AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: కారు దగ్దం కేసు దర్యాప్తులో సంచలన విషయాలు.. పోలీసులకే మైండ్ బ్లాంక్

మెదక్ జిల్లా వెంకటపూర్ కారు దగ్ధం కేసు పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు వెల్లడయ్యాయి. ధర్మా నాయక్ అండ్ డ్రామా అంతా రట్టు చేశారు పోలీసులు.

Telangana: కారు దగ్దం కేసు దర్యాప్తులో సంచలన విషయాలు.. పోలీసులకే మైండ్ బ్లాంక్
Car Burnt
Ram Naramaneni
|

Updated on: Jan 18, 2023 | 6:20 PM

Share

ఉమ్మడి మెదక్‌ జిల్లాలో సంచలనం రేపిన కారు దగ్దం కేసు దర్యాప్తులో… సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అప్పుల బాధ నుంచి తప్పించుకునేందుకు… దిద్దుకోలేని తప్పు చేసిన ధర్మానాయక్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులకు షాకింగ్‌ నిజాలు తెలిశాయి. ఈనెల 9న వెంకటాపూర్‌లో కారు దగ్ధం అయ్యిందనే సమాచారం అందుకుని అక్కడికివెళ్లిన పోలీసులు.. ఆ మంటల్లో ధర్మా అనే వ్యక్తి చనిపోయినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. కుటుంబసభ్యులు సైతం చనిపోయింది ధర్మానే అని చెప్పడంతో.. పోలీసులు అదే విషయాన్ని ధృవీకరించారు. అయితే, కేసు విచారణలో విస్తుపోయే విషయాలు బయటికొచ్చినట్టు పోలీసులు చెబుతున్నారు. అసలు ధర్మా చనిపోలేదనీ.. బతికే ఉన్నాడనీ గుర్తించారు. నిజామాబాద్‌లో ధర్మా తిరుగుతున్న విజువల్స్‌ని సీసీ కెమెరాల ద్వారా పసిగట్టారు. కుటుంబసభ్యుల తీరుపైనా అనుమానం రావడంతో… మరింత లోతుగా విచారించి అసలు విషయం రాబట్టారు.

డబ్బు సంపాదించాలనే ఆశతో… అప్పులు చేసిమరీ షేర్‌ మార్కెట్స్‌లో పెట్టుబడులు పెట్టాడు ధర్మా. అయితే, వాటిని తీర్చేందుకు.. 7కోట్ల 40లక్షల ఇన్సూరెన్స్‌ డబ్బులు కొట్టేయాలని కొత్త నాటకానికి తెరలేపాడు ధర్మా. తనలా ఉన్న వ్యక్తిని చంపేసి… తానే చనిపోయినట్టు నమ్మించి… కోట్ల రూపాయలు నొక్కేయాలనుకున్నాడు.

ఈ స్కెచ్‌ను అమలు చేసేందుకు.. పెద్ద ప్లానే వేశారు ధర్మా అండ్‌ ఫ్యామిలీ. అతని అక్క సునంద, అల్లుడు శ్రీనివాస్, భార్య నీల, మైనర్‌ కొడుకు…. అంతా కలిసి.. ధర్మాలాంటి వ్యక్తి కోసం నాంపల్లి అడ్డాలో వెతికారు. అక్కడ అంజయ్య అనే వ్యక్తిని పరిచయం చేసుకున్న ధర్మా.. పని ఉందంటూ జనవరి 7న నిజామబాద్‌కు తీసుకెళ్లాడు. అయితే, అతను తాగి ఉండటంతో.. అతడు చనిపోయినా ఇన్సూరెన్స్‌ డబ్బులు రావని భావించి వదిలేశాడు ధర్మా. అయితే అప్పటికప్పుడు ధర్మా అల్లుడు శ్రీనివాస్… నిజామాబాద్ రైల్వే స్టేషన్ లో ధర్మాలాగే ఉన్న బాబు అనే వ్యక్తిని తీసుకొచ్చాడు. ఇంకేముంది పథకాన్ని అమలు చేసి.. అమాయకుడి ప్రాణాలు తీశారు. ఇప్పుడు పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. నిందితులపై మొత్తం ఏడు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..