Bank Account: మీ బ్యాంక్ అకౌంట్‌లో అలాంటి తప్పులు చేస్తున్నారా..? 60 రోజుల పాటు ఫ్రీజ్.. ఆర్బీఐ కొత్త రూల్స్..
చాలామంది కమిషన్ల కోసం తమ బ్యాంక్ అకౌంట్‌ను వేరేవారికి ఇస్తూ ఉంటారు. వీటిని సైబర్ నేరగాళ్లు తమ అక్రమ లావాదేవీలకు ఉపయోగించుకుంటూ ఉంటారు. వీటినే మ్యూల్ ఖాతాలుగా పిలుస్తారు. వీటికి సంబంధించి ఆర్బీఐ తాజాాగా కొత్త రూల్స్ తీసుకొచ్చింది. అవేంటి అంటే..?

మీ బ్యాంక్ అకౌంట్‌ను మనీ మ్యూల్ లావాదేవీలకు ఉపయోగిస్తున్నారా..? మీ అకౌంట్‌ను అనుమానాస్పద లావాదేవీలు ఉపయోగించుకునేందుకు ఎవరికైనా ఇస్తున్నారా..? అయితే ఇక నుంచి జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త రూల్స్ తీసుకొచ్చింది. అక్రమ లావాదేవీలు, సైబర్ నేరాల కోసం ఉపయోగించే అనుమానాస్పద అకౌంట్లకు సంబంధించి ఇక నుంచి 60 రోజుల పాటు నగదు ఫ్రీజ్ చేస్తారు. ఈ మేరకు తాత్కాలిక డెబిట్ హోల్డ్ పరిమితిపై ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. దీనిపై అక్టోబర్ 2వ తేదీ వరకు ప్రజల నుంచి అభిప్రాయాలు స్వీకరించనుంది. పరిశీలన అనంతరం 2027,ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త రూల్స్ అమల్లోకి వస్తాయి. అనంతరం మళ్లీ లావాదేవీలు కొనసాగిస్తే పూర్తిగా అకౌంట్ హోల్డ్ విధిస్తారు.
మ్యూల్ అకౌంట్లు అంటే..?
సైబర్ నేరగాళ్లు తమ మోసాల కోసం ఇతరుల అకౌంట్లను ఉపయోగించుకుంటారు. ఇతర పేర్లతో ఖాతాలు తెరవడం లేదా ఇతరులకు డబ్బులు ఆశ చూపి వారి అకౌంట్లను తీసుకోవడం లాంటివి చేస్తారు. ఈ ఖాతాలను తమ మోసాల కోసం ఉపయోగించుకుంటారు. ఇలాంటి వాటినే మ్యూల్ ఖాతాలుగా పిలుస్తారు. ఇటీవల కాలంలో ఇలాంటి ఖాతాలు ఎక్కువగా పెరుగుతుండటంతో.. ఆర్బీఐ అడ్డుకట్ట వేసేందుకు చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా కఠిన రూల్స్ అమల్లోకి తీసుకొస్తుంది. ఏఐ, మెషిన్ లెర్నింగ్, ఇతర టెక్నాలజీల ఆధారంగా మ్యూల్ ఖాతాలుగా బ్యాంకులు గుర్తిస్తాయి. అనామానాస్పద లావాదేవీలు, ఒక్కసారిగా డబ్బులు జమ కావడం, విత్ డ్రా కావడం, సాధారణ ట్రాన్సాక్షన్ కంటే భిన్నంగా అనిపించడం, ఇప్పటికే సైబర్ నేరాల లిస్టులో ఉన్న అకౌంట్లతో లింక్ కావడం వంటి అంశాల ఆధారంగా మ్యూల్ ఖాతాలను గుర్తిస్తారు. రూ.వెయ్యి లేదా అంతకంటే ఎక్కువ మొత్తంలో ఉండే అనుమానాస్పద ఖాతాలను గుర్తించి తాత్కాలికంగా డెబిట్ హోల్డ్ విధిస్తారు. దీని వల్ల ఖాతా పూర్తిగా నిలిపివేయాల్సిన అవసరం ఉండదు.
కొంతమంది అమాయపు ప్రజలు డబ్బులు ఆశ చూపడంతో తమ అకౌంట్లను ఇచ్చేస్తున్నారు. దీంతో ఇలాంటివారి డిపాజిట్లు నెలల పాటు ఆగిపోకూడదనే ఉద్దేశంతో తాత్కాలిక హోల్డ్‌ను 60 రోజులకు మాత్రమే పరిమితం చేశారు. ఖాతాలను ఫ్రీజ్ చేయడం వల్ల పౌరులు ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. 60 రోజుల పాటు హెల్డ్ అమల్లో ఉంది. ఆలోపు దర్యాప్తు సంస్థల నుంచి చట్టపరంగా ఎలాంటి నోటీసులు రాకపోతే.. హోల్డ్ తీసివేయాల్సి ఉంటుంది. హోల్డ్ ఎత్తివేతకు సంబంధించి కస్టమర్లకు బ్యాంకులు ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం పంపాలి. అలాగే ఈమెయిల్ ద్వారా నోటిఫికేషన్ పంపాలి. ఇప్పటివరకు బ్యాంకులు నెలల తరబడి హోల్డ్‌లో ఉంచడం వల్ల సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. ఇక కమీషన్లకు ఆశపడి అకౌంట్‌ను ఇతరులకు ఇచ్చేవారిపై కూడా చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఆర్బీఐ భావిస్తోంది.
