Telangana Cabinet Highlights: తెలంగాణ‌లో రేప‌టి నుంచి లాక్‌డౌన్‌.. ఈ రంగాల‌కు మిన‌హాయింపు..

CM KCR - Telangana Cabinet Meeting Highlights: తెలంగాణ ప్ర‌భుత్వం అంతా.. అనుకున్న‌ట్లే నిర్ణ‌యం తీసుకుంది. తెలంగాణ‌లో లాక్‌డౌన్ విధిస్తూ తెలంగాణ కేభినేట్ నిర్ణ‌యం తీసుకుంది. తెలంగాణ‌లో రేప‌టి నుంచి ప‌ది రోజుల పాటు..

Telangana Cabinet Highlights: తెలంగాణ‌లో రేప‌టి నుంచి లాక్‌డౌన్‌.. ఈ రంగాల‌కు మిన‌హాయింపు..
Telangana Cm Kcr

|

May 11, 2021 | 7:10 PM

CM KCR – Telangana Cabinet Meeting Highlights: తెలంగాణ ప్ర‌భుత్వం అంతా.. అనుకున్న‌ట్లే నిర్ణ‌యం తీసుకుంది. తెలంగాణ‌లో లాక్‌డౌన్ విధిస్తూ తెలంగాణ కేభినేట్ నిర్ణ‌యం తీసుకుంది. తెలంగాణ‌లో రేప‌టి నుంచి ప‌ది రోజుల పాటు లాక్‌డౌన్ అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యించారు. అయితే ఉద‌యం ఆరు గంట‌ల నుంచి 10 గంట‌ల వ‌ర‌కు ప‌లుకార్య‌క్ర‌మాల‌కు అనుమ‌తి ఇచ్చారు. ఈ లెక్క‌న చూసుకుంటే రేపు (బుధ‌వారం) ఉద‌యం 10 గంట‌ల నుంచి తెలంగాణ‌లో లాక్‌డౌన్ అమ‌ల్లోకి రానుంది.

దేశ వ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో ప్ర‌భుత్వాలు లాక్‌డౌన్ విధిస్తున్న నేప‌థ్యంలో తెలంగాణ ప్ర‌భుత్వం సైతం ఈ నిర్ణ‌యం తీసుకుంది. ఇక ఈ లాక్‌డౌన్ నుంచి ఎలాంటి సేవ‌ల‌కు మిన‌హాయింపు ఇవ్వ‌నున్నారు లాంటి పూర్తి వివరాల‌కు సంబంధించిన మార్గ‌ద‌ర్శ‌కాల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం మ‌రికాసేప‌ట్లో విడుద‌ల  చేయ‌నుంది. ఇక లాక్‌డౌన్ విధిస్తున్న‌ప్ప‌టికీ వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ కొన‌సాగించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను మ‌రింత వేగ‌వంతం చేయాలని ప్ర‌భుత్వం నిశ్చ‌యంతో ఉంది. ఇక వ్యాక్సిన్ కొర‌త‌ను నివారించేందుకు తెలంగాణ కేభినేట్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇందులో భాగంగానే వ్యాక్సిన్ కొనుగోలుకు గ్లోబ‌ల్ టెండ‌ర్లు పిల‌వాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది.

లాక్‌డౌన్ నుంచి ఈ రంగాల‌కు మిన‌హాయింపు..

* రైస్ మిల్లుల నిర్వ‌హ‌ణ‌, సంబంధిత ర‌వాణా, ఫెర్టిలైజ‌ర్‌, సీడ్ షాపులు, విత్త‌న త‌యారీ ఫ్యాక్ట‌రీలు ఇలా అన్ని రకాల వ్య‌వ‌సాయం రంగాల‌కు లాక్‌డౌన్ నుంచి మిన‌హాయింపు ఇచ్చారు.

* ధాన్యం కొనుగోళ్లు య‌థావిధిగా కొన‌సాగుతాయి.

