Viral Video: వరంగల్ జాబ్‌మేళాలో అపశృతి.. ప్రవేశ ద్వారం వద్ద తొక్కిసలాట! వీడియో చూశారా..
వరంగల్ జాబ్‌మేళాలో 65 ప్రైవేటు కంపెనీలు పాల్గొనగా దాదాపు 23 వేల మందికి పైగా అభ్యర్థులు హాజరైనారు. ఆ స్థాయిలో నిరుద్యోగులు వస్తారని ఊహించని అధికారులు తగిన ఏర్పాట్లు చేయడంలో విఫలమయ్యారు. ప్రభుత్వం స్వయంగా ఏర్పాటుచేసిన జాబ్ మేళా కావడంతో నిరుద్యోగులు పోటెత్తారు. దీంతో..

వరంగల్, ఏప్రిల్ 14: టాస్క్ ఆధ్వర్యంలో రాష్ట్ర సర్కార్ వరంగల్‌లో ఏప్రిల్ 11న జాబ్‌మేళా నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే అనూహ్యంగా ఈ జాబ్ మేళాకు వేల మంది నిరుద్యోగులు పోటెత్తారు. దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ చొరవతో వరంగల్ స్థానిక రైల్వేస్టేషన్ గూడ్స్‌షెడ్ జంక్షన్‌లోని ఎంకే నాయుడు హోటల్స్ అండ్ కన్వెన్షన్ హాల్‌లో ఈ మేళాను ఏర్పాటు చేశారు. మంత్రులు కొండా సురేఖ, సీతక్క, జిల్లా కలెక్టర్ డా. సత్యశారదలు.. జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం 17 మందికి మంత్రులు కలెక్టర్‌తో కలిసి నియామక పత్రాలు అందజేశారు. అనంతరం మంత్రి సురేఖ మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో దశలవారీగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ప్రాధాన్యతా క్రమంలో ప్రతి జిల్లాలో జాబ్‌మేళాలు నిర్వహిస్తామన్నారు. త్వరలో 14 వేల అంగన్‌వాడీ పోస్టులు భర్తీ చేస్తామన్నారు. వివిధ శాఖల్లో ఖాళీ పోస్టుల వివరాలను ఇప్పటికే సేకరించామని త్వరలో వాటిని భర్తీ చేస్తామన్నారు.
మరోవైపు జాబ్‌మేళాలో 65 ప్రైవేటు కంపెనీలు పాల్గొనగా దాదాపు 23 వేల మందికి పైగా అభ్యర్థులు హాజరైనారు. ఆ స్థాయిలో నిరుద్యోగులు వస్తారని ఊహించని అధికారులు తగిన ఏర్పాట్లు చేయడంలో విఫలమయ్యారు. ప్రభుత్వం స్వయంగా ఏర్పాటుచేసిన జాబ్ మేళా కావడంతో ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి పెద్ద ఎత్తున నిరుద్యోగ యువత హాజరైంది. సుమారు 6వేల ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు జరుగుతాయని ప్రచారం చేయడంతో గంపెడు ఆశలతో యువత అక్కడికి చేరుకుంది. కానీ అరకొర ఏర్పాట్ల కారణంగా అక్కడికి వచ్చిన అభ్యర్థులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. క్రౌడ్ ఎక్కువ కావడంతో హోటల్ ఆవరణ కిక్కిరిసిపోయింది.
మంత్రుల ప్రసంగం ముగిసేంత వరకు యువతను బయటే ఉంచారు. మంత్రులు వెళ్లిపోయాక వారందరినీ లోనికి అనుమతించారు. ఈ క్రమంలో ఫంక్షన్ హాలులోకి వెళ్లే మార్గంలో జరిగిన తోపులాటలో ద్వారం అద్దాలు పగిలిపోయాయి. ముగ్గురు మహిళా అభ్యర్ధుల తలలకు దెబ్బలు తగిలాయి. మరో ఐదుగురు కూడా తీవ్రంగా గాయపడ్డారు. దీంతో మిగిలిన వారు భయపడి హాహాకారాలు చేశారు. పోలీసులు వారిని అదుపుచేసి, గాయపడిన వారికి వైద్య సిబ్బందితో ప్రథమ చికిత్స అందించారు. అనంతరం యువతులను స్థానిక అస్పత్రికి తరలించారు. ఒంటిగంట వరకు హోటల్ బయట టెంటు వేయకపోవడంతో నిరుద్యోగులు ఎండవేడికి తల్లడిల్లారు. చాలామంది వెనుదిరిగి వెళ్లిపోయారు కూడా. అయితే ఇందులో 18 వేల మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా.. వారిలో 5,631 మందికి ఉద్యోగాలు ఇచ్చినట్లు సమాచారం.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.