Hydereabad: భాగ్యనగరంలో ట్రాఫిక ఆంక్షలు.. లాల్ దర్వాజా బోనాల జాతరకు సర్వం సిద్ధం..!
ఆషాఢ బోనాల జాతర ఉత్సవాల్లో భాగంగా పాతబస్తీలోని లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి బోనాల ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు.
Hyderabad Lal Darwaza Bonalu 2021: ఆషాఢ బోనాల జాతర ఉత్సవాల్లో భాగంగా పాతబస్తీలోని లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి బోనాల ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. బోనాలను అమ్మవారికి సమర్పించుకునే భక్తులకు అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం, దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలను సిద్ధం చేశామని ఆయన చెప్పారు. అలాగే, రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, అధికార లాంఛనాలు సమర్పిస్తామని ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు.
ముఖ్యంగా బోనాలు సమర్పించేందుకు వచ్చే భక్తులు తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించాలన్న మంత్రి, మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని కోరారు. వేల సంఖ్యలో వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారని మంత్రి తెలిపారు. శాంతి భద్రతలను కాపాడేందుకు ప్రత్యేక పోలీసు బలగాలను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. అంతేకాకుండా అన్ని శాఖలను సమన్వయం చేసుకొని లాల్ దర్వాజా బోనాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని మంత్రి పేర్కొన్నారు.
కాగా, హైదరాబాద్ పాతబస్తీలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే లాల్‌దర్వాజా బోనాలకు తగిన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ వెల్లడించారు. సింహవాహిని మహంకాళి అమ్మవారి అంబారీ ఊరేగింపు సందర్భంగా వాహనాలను దారి మళ్లిస్తున్నట్లు తెలిపారు. కమిషనర్ నుంచి హోంగార్డు వరకూ అందరూ బందోబస్తు విధుల్లో పాల్గొంటారని ఆయన తెలిపారు. పాతబస్తీలోని పలు కాలనీల నుంచి బోనాల ఊరేగింపు లాల్ దర్వాజా మహంకాళి ఆలయానికి చేరుకుంటుందని.. రంగం, పోతురాజు ప్రవేశం కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో అన్ని కార్యక్రమాలు సాఫీగా సాగేలా తగిన ఏర్పాట్లు చేసినట్లు సీపీ వెల్లడించారు. ఇందుకు కోసం 8 వేల మందితో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు సీపీ చెప్పారు. అయితే, బోనాల ఉత్సవాల్లో పాల్గొనే ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించాలని సీపీ కోరారు.
Read Also… Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. వెనుక నుంచి ఢీకొట్టిన డీసీఎం.. ఇద్దరు చిన్నారులు దుర్మరణం..