AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సక్సెస్ కావాలంటే కష్టాల నుంచి పారిపోకండి.. తాత చెప్పిన కథలో గొప్ప జీవిత సత్యం!

జీవితంలో కష్టాలు, కన్నీళ్లు, సమస్యలు, ఇబ్బందులు అందరికీ వస్తాయి. అవి మనల్ని ఆపడానికి వచ్చినట్లుగా అనిపించవచ్చు. కానీ వాటిని ధైర్యంగా ఎదుర్కొన్నప్పుడే మనలో బలం, అనుభవం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. కష్టాల నుంచి పారిపోతే మనం బలహీనంగా మిగిలిపోతాం. కష్టాలను ఎదుర్కొంటే అవే మనల్ని బలమైన వ్యక్తులుగా తీర్చిదిద్దుతాయి. అందుకే సమస్యలు వచ్చినప్పుడు భయపడకండి. వాటిని ఎదుర్కొంటూ ముందుకు సాగండి. మనిషి తలచుకుంటే సాధించలేనిది ఏదీ లేదు. ఈ విషయం పిల్లలకు ఈ కింద కథ ద్వారా చెప్పండి..

సక్సెస్ కావాలంటే కష్టాల నుంచి పారిపోకండి.. తాత చెప్పిన కథలో గొప్ప జీవిత సత్యం!
Grandfathers Inspiring Story
Srilakshmi C
|

Updated on: Oct 03, 2026 | 12:13 PM

Share

ఒక గ్రామంలో ఓ వృద్ధుడు ఉండేవాడు. ఆయనకు తన మనవడంటే ఎంతో ప్రేమ. మనవడు మాత్రం తన తల్లిదండ్రులతో కలిసి వేరే ఊరిలో ఉండేవాడు. అప్పుడప్పుడు తాతను చూడటానికి గ్రామానికి వస్తుండేవాడు. ఒకసారి వేసవి సెలవుల్లో మనవడు తాత దగ్గరకు వచ్చాడు. తాతతో కలిసి ఆడుతూ, పాడుతూ గ్రామంలో తిరుగుతున్న సమయంలో అతని మనసులో ఓ ప్రశ్న మెదిలింది. ‘తాతా! నేను పెద్దయ్యాక చాలా గొప్పవాడిని కావాలి. జీవితంలో సక్సెస్‌ఫుల్‌గా ఉండాలి. అందుకు నేను ఏం చేయాలి?’ అని అడిగాడు. తాత చిరునవ్వు నవ్వాడు. కానీ సమాధానం చెప్పలేదు. అతన్ని వెంట తీసుకుని ఓ నర్సరీకి వెళ్లాడు. అక్కడ రెండు చిన్న మొక్కలు కొని ఇంటికి తీసుకొచ్చాడు. ఒక మొక్కను అందమైన తొట్టిలో నాటి ఇంట్లో పెట్టాడు. మరో మొక్కను ఇంటి బయట మట్టిలో నాటాడు. మనవడు ఆశ్చర్యపోయాడు.

‘తాతా! నేను అడిగిన ప్రశ్నకు ఇంకా సమాధానం చెప్పలేదు కదా?’ అని అడిగాడు. తాత మాత్రం అతని ప్రశ్నను పట్టించుకోకుండా ‘ఈ రెండు మొక్కల్లో ఏది బాగా పెరుగుతుందని అనుకుంటున్నావు?’ అని అడిగాడు. మనవడు కాసేపు ఆలోచించి ‘ఇంట్లో ఉన్న మొక్కే బాగా పెరుగుతుంది తాతా! దాన్ని మనం జాగ్రత్తగా చూసుకుంటాం. ఎండ, వాన, చలి నుంచి కాపాడతాం. బయట ఉన్న మొక్కకు అయితే ఎన్నో కష్టాలు. ఎండ, వాన, గాలి, చలి మాత్రమే కాదు.. జంతువులు కూడా దాన్ని నాశనం చేయవచ్చు’ అని చెప్పాడు. తాత ఏమీ మాట్లాడలేదు. కొద్దిరోజుల తర్వాత మనవడు తన తల్లిదండ్రులతో కలిసి తిరిగి వెళ్లిపోయాడు.