* జాతీయ ర‌హ‌దారుల మీద పెట్రోల్ పంపులు తెరిచే ఉంటాయి.

* ప్రింట్ అండ్ ఎల‌క్ట్రానిక్ మీడియాకు మిన‌హాయిపు.

* ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు రేషన్ షాపులు తెరిచే ఉంటాయి.

* వంట గ్యాస్ స‌ర‌ఫ‌రాకు మిన‌హాయింపు.

* బ్యాంకులు, ఏటీఎంలు యథావిధిగా పనిచేస్తాయి.

* అనుమతులతో జరిపే పెళ్లిళ్లకు గరిష్టంగా 40 మందికి మాత్రమే అనుమతి.

* అంత్యక్రియల సందర్భంలో గరిష్టంగా 20 మందికి మాత్రమే అనుమతి.

* ఫార్మాస్యూటిక‌ల్ కంపనీల‌తోపాటు మెడికల్ డిస్ట్రిబ్యూటర్లు, మెడికల్ షాపులు, అన్నిరకాల వైద్య సేవలు, ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానాలు, వారి వారి ఉద్యోగులు, సిబ్బందికి ప్రత్యేక పాసులిచ్చి, వాహనాలకు లాక్‌డౌన్ నుంచి మిన‌హాయింపు.

* గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ యథావిధిగా కొన‌సాగుతుంది.

* ఉపాధిహామీ పనులు యథావిధిగా కొనసాగుతాయి.

* ప్రభుత్వ కార్యాలయాలు 33శాతం సిబ్బందితో పనిచేస్తాయి.

 


LIVE NEWS & UPDATES

The liveblog has ended.
 • 11 May 2021 03:39 PM (IST)

  స‌డెన్‌గా లాక్‌డౌన్ ప్ర‌క‌టిస్తే ఎలా..? లాక్‌డౌన్‌పై తెలంగాణ హైకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు..

  ఉన్న‌ప‌లంగా లాక్‌డౌన్ విధిస్తూ తెలంగాణ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకున్న నేప‌థ్యంలో తెలంగాణ హైకోర్టు కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఇప్ప‌టికిప్పుడు లాక్‌డౌన్ ప్ర‌క‌టిస్తే ఇత‌ర రాష్ట్రాల ప‌రిస్థితి ఎలా అని కోర్టు ప్ర‌శ్నించింది. త‌క్కువ స‌మ‌యంలో ఇత‌ర రాష్ట్రాల వారు స్వ‌స్థ‌లాల‌కు ఎలా వెళ్తార‌ని కోర్టు ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించింది. గ‌తేడాదిలా వ‌ల‌స కూలీలు ఇబ్బంది ప‌డ‌కూడ‌ద‌ని కోర్టు అభిప్రాయ‌ప‌డింది. సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్ నుంచి ర‌వాణా సౌక‌ర్యం క‌ల్పించాల‌ని కోర్టు కోరింది. ఆరుగంట‌ల్లో వ‌ల‌స కార్మికుల కోసం ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకోవాలని తెలిపింది.

 • 11 May 2021 03:15 PM (IST)

  లాక్‌డౌన్ ప్ర‌క‌ట‌నతో వైన్స్‌షాప్‌ల వ‌ద్ద క్యూ క‌డుతోన్న మ‌ద్యం బాబులు..

  తెలంగాణ‌లో లాక్‌డౌన్ విధిస్తూ ప్ర‌క‌టించి కేవ‌లం గంట కూడా గ‌డ‌వ‌క ముందే మ‌ద్యం బాబులు వైన్స్ షాప్‌ల వ‌ద్ద బారులు తీరుతున్నారు. ఏ మ‌ద్యం షాపు వ‌ద్ద చూసినా జ‌నాలు ఎగ‌బ‌డుతున్నారు. సోష‌ల్ డిస్టెన్స్‌ను కూడా ప‌ట్టించుకోకుండా ఒక్క‌సారిగా దుకాణాల వ‌ద్ద గుమిగూడుతున్నారు. ఇక ఉద‌యం 6 నుంచి 10 గంట‌ల వ‌ర‌కు స‌డ‌లింపు ఇస్తోన్న నేప‌థ్యంలో వైన్స్ షాపుల‌కు అనుమతి ఉంటుందో లేదో మ‌రి కాసేప‌ట్లో తెలియ‌నుంది.

