Telangana: కృష్ణమ్మ ఒడ్డున వరుణుడికి ఆహ్వానం.. వర్షాల కోసం తెలంగాణ సర్కార్ మహా వరుణ యాగం
కృష్ణమ్మ ఒడ్డున వేద మంత్రాల ఘోష.. వర్షాల కోసం మహా సంకల్పంతో నాగార్జునసాగర్‌లో జరుగుతున్న వరుణ యాగంతో కృష్ణమ్మ తీరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. వర్షాల కోసం వరుణుడిని ఆహ్వానిస్తూ సాగర్ తీరంలో మొదలైన ఈ మహా యాగం..సాగర్ తీరాన్ని భక్తిభావంతో నింపుతున్నాయి.

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా కృష్ణానది తీరాన నాగార్జునసాగర్ లో మహా వరుణ యాగాన్ని నిర్వహిస్తోంది. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, కృష్ణా, గోదావరి నదులు జలకళతో పరవళ్లు తొక్కాలని, రైతాంగం సుభిక్షంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించి ఈ యాగం నిర్వహిస్తోంది. వేకువ జామున నాలుగు గంటలకే మొదలైన మహా వరుణ యాగంలో రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు ఆది పూజ నిర్వహించి యాగాన్ని ప్రారంభించారు.
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ అర్చకులు, వేదపండితుల ఆధ్వర్యంలో యాగ క్రతువు కొనసాగుతోంది. వేద పండితులు, 11 హోమ గుండాల్లో దేవతా ఆవాహనం చేసి వరుణ యాగాన్ని ప్రారంభించారు. తొలుత వేద పండితులు, రిత్వికులు మంత్రోచ్ఛారణల మధ్య విశ్వక్సేనుడికి ప్రత్యేక పూజలు చేశారు. యాగం నిర్విఘ్నంగా సాగాలని విగ్నేశ్వరుడిని పూజించారు. యాగస్థలం, యజమానులు, పాల్గొనే ఋత్వికుల శుద్ధి చేసి పుణ్యాహ వాచనంతో యాగశాల ప్రవేశం చేశారు. పవిత్ర కృష్ణానది జలంతో కలశాలను ఏర్పాటు చేసి, వాటిలో దేవతా ఆవాహనం చేసి కలశ స్థాపన చేశారు.
108 మంది రుత్వికులు.. 11 హోమగుండాలు.. యాగశాల అంతా ఆధ్యాత్మిక శోభతో నిర్విరామంగా కొనసాగుతోంది. వరుణుడి కరుణ కోసం రుత్వికులు వేద పండితులు చతుర్వేద వేద పారాయణాలు, లక్ష జపాలు పట్టిస్తున్నారు. వేద పండితులు రుత్వికుల మంత్రోచ్ఛారణలతో విజయ విహార్ ప్రాంగణం మారుమోగుతోంది.
యాగానికి సంబంధించిన వీడియో ఇక్కడ చూడండి..
ఇక సాయంత్రం పూర్ణాహుతితో సాగర్‌లో మహా వరుణ యాగం కీలక ఘట్టానికి చేరుకోనుంది. పూర్ణాహుతిలో సీఎం రేవంత్ రెడ్డి దంపతులు పాల్గొంటారు. కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతాల్లో సమృద్ధిగా వర్షాలు కురవాలని సంకల్పిస్తూ వరుణ యాగాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
