Minister KTR: అభివృద్ధిని అడ్డుకుంటున్న ఆర్మీ.. పవర్, వాటర్ కట్ చేస్తాం.. కేంద్రానికి మంత్రి కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్!

కంటోన్మెంట్, ఆర్మీ ఏరియా చుట్టుపక్కల ప్రాంతాల అభివృద్ధికి ఏర్పడుతున్న అవరోధాలకు కేంద్ర ప్రభుత్వమే కారణమంటూ రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. అభివృద్ధికి కలిసి నడవాల్సిన చోట మోకాలడ్డుతే చూస్తూ ఊరుకోమని మంత్రి కేటీఆర్ హెచ్చరించారు.

Minister KTR: అభివృద్ధిని అడ్డుకుంటున్న ఆర్మీ.. పవర్, వాటర్ కట్ చేస్తాం.. కేంద్రానికి మంత్రి కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్!
Ktr
Follow us
Balaraju Goud

|

Updated on: Mar 13, 2022 | 9:54 AM

Minister KTR in Assembly: సికింద్రాబాద్(Secundrabad) కంటోన్మెంట్(Cantonment) లో రోడ్లు మూసివేత.. లంగర్ హౌజ్(Lounger House) మిలటరీ ఏరియాలో చెక్ డాం నిర్మాణం.. ఆర్మీ అభివృద్ధికి అడ్డుపడుతోంది. కేంద్రం ఆధీనంలోని ఆర్మీ చేష్టలతో నగరంలో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారని మంత్రి కేటీ రామారావు ఆరోపించారు. అంతే కాదు అవసరమైతే పవర్, వాటర్ కట్ చేస్తాం.. ఏం చేస్తారో చూస్తాం అంటూ వార్నింగ్ ఇచ్చారు. మిలటరీ ఏరియా, కంటోన్మెంట్ బోర్డు ప్రాంతాల్లో డెవలప్ మెంట్‌కు ఆటంకాలు సృష్టిస్తోందన్ని సగటు గ్రేటర్ హైదరాబాద్ వాసులను వేధిస్తున్న ప్రశ్న. అసెంబ్లీ సాక్షిగా మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారాయి.

బుల్కాపూర్ నాలా లంగర్ హౌజ్, మెహిదీపట్నంలోని మిలటరీ ఏరియాలోంచి ప్రవహిస్తోంది. దీనిపై ఆర్మీ అధికారులు చెక్ డ్యాం కట్టడంతో వర్షాకాలంలో నదీం కాలనీ, శాతం నగర్ సహా పలు కాలనీలకు వరద ముప్పుతప్పడం లేదు. ఇక్కడ కేంద్రం అధీనంలోని ఆర్మీ ఇష్టం వచ్చినట్లు చెక్ డ్యాంలు కట్టడం, మరోవైపు కంటోన్మెంట్ బోర్డులో రోడ్లు మూసివేయడంపై మంత్రి కేటీఆర్ ఇలా ఆగ్రహం వ్యక్తం చేస్తారు. అభివృద్ధికి అడ్డుపడితే అవసరమైతే మిలటరీ ఏరియా, కంటోన్మెంట్ బోర్డుకు కరెంట్, వాటర్ కట్ చేస్తామంటూ తీవ్ర హెచ్చరిక అసెంబ్లీ సాక్షిగా చేశారు.

ఎంఐఎం ఎమ్మెల్యే లేవనెత్తిన నాలా ప్రాబ్లమ్ ఆర్మీ అధికారుల ఇష్టారీతి చర్యల కారణంగా పరిష్కారం కావడం లేదన్నది మంత్రి ఉద్దేశ్యం. అయితే ఆర్మీ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది కాబట్టి ఈ సందర్భాన్ని నడిబొడ్డున ఉన్న కంటోన్మెంట్ బోర్డు కారణంగా కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయని మంత్రి కేటీఆర్ జోడించి చెప్పారు. ఈ రెండు ఏరియాలు నగరంలో భాగమైనప్పటికి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి పనులు కానీ, చర్యలు కానీ తీసుకునే పరిస్థితి లేదు. దీంతో కంటోన్మెంట్ బోర్డు, ఇతర ఆర్మీ ఏరియా చుట్టుపక్కల ప్రాంతాలకు ఇబ్బందులు కలిగేలా చేయడం సరికాదంటూ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. వాళ్లేదో సెపరేట్ దేశంలో ఉన్నట్టు.. మిగిలిన తెలంగాణ మరో సెపరేట్ దేశం అన్నట్టు వ్యవహరించడం సరికాదంటూ ఫైర్ అయ్యారు.

కేంద్రంపై ఇటీవల విమర్శల బాణాలు ఎక్కుపెట్టిన అధికార టీఆర్ఎస్, మంత్రులు ఏ చిన్న ఛాన్స్ వచ్చినా వదులుకోవడం లేదు. అంశం ఏదైనా అందులో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపాలని చూస్తున్నారు. అదే కోవలో మంత్రి కేటీఆర్ నగర అభివృద్ధిలో భాగంగా నాలాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు వివరిస్తూ.. బుల్కాపూర్ నాలాపై ఎందుకో సమస్య ఉందో దానికి కారణం కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఆర్మీ అంటూ చెప్పుకొచ్చారు. ఇక ఇప్పటికే గత కొంతకాలంగా కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని ప్రాబ్లమ్స్ ప్రస్తావిస్తూ.. బస్తీలను జిహెచ్ఎంసీ లో కలపాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