నాలుగేళ్ల తర్వాత.. నాలుగేళ్లు గడిచిపోయాయి. ఓ రోజు మనవడు మళ్లీ తాతను చూడటానికి గ్రామానికి వచ్చాడు. తాతను చూసిన వెంటనే అతనికి నాలుగేళ్ల క్రితం అడిగిన ప్రశ్న గుర్తొచ్చింది. ‘తాతా! అప్పట్లో నేను జీవితంలో ఎలా సక్సెస్ అవ్వాలో అడిగాను. కానీ నువ్వు సమాధానం చెప్పలేదు. ఇప్పుడైనా చెబుతావా?’ అని అడిగాడు. తాత నవ్వుతూ ‘తప్పకుండా చెబుతాను. కానీ ముందుగా నాలుగేళ్ల క్రితం మనం నాటిన ఆ రెండు మొక్కలను చూసి వద్దాం’ అన్నాడు. ఇద్దరూ ముందుగా ఇంట్లో పెట్టిన మొక్క దగ్గరకు వెళ్లారు. మొక్క కొంత పెరిగింది. కానీ పెద్దగా, బలంగా మాత్రం ఎదగలేదు. ‘చూశావా?’ అని తాత అడిగాడు. మనవడు తల ఊపాడు. తర్వాత ఇద్దరూ ఇంటి బయట నాటిన మొక్క దగ్గరకు వెళ్లారు. అక్కడ కనిపించిన దృశ్యం చూసి మనవడు ఆశ్చర్యపోయాడు. ఆ చిన్న మొక్క ఇప్పుడు ఓ భారీ వృక్షంగా మారింది. పెద్ద కాండం, విస్తరించిన కొమ్మలు, పచ్చని ఆకులు, పూలు, పండ్లతో కళకళలాడుతోంది. దాని వేర్లు భూమిలోకి లోతుగా చొచ్చుకుపోయి ఉన్నాయి. ‘తాతా! ఇది ఎలా సాధ్యమైంది? నేను అనుకున్నదానికి పూర్తిగా భిన్నంగా జరిగింది. ఇంట్లో ఉన్న మొక్క కంటే బయట ఉన్న మొక్కే ఇంత పెద్దదిగా ఎలా పెరిగింది?’ అని ఆశ్చర్యంగా అడిగాడు. అప్పుడు తాత తన మనవడి వైపు చూస్తూ మెల్లగా మాట్లాడటం ప్రారంభించాడు.

ఇవి కూడా చదవండి

‘నువ్వు నాలుగేళ్ల క్రితం చెప్పింది తప్పు కాదు. ఇంట్లో ఉన్న మొక్కకు ఎలాంటి కష్టం రాలేదు. అందుకే అది ప్రశాంతంగా పెరిగింది. కానీ కష్టాలను ఎదుర్కొనే అవకాశం దానికి రాలేదు. బయట ఉన్న మొక్కకు మాత్రం ఎండ వచ్చింది. వర్షం వచ్చింది. గాలులు వీచాయి. చలి వచ్చింది. జంతువుల నుంచి కూడా ప్రమాదం ఎదురైంది. అందుకే అది తనను తాను కాపాడుకోవడం నేర్చుకుంది. బలమైన వేర్లను పెంచుకుంది. నేలను గట్టిగా పట్టుకుంది. ఎన్ని గాలులు వీచినా నిలబడేంత బలాన్ని సంపాదించుకుంది. మనిషి జీవితం కూడా ఇలాగే ఉంటుంది. కష్టాలు మనల్ని నాశనం చేయడానికి మాత్రమే రావు. చాలా సందర్భాల్లో అవే మనల్ని బలంగా తయారు చేస్తాయి. ప్రతి సమస్యను తప్పించుకుంటూ పోతే మనలో ధైర్యం పెరగదు. కానీ సమస్యలను ఎదుర్కొంటూ ముందుకు వెళ్తే మనలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. రేపు ఎంత పెద్ద తుఫాను వచ్చినా ఈ చెట్టు నిలబడగలదు. ఎందుకంటే దాని వేర్లు బలంగా ఉన్నాయి. అలాగే జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా నిలబడగలిగేలా మనిషి తనలో ధైర్యం, సహనం, పట్టుదల అనే వేర్లను బలంగా పెంచుకోవాలి. అప్పుడే అతను తనకు మాత్రమే కాదు.. నలుగురికీ నీడనిచ్చే చెట్టులా మారగలడు. నలుగురికి సహాయం చేయగలడు. నలుగురికి మార్గం చూపగలడు’.. తాత మాటలు విన్న మనవడు మౌనంగా ఆ చెట్టు వైపు చూశాడు. అతనికి విషయం పూర్తిగా అర్థమైంది. ‘అర్థమైంది తాతా! ఇకపై కష్టాలు వస్తే వాటి నుంచి పారిపోను. వాటిని ఎదుర్కొంటాను’ అని చెప్పాడు. తాత చిరునవ్వు నవ్వాడు.

