr On Mlc
Balaraju Goud
|

Updated on: Nov 16, 2021 | 1:19 PM

Share

CM KCR on MLC Candidates Selection: ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో ఊహించని ట్విస్ట్‌లు ఇచ్చారు టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు. అనూహ్యంగా అభ్యర్థుల్ని ఎంపిక చేసి తనదైన మార్క్‌ చూపించారు. సీఎం అనూహ్య నిర్ణయాలతో కేబినెట్‌లో పలువురికి బెర్త్‌లు ఖాయమన్న ఊహాగానాలు తెరమీదకొస్తున్నాయి.

రాజ్యసభ్యుడిగా ఉన్న బండా ప్రకాష్‌ను టీఆరఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేశారు సీఎం కేసీఆర్. మూడేళ్ల పదవి ఉన్న ప్రకాష్‌ను రాజీనామా చేయించి మండలికి పంపించడం అందరిని అశ్చర్యానికి గురిచేసింది. బండా ఎంపికలో మరో ఇంట్రెస్ట్‌ టాపిక్ తెరపైకి వస్తుంది. రాష్ట్ర మంత్రి మండలి నుంచి జూన్‌లో ఈటల రాజేందర్‌ను బర్తరఫ్ చేశారు. ఆయనను మంత్రివర్గం నుంచి తప్పించడంతో రాష్ట్రంలో ఉన్న ముదిరాజ్‌లు ఆగ్రహంగా ఉన్నారు. అలాగే, బీసీ సంఘాలు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హుజురాబాద్ ఉప ఎన్నికలో ఆ ప్రభావం స్పష్టంగా కనిపించిందనే అంచనాకు వచ్చారు కేసీఆర్. అందుకే బీసీ సంఘాలతో పాటు ముదిరాజులను కూల్ చేసేలా ఎత్తుగడ వేసినట్టుగా తెలుస్తోంది. ఈటల సామాజిక వర్గానికి చెందిన బండా ప్రకాశ్ ను ఎమ్మెల్సీగా చేసి.. తర్వాత కేబినెట్ లోకి తీసుకోవాలని కేసీఆర్ డిసైడ్ అయ్యారనే టాక్ వినిపిస్తోంది. ఫైనల్‌గా ఈటల ప్లేస్‌ను బండతో సరి చేస్తారని తెలుస్తోంది.

ఇక, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో కేసీఆర్ స్కెచ్ క్లియర్‌గా కనిపిస్తోంది. ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్న తన కూతురు కవితను పెద్దల సభకు పంపించాలన్న ఆలోచనలో గులాబీ బాస్‌ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నిజామాబాద్ స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా ఉన్నారు కవిత. ఆమె పదవి కాలం త్వరలోనే ముగియనుంది. నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికకు నోటిఫికేషన్ కూడా వచ్చింది. ఈ క్రమంలో కవితను మళ్లీ మండలికి కాకుండా ఢిల్లీకి పంపించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. బండా ప్రకాశ్ ఎంపీ పదవి కాలం ఇంకా దాదాపు మూడేళ్ల దాకా ఉంది. దీంతో బండ స్థానంలో రాజ్యసభకు కవితను పంపిస్తారని సమాచారం. అలాగే, పార్టీ ఢిల్లీ వ్యవహారాలు కూడా కవితకు అప్పగించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.

మరోవైపు, జిల్లా కలెక్టర్‌గా ఉండి, ఐఏఎస్‌గా వాలంటరీ రిటైర్మెట్ ప్రకటించిన వెంకట్రామిరెడ్డిని కూడా ఎమ్మెల్యే కోటాలోనే శాసనమండలి ఎంపిక చేసి అందరికి షాకిచ్చారు సీఎం కేసీఆర్. మొదటినుంచి వెంకట్రామిరెడ్డి ముఖ్యమంత్రికి వీర విధేయుడు. ఆయన మనసుకి దగ్గరగా మసులుకునే వ్యక్తి. ఎమ్మెల్సీ పదవి మాత్రమే కాకుండా వెంకట్రామిరెడ్డిని కేబినెట్‌లోకి తీసుకుంటారనే టాక్ వినిపిస్తోంది. ఒకవేళ కేబినెట్‌లోకి తీసుకుంటే ఎవరి ప్లేస్‌లో భర్తీ చేస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

మరో సీనియర్ నేత కడియం శ్రీహరిని కూడా ఎమ్మెల్సీగా ఎంపిక చేశారు సీఎం కేసీఆర్‌. ఎమ్మెల్సీతో పాటు కేబినెట్‌లోకి తీసుకుంటారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దళిత బంధు పథకాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ క్రమంలో దళితుడికి పదవి కట్టబెట్టి ఆ వర్గాలను మచ్చిక చేసుకోవాలన్న ఆలోచనలో కేసీఆర్‌ ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవేళ కేబినెట్‌లోకి తీసుకునే అవకాశం లేకుంటే కౌన్సిల్ చైర్మన్‌ పదవిని కట్టబెట్టే ఛాన్స్‌ ఉంది. ఎలాగైనా కడియం శ్రీహరి లాంటి నేత అనుభవాలను ఉపయోగించుకోవాలని గులాబీ దళపతి భావిస్తున్నారు.

ఇక, మాజీ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌ రెడ్డికి ఈసారి ఎమ్మెల్సీతో పాటు కేబినెట్‌లో స్థానం ఖాయమనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. సాధ్యం కాని పక్షంలో మళ్లీ కౌన్సిల్ చైర్మన్‌ పదవిని కట్టబెట్టే అవకాశముందని తెలుస్తోంది. ఎలాగైనా గుత్తా అనుభవాన్ని ఉపయోగించుకోవాలని కేసీఆర్‌ భావిస్తున్నారు.

Read Also…  AP MLC Elections: ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు.. వైసీపీ అభ్యర్థులకు బీఫాం అందజేసిన సీఎం వైఎస్ జగన్‌