తెలంగాణలో గణేష్ మండపాలు ఏర్పాటు చేసుకునేవారికి శుభవార్త.. ఉచితంగా విద్యుత్.. ఎలా పొందాలంటే..?
తెలంగాణలో గణేష్ మండపాలు ఏర్పాటు చేసేవారికి శుభవార్త. మండపాలకు ఉచితంగా కరెంట్ సౌకర్యం పొందవచ్చు. ఈ మేరకు ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ సరఫరా అందించాలని నిర్ణయం తీసుకుంది. తాజాగా జరిగిన సమావేశంలో సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేశారు. ఏర్పాట్లపై తాజాగా సమీక్ష సమావేశం నిర్వహించారు.

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా గణేష్ మండపాలకు ఉచితంగా ఉచితంగా విద్యుత్ అందించాలని నిర్ణయం తీసుకుంది. మండపాలు ఏర్పాటు చేసే నిర్వహకులు సంబంధిత అధికారులకు దరఖాస్తులు సమర్పించాలని, అనంతరం ఉచిత విద్యుత్ సౌకర్యం పొందవచ్చని సీఎం రేవంత్ తెలిపారు. అసెంబ్లీ ఆవరణలోని మండలి సమావేశ మందిరంలో గణేష్ ఉత్సవాలపై సీఎం రేవంత్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జీహెచ్‌ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ, హైడ్రా కమిషనర్లు, పోలీస్ ఉన్నతాధికారులు, గణేష్ ఉత్సవ కమిటీ ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్బంగా అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రశాంతంగా గణేష్ ఉత్సవాలు జరిగేలా చూడాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. గణేష్ ఉత్సవాల పర్యవేక్షణ కోసం ప్రత్యేక అధికారులను నియమించాలని సూచించారు. మున్సిపల్, పోలీస్ శాఖ సమన్వయంగా పనిచేయాలన్నారు.
ఉత్సవాల పర్యవేక్షణ కోసం కమాండ్ కంట్రోల్ సెంటల్‌లో ప్రత్యేకంగా ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. శాంతిభద్రతల సమస్య రాకుండా ఉత్సవాలు జరిగేలా చూడాలని, ప్రశాంతంగా ఉన్నప్పుడు పెట్టబడులు వస్తాయని తెలిపారు. మండపాలు ఏర్పాటు చేసే నిర్వాహకులు, భక్తులు కూడా సహకరించాలని కోరారు. గణేష్ ఉత్సవాలకు అతిధులను ఆహ్వానించిన సమయంలో వారి వివరాలను స్థానిక కమిషనరేట్‌కు నిర్వాహకులు అందించాలని, దానికనుగుణంగా పోలీస్ శాఖ బందోబస్తు ఏర్పాటు చేస్తుందని అన్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రశాంతంగా వేడుకలు జరగడానికి నిర్వాహకులు ఇచ్చే సమాచారం పోలీసులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. నిర్వాహకుల సమస్యలు తెలుసుకునేందుకే తాను స్వయంగా సమీక్ష నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమలు ప్రశాంతంగా జరిగేలా ప్రతీఒక్కరూ సహకరించాలని సీఎం రేవంత్ కోరారు.
ఏదైనా సమస్య ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని, పరిష్కరించేందుకు తాము సిద్దంగా ఉన్నామని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. తాము అధికారంలోకి వచ్చాక గణేష్ ఉత్సవాల తమ సాంప్రదాయాలను పునరుద్దరించామన్నారు. మండపాలు ఏర్పాటు చేసేవారు ముందుగా అధికారులకు సమాచారం ఇస్తే.. ట్రాఫిక్, బందోబస్తు ఏర్పాట్లు ముందుగానే ఏర్పాటు చేస్తారన్నారు. నిమజ్జనం కోసం చెరువుల వద్ద క్రేన్లు ఏర్పాటు చేయాలని అధికారులకు సీఎం రేవంత్ ఆదేశించారు. అటు ఏపీ ప్రభుత్వం కూడా గణేష్ మండపాలకు ఉచితంగా విద్యుత్ సౌకర్యం అందిస్తోంది. ఈ మేరకు సింగిల్ విండో పర్మిషన్ విధానాన్ని తీసుకొచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా గణేష్ ఉత్సవాలు జరగనున్నాయి. ఇప్పటికే పండుగ శోభ సంతరించుకుంది.