నీతి

ఈ కథ మనకు చెప్పే ప్రధాన నీతి కష్టాలను తప్పించుకుంటే కాదు.. వాటిని ధైర్యంగా ఎదుర్కొన్నప్పుడే మనిషి జీవితంలో బలంగా ఎదగగలడు అనేది. ఇంట్లో పెట్టిన మొక్కకు ఎండ, వాన, గాలి, చలి వంటి ప్రకృతి పరిస్థితులను ఎదుర్కొనే అవసరం లేదు. అందువల్ల అది కొంత పెరిగినా బలమైన వృక్షంగా మారలేదు. కానీ బయట నాటిన మొక్క ఎన్నో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంది. ఆ కష్టాలే దాని వేర్లను మరింత బలంగా చేశాయి. చివరకు అది పెద్ద వృక్షంగా ఎదిగి, ఇతరులకు నీడ, ఆశ్రయం ఇచ్చే స్థాయికి చేరుకుంది. అదే విధంగా మనిషి జీవితంలో కూడా కష్టాలు, సమస్యలు, అపజయాలు, అవరోధాలు తప్పనిసరిగా ఎదురవుతాయి. వాటిని చూసి భయపడి పారిపోతే మనలో ఆత్మవిశ్వాసం, ధైర్యం పెరగవు. ప్రతి సమస్యను ఒక పాఠంగా తీసుకుని, దాన్ని అధిగమించడానికి ప్రయత్నిస్తే మనలో సహనం, పట్టుదల, ధైర్యం, సమస్యలను పరిష్కరించే సామర్థ్యం పెరుగుతాయి.

కష్టాలు వచ్చినప్పుడు ‘ఇది నా వల్ల కాదు’ అని వెనక్కి తగ్గకుండా, ‘దీన్ని ఎలా అధిగమించాలి?’ అని ఆలోచించడం విజయానికి మొదటి అడుగు. జీవితంలో సౌకర్యాలు మాత్రమే కోరుకుంటే ఎదుగుదల పరిమితమవుతుంది. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ ముందుకు సాగినప్పుడే మన వ్యక్తిత్వం మరింత బలపడుతుంది. అంతేకాదు మనం బలంగా ఎదిగిన తర్వాత మన విజయాన్ని మనకే పరిమితం చేయకుండా ఇతరులకు సహాయం చేయాలి, వారికి ధైర్యం ఇవ్వాలి, మార్గదర్శకులుగా నిలవాలి. పెద్ద వృక్షం తనకు మాత్రమే కాదు.. దాని నీడలోకి వచ్చే అందరికీ ఉపయోగపడినట్లే, జీవితంలో ఎదిగిన మనిషి కూడా నలుగురికి ఉపయోగపడాలి. కాబట్టి ఈ కథ మనకు ఇచ్చే సందేశం ‘కష్టాలు మనల్ని ఆపడానికి వచ్చిన అడ్డంకులు మాత్రమే కాదు.. మనల్ని మరింత బలంగా, ధైర్యంగా, సమర్థంగా తీర్చిదిద్దే అవకాశాలు కూడా. కష్టాలను ఎదుర్కొంటూ ముందుకు సాగితేనే నిజమైన విజయం సాధించగలం’.

Follow Us