 • 11 May 2021 03:02 PM (IST)

  ఫుడ్ డెలివ‌రీ సేవ‌లకు వెసులుబాటు..?

  క‌రోనా ఉధృత‌రూపం దాల్చుతున్న వేళ తెలంగాణ ప్ర‌భుత్వం రాష్ట్రంలో రేప‌టి నుంచి లాక్‌డౌన్ అమ‌లు చేస్తున్న‌ట్లు నిర్ణ‌యం తీసుకున్న నేప‌థ్యంలో.. జొమాటో, స్విగ్గీ వంటి ఫుడ్ డెలివ‌రీ సంస్థ‌ల‌కు వెసులుబాటు క‌ల్పించే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. దీనిపై రాష్ట్ర కేభినేట్ చ‌ర్చిస్తున్న‌ట్లు స‌మాచారం. మ‌రికాసేప‌ట్లో దీనిపై ఓ క్లారిటీ వ‌చ్చే అవ‌కాశం ఉంది.

 • 11 May 2021 02:50 PM (IST)

  వ్యాక్సిన్ కోర‌త‌ను తీర్చేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం..

  వ్యాక్సిన్ కొర‌త‌ను నివారించేందుకు తెలంగాణ కేభినేట్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇందులో భాగంగానే వ్యాక్సిన్ కొలుగోలుకు గ్లోబ‌ల్ టెండ‌ర్లు పిల‌వాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఇక అంతేకాకుండా ఈ లాక్‌డౌన్ స‌మ‌యంలో వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను మ‌రింత వేగ‌వంతం చేయాల‌ని ప్ర‌భుత్వం భావిస్తోంది.

 • 11 May 2021 02:42 PM (IST)

  రేప‌టి నుంచి తెలంగాణ‌లో లాక్‌డౌన్‌.. మ‌రికాసేప‌ట్లో మార్గ‌ద‌ర్శ‌కాలు విడుద‌ల‌..

  అంద‌రూ ఊహిస్తున్న‌ట్లుగానే తెలంగాణ ప్ర‌భుత్వం రాష్ట్రంలో లాక్‌డౌన్ విధిస్తూ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. రేపు ఉద‌యం 10 గంట‌ల నుంచి రాష్టంలో లాక్‌డౌన్ అమ‌ల్లోకి రానుంది. ఉద‌యం 6 గంట‌ల నుంచి 10 గంట‌ల వ‌ర‌కు అన్ని కార్య‌క‌లాపాల‌కు అనుమ‌తినిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. ప్ర‌స్తుతం రాష్ట్ర కేబినేట్ మీటింగ్ కొన‌సాగుతోంది. కాసేప‌ట్లో లాక్‌డౌన్‌కు సంబంధించిన పూర్తి మార్గ‌ద‌ర్శ‌కాల‌ను విడుద‌ల చేయ‌నున్నారు.

 • 11 May 2021 02:29 PM (IST)

  వ‌ల‌స కూళీల‌పై చ‌ర్చ‌.. ప్ర‌త్యేక రైళ్లు ఏర్పాటు..?