అయితే కంటోన్మెంట్ లో ఏ రోడ్డు ఎప్పుడు ముస్తారో తెలియదు. ఎక్కడి నుంచి వెళితే ఎక్కడ ఆగుతామో అర్ధం కాదు. కంటోన్మెంట్ పరిధిలోని బస్తీ వాసులు ఎన్నోఏళ్లుగా ఆర్మీ రోడ్లు మూసివేతతో ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాదు జీహెచ్ఎంసీలో అమలయ్యే ఏ పథకం అందాలన్న కళ్లుకాయలు కాచేలా ఎదురుచూడాల్సిందే. ఇలా నగరం నడిబొడ్డున ఉన్న మూడున్నర లక్షల మంది ఇబ్బందులపై రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తోంది. మా వాళ్లకు మేము పనులు చేసే పరిస్థితి లేకుండా పోయిందంటూ వాపోతుంది. కేంద్రం ఆధీనంలో నడిచే కంటోన్మెంట్ బోర్డు ఇష్టారీతిన చేస్తున్న పనులకు సామాన్యులు తిప్పలు పడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అందులో భాగమే మంత్రి కేటీఆర్ అసెంబ్లీలో మాట్లాడుతూ అవసరమైతే బోర్డుకు కరెంట్, వాటర్ కట్ చేస్తామని తీవ్ర వ్యాఖ్యలు చేసిన సందర్భం.

బ్రిటిష్ హయాంలో మిలటరీ అవసరాల కోసం ఏర్పాటు చేసిన కంటోన్మెంట్ బోర్డు భాగ్యనగరం మధ్యలో ఉంది.కంటోన్మెంట్ బోర్డుగా ఇక్కడ పాలన సాగుతోంది. పెరిగిన జనాభా రిత్యా ట్రాఫిక్ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం ఈ భూముల నుంచి రోడ్డు వేయాలన్న, స్కైవే నిర్మించాలన్నా.. తాగునీటి సరఫరా చేయాలన్నా.. పేదలకు ఇళ్లు నిర్మించాలన్నా.. అనుమతుల పేరుతో కేంద్ర రక్షణ శాఖకు ప్రతిపాదనల పంపాలి. అవి అనుమతి పొందేదాక ఆగాలి. భద్రత వ్యవస్థతకు సంబంధించిన అంశం కావడంతో అనుమతులు గగనమనే చెప్పాలి. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం కంటోన్మెంట్ బోర్డుతో మాట్లాడి బస్తీలలోని ప్రజలకు నగరమంతా అమలవుతున్న ఉచిత మంచి నీటి పథకం అమలు చేసేలా ఒప్పందం కుదుర్చుకుంది. నెలకు 20 వేల లిటర్ల చొప్పున అయ్యే బిల్లులకు రాష్ట్ర ప్రభుత్వం కంటోన్మెంట్ బోర్డుకు నిధులు ఇవ్వనుంది. దీంతో 3 లక్షల మందికి ఉచితమంచినీటి సరఫరా కంటోన్మెంట్ ఏరియాలో అందుబాటులోకి వచ్చింది.

సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు 9 వేల 926 ఎకరాల్లో విస్తీర్ణంలో ఉంది. అందులో 6 వేల ఎకరాలు పూర్తిగా ఆర్మీ ఆధీనంలో ఉంది. మరో 500 ఎకరాలు విమానయాన, రైల్వే మినిస్ట్రీల చేతిలో ఉన్నాయి. 700 ఎకరాల్లో బైసన్ పోలో, జింఖానా మైదానాలు సహా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. వీటితో ఎక్కడా ఇబ్బంది లేదు. మిగిలిన 2 వేల 800 ఎకరాల్లోని 350 బస్తీలు, కాలనీలల్లో నివాసం ఉంటున్న సాధారణ ప్రజానీకం పరిస్థితే ఇక్కడ ప్రస్తావించాలి. మిలటరీ ప్రాంతం కావడంతో ప్రత్యేక ఆంక్షలు ఉంటాయి. అవే ఇక్కడి సామాన్యులపై ప్రభావం చూపుతున్నాయి. రహదారులపై ఆంక్షలు, ప్రత్యేక టోల్, నివాస సముదాయాల్లో నీటి సప్లై ఇబ్బందులు వంటివి భారంగా మారుతున్నాయి. ఇళ్లు కట్టాలంటే కంటోన్మెంట్ బోర్డు ప్రత్యేక అనుమతి ఉండాలి. జీ ప్లస్ 2 మించి ఎక్కడా నిర్మాణం చేపట్టరాదు. రోడ్డు నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వానికి పరిధి లేదు. ఇక్కడా అంతా స్పెషల్. కొంతమంది బస్తీల్లోని పేదలను అనధికారికంగా ఉంటున్నారంటూ 30 వేలకు పైగా ఓట్లను తొలగించారు.

మొత్తంగా కంటోన్మెంట్, ఆర్మీ ఏరియా చుట్టుపక్కల ప్రాంతాల అభివృద్ధికి ఏర్పడుతున్న అవరోధాలకు కేంద్ర ప్రభుత్వమే కారణమంటూ రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. అభివృద్ధికి కలిసి నడవాల్సిన చోట మోకాలడ్డుతే చూస్తూ ఊరుకోమని హెచ్చరిస్తోంది.

Read Also…. 

Telangana: అసెంబ్లీలో నవ్వులే నవ్వులు.. భట్టి విక్రమార్క కామెడీకి పడి పడి నవ్విన మంత్రి కేటీఆర్..