Khilashapur Fort: చారిత్రాత్మక ఖిలాష్‌పూర్ కోటకు మహార్ధశ.. పునరుద్ధరణ పనులకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ శ్రీకారం
జనగామ జిల్లాలోని ఖిలాష్‌పూర్‌లో బహుజన చక్రవర్తి శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ నిర్మించిన చారిత్రాత్మక కోట పునరుద్ధరణ పనులను రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ శనివారం ప్రారంభించారు.
Historical Khilashapur Fort Renovation Works Started: జనగామ జిల్లాలోని ఖిలాష్‌పూర్‌లో బహుజన చక్రవర్తి శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ నిర్మించిన చారిత్రాత్మక కోట పునరుద్ధరణ పనులను రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ శనివారం ప్రారంభించారు. అనంతరం కోట గతంలో జరిగిన పనులను పరిశీలించారు. కోట అభివృద్ధిపై పురావస్తు శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్‌తో చర్చించారు. కోట పునరుద్ధరణ పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బహుజనుల చక్రవర్తి పాపన్న నిర్మించిన కోటల సంరక్షణకు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పర్యాటకశాఖ చర్యలు చేపట్టిందన్నారు. అందులో భాగంగా జాఫర్ ఘడ్, తాటికొండ, భువనగిరి కోటలతో పాటు చరిత్రాత్మక కోటల పరిరక్షణకు చర్యలు చేపట్టామన్నారు. కరీంనగర్ జిల్లాలోని సైదాపూర్‌లో పాపన్న నిర్మించిన కోటకు గ్రానైట్ తవ్వకాల వల్ల నష్టం జరుగుతుందని తెలవడంతో విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి ఒక్కరోజులొనే గ్రానైట్ లీజులను రద్దు చేసినట్లు మంత్రి గుర్తు చేశారు. పాపన్న కోటను పురావస్తు పార్క్‌గా అభివృద్ధి చేసి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామన్నారు.ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలోని చారిత్రాత్మక కోటల రక్షణకు కరవైందన్న మంత్రి స్వరాష్ట్రంలో తెలంగాణ చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయాలకు పెద్ద పీట వేసి వాటి సంరక్షణకు, భవిష్యత్తు తరాలకు మార్గదర్శిగా ఉండేలా తీర్చిదిద్దేoదుకు కృషి చేస్తున్నారన్నారు.