  లాక్‌డౌన్ ప్ర‌ధాన అంశంగా తెలంగాణ కేబినేట్ భేటీ కాసేప‌టి క్రిత‌మే ప్రారంభ‌మైంది. ఈ నేప‌థ్యంలో లాక్‌డౌన్ విదించే అంశంపై చ‌ర్చిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే లాక్‌డౌన్ విధిస్తే వ‌ల‌స కూళీలు త‌మ సొంత ప్రాంతాల‌కు వెళ్లే అంశంపై కూడా భేటీలో చ‌ర్చ‌కు వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. గ‌తేడాది లాక్‌డౌన్ అప్పుడు కూళీలు ఇబ్బంది ప‌డ్డారు. ఈసారి ఆ స‌మ‌స్య‌ను అధిగ‌మించేందుకు ప్ర‌య‌త్నాలు చేసే ఆలోచ‌న టీఎస్ ప్ర‌భుత్వం ఉంది. ఇందు కోసం ప్ర‌త్యేక రైళ్లు ఏర్పాటు చేయాల‌నే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు స‌మాచారం.

 • 11 May 2021 01:55 PM (IST)

  రంజాన్ తరువాత లాక్ డౌన్ పెడతారా..?

  రంజాన్ తరువాత లాక్ డౌన్ పెడతారా..? ఈ లోపే వైరస్ విజృంభిస్తోంది కదా అంటూ ప్రభుత్వంపై హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. మేం ఆదేశాలు ఇచ్చిన రోజు హుటాహుటిన ప్రెస్ మీట్ లు పెట్టి పరిష్టితి అంతా బాగుంది లాక్‌డౌన్ లేదని… ఎలా చెబుతారని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.

 • 11 May 2021 01:54 PM (IST)

  అంబులెన్స్ ధరల మాటేంటి.?

  రాష్ట్రంలో అంబులెన్స్ ధరలను నియంత్రించాలని చెప్పాం ఎంత వరకు చేశారని ధర్మాసనం ప్రభుత్వాన్ని నిలదీసింది. రాష్ట్రంలో జరుగుతున్న వాటికి పూర్తి బాధ్యత ప్రభుత్వమే వహించాలంది. కుంభ మేళా నుంచి తిరిగి వచ్చిన వారిని గుర్తించి టెస్ట్ లు చేయాలని చెప్పాం.. చేశారా..? అని హైకోర్టు ప్రశ్నించింది. పాతబస్తీ వంటి ప్రాంతాల్లో మతపరమైన కార్యక్రమాలను ఎందుకు నియంత్రించడం లేదని హైకోర్టు నిలదీసింది. హైదరాబాద్, రంగారెడ్డిలలో కేసులు తగ్గాయని ఎలా చెపుతున్నారని ప్రశ్నించింది. టెస్టులు తగ్గించి కేసులు తగ్గాయని ఎలా చెపుతారంటూ మండిపడింది.

 • 11 May 2021 01:54 PM (IST)

  కరోనా వ్యాప్తి నియంత్రణలో తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు అసంతృప్తి..

  కరోనా వ్యాప్తి నియంత్రణలో తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇంటర్ స్టేట్ బార్డర్స్ నుంచి వస్తున్న అంబులెన్స్‌లను ఎందుకు అవుతున్నారంటూ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇతర రాష్టాల నుంచి ఆంబులెన్స్‌లో వస్తున్న వారికి టెస్టులు చేయమని మాత్రమే చెప్పామని.. వారిని ఆపమని మీకు ఎవరు చెప్పారంటూ ధర్మాసనం తీవ్రంగా మండిపడింది. ఈ సమయంలో అంబులెన్స్ లు ఆపడం మానవత్వమా..? అంటూ ప్రశ్నించింది.

 • 11 May 2021 01:52 PM (IST)

  మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్ సమావేశం...

  సీఎం కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి దృష్ట్యా లాక్‌డౌన్‌పై సమావేశంలో చర్చించనున్నారు. కొన్ని రాష్ట్రాల్లో లాక్​డౌన్​ విధించినా.. కరోనా వ్యాప్తి తగ్గడం లేదని, సరైన ఫలితాలు లేవని నివేదికలు అందుతున్నాయని స‌ర్కార్ చెబుతోంది. ఈ నేపథ్యంలో లాక్​డౌన్​ విధింపుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే కొన్ని వర్గాలు లాక్​డౌన్​ కావాలని కోరుతున్నాయని గ‌వ‌ర్న‌మెంట్ పేర్కొంది. ఈ పరిస్థితుల్లో లాక్​డౌన్​ విధిస్తే వచ్చే లాభనష్టాలపై కేబినెట్​ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించనున్నారు.

