స్కూల్ విద్యార్థులకు భలే ఛాన్స్.. జాతీయ స్థాయిలో పెయింటింగ్ పోటీలు 2026! గెలిస్తే ల్యాప్‌టాప్, మెడల్స్
జాతీయ స్థాయి పెయింటింగ్ పోటీ-2026కు పాఠశాల విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. విద్యుత్ పొదుపు, ఇంధన సామర్థ్యం అనే అంశాలపై నిర్వహించే ఈ పోటీలో రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో విజేతలకు భారీ నగదు బహుమతులతో పాటు ల్యాప్‌టాప్‌లు, మెడల్స్ అందజేస్తారు. జాతీయ స్థాయిలో విజేతలు తల్లిదండ్రులతో కలిసి మధ్యప్రదేశ్ ప్రత్యేక పర్యటనకు కూడా అవకాశం పొందుతారు..

పాఠశాల విద్యార్థుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించడంతో పాటు ఇంధన పొదుపు, ఇంధన సామర్థ్యంపై అవగాహన కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయి పెయింటింగ్ పోటీ 2026ను నిర్వహిస్తోంది. విద్యుత్ మంత్రిత్వ శాఖ, బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (BEE) సంయుక్తంగా ఈ పోటీలను నిర్వహిస్తున్నాయి. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు భారీ నగదు బహుమతులతో పాటు ల్యాప్‌టాప్‌లు, పతకాలు, ప్రత్యేక విహారయాత్రను అందించనున్నారు. ఈ ఏడాది పెయింటింగ్ పోటీల ప్రధాన థీమ్ ‘ఇంధన పొదుపు, ఇంధన సామర్థ్యం (Energy Conservation & Energy Efficiency)’. ఇందులో భాగంగా విద్యార్థులు ‘పాఠశాల, ఇంటి వద్ద విద్యుత్ ఆదా, ఇంధన భద్రతకు ఇంధన సంరక్షణ కీలకం’ అనే అంశాలపై తమ సృజనాత్మకతను ప్రదర్శించాలి. పోటీలు మొత్తం మూడు స్థాయిల్లో నిర్వహిస్తారు.
పాఠశాల స్థాయి
పాఠశాల స్థాయిలో విద్యార్థులను రెండు గ్రూపులుగా విభజించారు.
గ్రూప్-A: 5, 6, 7వ తరగతులు గ్రూప్-B: 8, 9, 10వ తరగతులు
పాఠశాలలు విద్యార్థులతో రెండు గంటల పెయింటింగ్ సెషన్ నిర్వహించాలి. ప్రతి గ్రూపు నుంచి ఉత్తమంగా నిలిచిన రెండు పెయింటింగ్‌లను ఎంపిక చేసి, విద్యార్థుల పూర్తి వివరాలతో సంబంధిత రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంత నోడల్ అధికారికి 2026 అక్టోబర్ 15లోపు పంపించాలి.
రాష్ట్ర/కేంద్రపాలిత ప్రాంత స్థాయి
పాఠశాల స్థాయి నుంచి ఎంపికైన విద్యార్థులకు రాష్ట్ర/కేంద్రపాలిత ప్రాంత స్థాయిలో పోటీ నిర్వహిస్తారు.
తేదీ: 2026 నవంబర్ 14 నుంచి 21 మధ్య పోటీ సమయం: 2 గంటలు పాల్గొనేవారు: ప్రతి గ్రూపు నుంచి ఎంపికైన 50 మంది విద్యార్థులు
రెండు గ్రూపులకు వేర్వేరుగా బహుమతులు అందిస్తారు.
- మొదటి బహుమతి: రూ.50,000
- రెండో బహుమతి: రూ.30,000
- మూడో బహుమతి: రూ.20,000
- 10 అప్రిషియేషన్ బహుమతులు: ఒక్కొక్కరికి రూ.7,500
జాతీయ స్థాయి పోటీ
రాష్ట్ర స్థాయిలో ప్రతి గ్రూపులో టాప్-3 విజేతలు జాతీయ స్థాయి పోటీకి అర్హత సాధిస్తారు. ఈ పోటీ 2026 డిసెంబర్ 11న దిల్లీలో 2½ గంటల స్పాట్ పెయింటింగ్ పోటీగా నిర్వహించనున్నారు. జాతీయ స్థాయి విజేతలకు డిసెంబర్ 14న జాతీయ ఇంధన సంరక్షణ దినోత్సవం సందర్భంగా బహుమతులు అందజేస్తారు. రెండు గ్రూపులకు ప్రత్యేకంగా బహుమతులు ఇవ్వనున్నారు.
- మొదటి బహుమతి: రూ.1,00,000 + ల్యాప్‌టాప్ + స్వర్ణ పతకం
- రెండో బహుమతి: రూ.50,000 + ల్యాప్‌టాప్ + రజత పతకం
- మూడో బహుమతి: రూ.30,000 + ల్యాప్‌టాప్ + కాంస్య పతకం
- 10 అప్రిషియేషన్ బహుమతులు: ఒక్కొక్కరికి రూ.15,000 + ట్యాబ్లెట్
జాతీయ స్థాయి విజేతలందరికీ మరో ప్రత్యేక అవకాశం కూడా ఉంది. విజేతలు తమ తల్లిదండ్రులతో కలిసి 2027 జనవరిలో మధ్యప్రదేశ్‌లో గైడెడ్ టూర్‌కు వెళ్లే అవకాశం కల్పిస్తారు. ఈ విహారయాత్రకు సంబంధించిన ఖర్చులను BEE భరిస్తుంది.
ఈ విద్యార్థులు అనర్హులు
2023, 2024 లేదా 2025 సంవత్సరాల్లో రాష్ట్ర లేదా జాతీయ స్థాయిలో అదే గ్రూపులో మొదటి, రెండో లేదా మూడో బహుమతి సాధించిన విద్యార్థులు 2026 పోటీలో పాల్గొనడానికి అర్హులు కాదు. అయితే గతంలో గ్రూప్-Aలో విజేతలైన విద్యార్థులు, ప్రస్తుత తరగతి అర్హతకు అనుగుణంగా ఉంటే ఇప్పుడు గ్రూప్-Bలో పాల్గొనవచ్చు. పోటీలకు సంబంధించి జ్యూరీ తీసుకునే నిర్ణయమే తుది నిర్ణయంగా ఉంటుంది.
ఏపీ, తెలంగాణ నోడల్ అధికారుల వివరాలు
ఆంధ్రప్రదేశ్
శ్రీమంత్ మహాపాత్ర (DGM-HR) సింహాద్రి సూపర్ థర్మల్ పవర్ స్టేషన్, NTPC సింహాద్రి, విశాఖపట్నం–531020 ఫోన్: 040-27683242 / 9437171144
తెలంగాణ
మాదసు లింగయ్య (Manager-HR) NTPC-SRHQ, 7వ అంతస్తు, ఎన్‌టీపీసీ భవన్, కవాడిగూడ మెయిన్ రోడ్, సికింద్రాబాద్–500080 ఫోన్: 040-27683242 / 7382294441
పాఠశాల విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఇంధన సంరక్షణపై తమ ఆలోచనలను చిత్రాల రూపంలో ప్రదర్శించవచ్చు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిస్తే నగదు బహుమతులతో పాటు ల్యాప్‌టాప్, పతకాలు, టూర్ వంటి ప్రోత్సాహకాలను పొందే అవకాశం ఉంటుంది.




