Huzurabad By Election: ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇకపై మరో లెక్క.. పీక్ స్టేజ్‌కు చేరిన హుజురాబాద్ ప్రీమియర్ లీగ్
తెలంగాణ పాలిటిక్స్‌లో హైఓల్టేజ్ హీట్ మొదలైంది. మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో ఖాళీ అయిన హుజూరాబాద్ స్థానంలో బైపోల్‌కు ముహూర్తం ఖరారైంది.
Huzurabad by Election Schedule: తెలంగాణ పాలిటిక్స్‌లో హైఓల్టేజ్ హీట్ మొదలైంది. మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో ఖాళీ అయిన హుజూరాబాద్ స్థానంలో బైపోల్‌కు ముహూర్తం ఖరారైంది. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఉప ఎన్నిక అక్టోబర్ 30న జరగబోతోంది. నవంబర్ 2న కౌంటింగ్ ఉంటుంది. అక్టోబర్ 1న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు షెడ్యూల్‌లో పేర్కొంది కేంద్ర ఎన్నికల సంఘం. అక్టోబర్ 8 వరకూ నామినేషన్లు దాఖలు చేసేందుకు అవకాశం కల్పించారు. అక్టోబర్ 13 వరకూ ఉపసంహరణకు గడువు విధించారు.
జూన్12న ఈటల రాజేందర్ రాజీనామా చేయడంతో హుజూరాబాద్‌లో ఉప ఎన్నిక జరుగుతోంది. అప్పటి నుంచి ఫుల్ హీట్‌మీదున్న ఈ నియోజకవర్గం షెడ్యూల్ రిలీజ్‌తో మరింత వేడెక్కబోతోంది.ఈ బైపోల్‌ను TRS ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే మంత్రులంతా అక్కడ మోహరించారు. అధికార పార్టీ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్‌ను ప్రకటించింది. ఆయన్ను గెలిపించే బాధ్యత మంత్రి హరీష్‌రావు భూజస్కందాలపైన పెట్టింది అధిష్టానం. ఆయన అక్కడే ఉండి ఇంటింటికీ తిరుగుతున్నారు. మీటింగ్‌ల మీద మీటింగ్‌లు పెట్టి ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
బీజేపీ విషయానికొస్తే ఆ పార్టీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ బరిలోకి దిగుతున్నారు. అనుహ్య పరిణామాల నడుమ మంత్రి పదవితో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఈటల రాజేందర్ భారతీయ జనతాపార్టీలో చేరిపోయారు. దీంతో మూడు నెలలుగా నియోజకవర్గంలోనే పర్యటిస్తున్నారు ఈటల రాజేందర్. కొన్ని మండలలాల్లో పాదయాత్ర కూడా పూర్తి చేశారు. కాలికి సర్జరీ కారణంగా బ్రేక్ ఇచ్చారు. దాన్ని భర్తీ చేస్తూ రెండురోజుల్లో పాదయాత్రగా హుజూరాబాద్‌లో అడుగుపెట్టనున్నారు బండి సంజయ్. అక్టోబర్ 2న నియోజకవర్గంలో భారీ బహిరంగ సభ కూడా నిర్వహించబోతున్నారు.
బైపోల్ బరిలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది కాంగ్రెస్ పరిస్థితి. రాష్ట్రంలో 2023లో మాదే అధికారం అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ఇంతవరకూ హుజూరాబాద్ అభ్యర్థి ఎవరో తేల్చుకోలేక పోతోంది. టికెట్ ఇవ్వాలనుకున్న కౌశిక్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లోకి జంప్ అవ్వడంతో ఒకరకమైన స్తబ్దత కనిపిస్తోంది. మొదట కొండా సురేఖ వైపు మొగ్గుచూపినా..స్థానిక నాయకత్వం వ్యతిరేకతతో మళ్లీ వెనక్కి తగ్గారు.షెడ్యూల్ విడదల కావడంతో ఇప్పుడు ఎవరో ఒకర్ని సెలక్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
ఇదిలావుంటే, హుజూరాబాద్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు -2లక్షల 26వేల 553 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 1,12,808. మహిళా ఓటర్లు 1,13,744. ఇప్పటికే సామాజికవర్గాల వారీగా లెక్కలు తీసిన పార్టీలు ఓటర్లను ఆకట్టుకునే పనిలో బిజీగా ఉన్నాయి..