 • 11 May 2021 01:51 PM (IST)

  లాక్​డౌన్​ విధిస్తే ధాన్యం కొనుగోళ్లపై ప్రభావం

  ఒకవేళ లాక్​డౌన్​ విధిస్తే ధాన్యం కొనుగోళ్లపై పడే ప్రభావం పడనుంది. ఈ నేపధ్యంలో పలు అంశాలపై కూలంక‌షంగా చర్చించి లాక్‌డౌన్‌పై కేబినెట్​ కీలక నిర్ణయం తీసుకోనుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఊరిలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి ధాన్యం కొనుగోలు చేస్తున్నది. ఇప్పుడు ఉన్న పళాన లాక్‌డౌన్‌ విధిస్తే అందరికంటే ఎక్కువ ప్రభావితమయ్యేది రైతులు, ధాన్యం కొనుగోళ్లలో భాగస్వాములైన కష్టజీవులే. ఐకేపీ కేంద్రాల బాధ్యులు, హమాలీలు, తూకం వేసేందుకు కాంటా పెట్టేవాళ్లు, మిల్లులకు తరలించే కూలీలు.. లక్షల మంది ఈ ప్రక్రియతో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా భాగస్వాములై ఉన్నారు. వీరి ఉపాధిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు కొవిడ్‌ నిబంధనలను అత్యంత కఠినంగా అమలుచేయడం అనేది లక్షల మంది బతుకులకు భరోసానిస్తుందని నిపుణులు అంటున్నారు. లాక్‌డౌన్‌తో ధాన్యం కొనుగోలు వ్యవస్థ స్తంభించిపోయే ప్రమాదమున్నదని అంటున్నారు.

 • 11 May 2021 01:50 PM (IST)

  లాక్‌డౌన్‌ వల్ల ఉపయోగమా? అనర్ధమా?

  లాక్‌డౌన్‌ వల్ల ఉపయోగమా? అనర్ధమా? అనే విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఆర్థిక నిపుణులు మాత్రం లాక్‌డౌన్‌తో సాధించే ఫలితాల కన్నా, ప్రజలు స్వచ్ఛందంగా స్వీయ క్రమశిక్షణతో కొవిడ్‌ నిబంధనలను నూటికి నూరుపాళ్లు పాటిస్తే లభించే లాభాలే ఎక్కువ ఉంటాయని చెప్తున్నారు. కరోనా తొలిదశలో లాక్‌డౌన్‌ విధించినప్పుడు తలెత్తిన ఘోర పరిణామాలకు యావత్‌ దేశం సాక్షిగా ఉన్నది. వందల కిలోమీటర్లు కాలినడకన బయల్దేరిన వలస కార్మికుల దుస్థితి నేటికీ కండ్లముందే కనిపిస్తున్నది.

  తెలంగాణ ప్రభుత్వం వలస కార్మికులకు ఆర్థిక సహాయంతోపాటు, బియ్యం కూడా సరఫరా చేయడంతో కొంత భరోసా ఏర్పడింది. తెలంగాణలో 25 నుంచి 30 లక్షల మంది ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులు వచ్చి పనిచేస్తున్నారు. వీరంతా వెళ్లిపోతే తిరిగి రావడం కష్టం...దీనిపై కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది.

 • 11 May 2021 01:49 PM (IST)

  లాక్‌డౌన్‌పై ప్రభుత్వ వర్గాల్లోనూ భిన్నాభిప్రాయాలు...

