RRB రైల్వేలో 4,029 ఉద్యోగాలు.. మరికొన్ని గంటల్లో ముగుస్తున్న దరఖాస్తు గడువు! డైరెక్ట్ లింక్ ఇదే
రైల్వేలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు కీలక సమాచారం. జూనియర్ ఇంజినీర్ (JE), డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ (DMS) పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) విడుదల చేసిన CEN No. 04/2026 నోటిఫికేషన్‌కు దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది. అర్హత ఉన్న అభ్యర్థులు మరికొన్ని గంటల్లోనే..

హైదరాబాద్, సెప్టెంబర్ 13: భారతీయ రైల్వేలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు కీలక సమాచారం. జూనియర్ ఇంజినీర్ (JE), డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ (DMS) పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) విడుదల చేసిన CEN No. 04/2026 నోటిఫికేషన్‌కు దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది. అర్హత ఉన్న అభ్యర్థులు మరికొన్ని గంటల్లోనే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా వివిధ RRBలు, రైల్వే జోన్లు, ప్రొడక్షన్ యూనిట్ల పరిధిలో మొత్తం 4,029 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో సికింద్రాబాద్ రైల్వే జోన్‌కు 111 ఖాళీలు ఉన్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. జూనియర్ ఇంజినీర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ పోస్టుల్లో భాగంగా ఎలక్ట్రికల్, ఇంజినీరింగ్, మెకానికల్, ఎస్‌అండ్‌టీ, స్టోర్స్ తదితర విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. పోస్టును బట్టి సంబంధిత ఇంజినీరింగ్ విభాగంలో డిప్లొమా, ఇంజినీరింగ్ డిగ్రీ లేదా బీఎస్సీ ఉత్తీర్ణత ఉండాలి.
జీతం ఎంతంటే?
ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.35,400 ప్రాథమిక వేతనం లభిస్తుంది. దీనికి నిబంధనల ప్రకారం ఇతర అలవెన్సులు అదనంగా ఉంటాయి. అభ్యర్థుల ఎంపికను పలు దశల్లో నిర్వహిస్తారు. ముందుగా స్టేజ్-1, స్టేజ్-2 కంప్యూటర్ ఆధారిత పరీక్షలు (CBT) ఉంటాయి. అనంతరం అర్హత సాధించిన అభ్యర్థులకు ధ్రువపత్రాల పరిశీలన, రైల్వే మెడికల్ టెస్ట్ నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
ఈ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ నేటితో ముగియనుంది. దరఖాస్తు చేయని అర్హులైన అభ్యర్థులు గడువు ముగిసేలోపు అధికారిక RRB వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. చివరి సమయంలో సాంకేతిక సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున అభ్యర్థులు వీలైనంత త్వరగా అప్లికేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవడం మంచిది.