  కరోనా కేసులు పెరగుతున్న తెలంగాణలో లాక్‌డౌన్‌ విధించే అవకాశం లేదని ఇప్పటికే అనేకమార్లు ప్రభుత్వ స్పష్టం చేసింది. లాక్‌డౌన్‌పై ప్రభుత్వ వర్గాల్లోనూ భిన్నాప్రాయాలు ఉన్న నేపథ్యంలో మంత్రివర్గ సమావేశం జరుగుతుంది. రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించబోమని ఇటీవలే సీఎం కేసీఆర్‌ కూడా ప్రకటించారు. ఒకవేళ ప్రభుత్వం కఠిన నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోందా లేదా ప్రస్తుతం కొనసాగుతున్న కర్ఫ్యూని లాక్‌డౌన్‌గా మార్చే అవకాశం ఉందని తెలుస్తుంది. లాక్‌డౌన్‌ తరహా ఆంక్షలతో ఉదయం కూడా కర్ఫ్యూని అమలు చేస్తారా? ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న చర్చ ఇదే. మరికాసేపట్లో మంత్రి వర్గ సమావేశం జరగనుండటంతో ఈ ఊహాగానాలు మరింత ఎక్కువయ్యాయి.

 • 11 May 2021 01:47 PM (IST)

  ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 18 వరకు కర్ఫ్యూ...

  ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మే 5 తేదీ నుంచి కర్ఫ్యూ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ప్రజారోగ్యం దృష్ట్యా ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది. రెండు వారాల పాటు మధ్యాహ్నం 12 తర్వాత కర్ఫ్యూ అమలు అవుతుంది.18 గంటల కర్ఫ్యూ అమలవుతుంది. మ‌ధ్యాహ్నం 12 గంట‌ల నుంచి త‌ర్వాతి రోజు ఉద‌యం 6 గంట‌ల వ‌ర‌కు క‌ర్ఫ్యూ అమ‌ల్లో ఉంటుంది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకే షాపులకు అనుమతి ఉంటుంది. కర్ఫ్యూ ఈనెల 18 వరకు కొనసాగనుంది. కర్ఫ్యూ నుంచి అత్యవసర సేవలకు మినహాయింపు ప్రకటించింది. కర్ఫ్యూకు ప్రజలు సహకరించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. అయితే కర్ఫ్యూ నుంచి కొన్నింటికి మినహాయింపులు ప్రకటించింది.

 • 11 May 2021 01:39 PM (IST)

  జాతీయ, అంతర్జాతీయ సంస్థలు, వైద్య నిపుణుల హెచ్చరికలు పరిగణనలోకి..

  తొలుత రాష్ట్రంలో పూర్తి స్థాయి లాక్‌డౌన్‌ పెడితే ఆర్ధిక వ్యవస్థ దెబ్బ తింటుందని, పేదలు ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని ప్రభుత్వం భావించింది. అయితే కరోనా వేగంగా విస్తరించే అవకాశాలున్నాయని జాతీయ, అంతర్జాతీయ సంస్థలు, వైద్య నిపుణులు చేస్తున్న హెచ్చరికల నేపధ్యంలో ప్రభుత్వం లాక్‌డౌన్‌ వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సర్కార్ తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

 • 11 May 2021 01:35 PM (IST)

  మే 15వ తేదీ వరకు తెలంగాణలో నైట్ కర్ఫ్యూ..

  రాష్ట్రంలో మాత్రం నైట్ కర్ఫ్యూ కొనసాగుతోంది. పగటిపూట అన్ని కార్యకలాపాలు యధావిధిగా కొనసాగుతున్నాయి. ఈ సమయంలో ప్రజలు స్వీయ నియంత్రణ పాటించకపోవడం, మాస్క్‌లు సైతం ధరించకపోవడంతో పరిస్థితి చేయిదాటక ముందే జాగ్రత్త పడాలనే యోచనకు ప్రభుత్వం వచ్చినట్లు సమాచారం. అటు కరోనా బాధితులకు ఆసుపత్రుల్లో పడకలు లభించని పరిస్థితి ఏర్పడటంతో లాక్‌డౌన్ అనివార్యమనే అభిప్రాయానికి ప్రభుత్వం వచ్చినట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

 • 11 May 2021 01:32 PM (IST)

  కర్ఫ్యూ లాక్ డౌన్, కంటెయిన్ మెంట్ జోన్ ల విధింపు పై రాష్ట్రాలకు పూర్తి స్వేచ్ఛ...

  కోవిడ్ మహమ్మారి దేశాన్ని పట్టిపీడిస్తున్న ప్రస్తుత తరుణంలో కర్ఫ్యూ లాక్ డౌన్, కంటెయిన్ మెంట్ జోన్ ల విధింపు పై రాష్ట్రాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది కేంద్రం. ఆయా రాష్ట్రాల్లోని పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవచ్చు అని కేంద్ర ప్రభుత్వం గతంలోనే తెలిపింది.

 • 11 May 2021 01:29 PM (IST)

  ఇప్పటికే పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ అమలు..

  దేశంలో మహారాష్ట్ర, ఢిల్లీ, బీహార్‌, ఉత్తర ప్రదేశ్‌, హరియాణా, ఒడిశా, రాజస్థాన్‌, కర్నాటక, కేరళ, జార్ఖండ్‌, పుదుచ్చేరి, నాగాలాండ్‌ , మిజోరం, జమ్మూకాశ్మీర్‌ రాష్ట్రాల్లో పాక్షికంగా, సంపూర్ణంగా లాక్ డౌన్ విధించారు. మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, పంజాబ్‌, గోవా, ఆస్సాం,జమ్మూకాశ్మీర్‌, ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లో రాత్రిపూట కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. ఇటు పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లోనూ 18 గంటల కర్ఫ్యూ అమలవుతోంది. అయితే తెలంగాణలో మాత్రం మే 15 వరకు నైట్ కర్ఫ్యూ అమలులో ఉంది.

 • 11 May 2021 01:28 PM (IST)

  లాక్ డౌన్ పెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది...

  రాష్ట్రంలో రోజురోజుకూ పెరుగుతోన్న పాజిటివ్ కేసులను కట్టడి చేసేందుకు లాక్ డౌన్ ఒక్కటే పరిష్కారమని ప్రభుత్వం భావిస్తున్నట్లు అధికార వర్గాల నుంచి అందుతున్న సమాచారం. కరోనా వ్యాప్తిని నిలువరించేందుకు పూర్తిస్థాయి లాక్‌డౌన్ విధించే దిశగా తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది. దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది

 • 11 May 2021 01:26 PM (IST)

  మరికాసేపట్లో కేబినేట్ సమావేశం..

  ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మరికాసేపట్లో కేబినేట్ భేటి జరగనుంది. ఈ సమావేశంలో లాక్ డౌన్ లేదా పాక్షిక లాక్ డౌన్ పై నిర్ణయం తీసుకోనున్నారు. అంతేకాకుండా ఒకవేళ లాక్‌డౌన్‌ పెడితే తలెత్తే పరిణామాలు, ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియపై ప్రభావం, తదితర అంశాలపై కూడా  సమగ్రంగా చర్చించి అధికారికంగా ప్రకటించనున్నారు.

 • 11 May 2021 01:25 PM (IST)

  తెలంగాణలో కరోనా కేసులు పెరుగుదల.. లాక్ డౌన్ ఉంటుందా.?

  తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూపోతోంది. నైట్ కర్ఫ్యూ అమలులో ఉండటం.. పగటి పూట అన్నీ కార్యకలాపాలు సాగుతుండటంతో ప్రజలు ఎవ్వరూ కూడా కరోనా నిబంధనలను పాటించకపోవడంతో తెలంగాణ సర్కార్ లాక్ డౌన్ పెట్టాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

Published On - May 11,2021 3:39 PM

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu