AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Congress: కాంగ్రెస్ బుజ్జగింపుల కమిటీ ఎక్కడ..? ఏం చేస్తుంది.. రెండవ లిస్ట్‌పై సస్పెన్స్..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపుడుతోంది. దీంతో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. అయితే, ఫుల్ జోష్‌లో ఉన్న కాంగ్రెస్ పార్టీకి.. ఆశవాహుల ఆందోళనలు తలనొప్పిగా మారాయి. కాంగ్రెస్‌లో అసంతృప్తులకు ఫుల్ స్థాప్ పెట్టేది ఎవరు..? టికెట్ రాక అలిగిన నేతలు పార్టీని వీడుతున్నా పట్టించుకునే వారు లేరా?.. రాష్ట్ర అగ్ర నేతల మౌనం వల్ల పార్టీకి నష్టం జరగనుందా...? లేక కొత్త నేతలున్నారు కదా అని పొమ్మన లేక పొగపెడుతున్నారా..? అసంతృప్తులను బుజ్జగించే ఫోర్ మెన్ కమిటీ బరిలోకి దిగేదెప్పుడు..?

Telangana Congress: కాంగ్రెస్ బుజ్జగింపుల కమిటీ ఎక్కడ..? ఏం చేస్తుంది.. రెండవ లిస్ట్‌పై సస్పెన్స్..
Jana Reddy
TV9 Telugu
| Edited By: Shaik Madar Saheb|

Updated on: Oct 19, 2023 | 9:48 PM

Share

Telangana Election 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపుడుతోంది. దీంతో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. అయితే, ఫుల్ జోష్‌లో ఉన్న కాంగ్రెస్ పార్టీకి.. ఆశవాహుల ఆందోళనలు తలనొప్పిగా మారాయి. కాంగ్రెస్‌లో అసంతృప్తులకు ఫుల్ స్థాప్ పెట్టేది ఎవరు..? టికెట్ రాక అలిగిన నేతలు పార్టీని వీడుతున్నా పట్టించుకునే వారు లేరా?.. రాష్ట్ర అగ్ర నేతల మౌనం వల్ల పార్టీకి నష్టం జరగనుందా…? లేక కొత్త నేతలున్నారు కదా అని పొమ్మన లేక పొగపెడుతున్నారా..? అసంతృప్తులను బుజ్జగించే ఫోర్ మెన్ కమిటీ బరిలోకి దిగేదెప్పుడు..? అసలు ఫోర్ మెన్ కమిటీ పని చేస్తుందా..? అనేది పార్టీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని కసిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి వ్యూహాత్మక అడుగులు వేస్తుంది. అందులో సామాజిక సమీకరణాలు, వివిధ వర్గాలు, పొత్తులు ఎత్తులపై అంచనాలతోనే టికెట్లు కేటాయిస్తుంది. ఇందులో భాగంగానే ఇప్పటివరకు మొదటి దశలో 55 స్థానాలను ప్రకటించింది. మిగిలిన స్థానాలపై ఇంకా కసరత్తు కొనసాగుతుంది. అయితే, మొదటి దశలో ప్రకటించిన అభ్యర్థుల్లో దాదాపు 5 నియోజకవర్గాల్లో మాత్రమే అసంతృప్తి ఆందోళనలు కలగగా మేజర్‌గా ఉప్పల్ లాంటి నియోజకవర్గంలో నలుగురు నేతల రాజీనామాతో భారీగానే డ్యామేజ్ జరిగింది. అయితే ఇక్కడ సీనియర్ నేత జానారెడ్డితో ఏర్పాటు చేసిన కమిటీ వారిని బుజ్జగించడంలో వైఫల్యమైందని గాంధీభవన్‌లో జోరుగా చర్చ జరుగుతుంది. పోని పీసీసీ, సీఎల్పీ లాంటి నేతలు అయిన వారి ఇళ్లలోకి వెళ్లి కనీసం మాట్లాడే ప్రయత్నం కూడా చేయలేదని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

ఉప్పల్ టికెట్ ఆశించి భంగపడ్డ రాగిడి లక్ష్మారెడ్డి ఉప్పల్ టికెట్ తనకు రాకపోవడంతో మీడియా ఎదుట రోదిస్తూ పీసీసీ అధ్యక్షుడిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ పార్టీలో చేరి తన నియోజకవర్గంలో ఆ పార్టీ అభ్యర్థిని గెలిపించే బాధ్యత తీసుకుంటానని శపథం చేశారు. మరోవైపు ఉప్పల్ నియోజకవర్గంలోని ఏఎస్ రావు నగర్ కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి దంపతులు రాజీనామా చేశారు. ఉప్పల్ నియోజకవర్గం మాజీ పీసీసీ కార్యదర్శి జితేందర్ రెడ్డి సైతం రాజీనామా చేశారు. ఇక మేడ్చల్ నియోజకవర్గంలో టికెట్ తనకే వస్తుందనే భరోసాతో ఉన్న హరివర్ధన్ రెడ్డికి టికెట్ రాకపోవడంతో ఆయన అనుచరులు గాంధీభవన్ వద్ద ఆందోళనలు చేస్తూ ఇంచార్జ్ మాణిక్రావు ఠాక్రేను కూడా అడ్డుకున్నారు. మరోవైపు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ టికెట్ ఆశించిన భూపతిరెడ్డి నర్సారెడ్డికి టికెట్ రాకపోవడంతో అలకబూనారు. నాగర్ కర్నూల్‌లో నాగం జనార్దన్ రెడ్డి తనకు టికెట్ రాకపోవడంతో తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. కొల్లాపూర్‌లో టికెట్ ఆశించి భంగపడ్డ జగదీశ్వర్ రావు ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని ఆలోచనలో ఉన్నారు. చాంద్రాయణగుట్ట నేతలు బహుదూర్‌పురా టికెట్ ఆశించిన కళింబాబా, గద్వాల్ టికెట్ ఆశించిన కుర్వ విజయ్‌ల నిరసనలు శృతిమించడంతో వారిని ఇప్పటికే పార్టీ నుండి సస్పెండ్ చేశారు.

అయితే ఇలాంటి ఇబ్బందులు రాకూడదనే ముందు జాగ్రత్తగా సీనియర్ నేత జానారెడ్డి అధ్యక్షతన నలుగురు సభ్యుల కమిటీని అధిష్టానం ఏర్పాటు చేసింది. అందులో ఇంచార్జ్ ఠాక్రే, దీపాదాస్ మున్షీ, మీనాక్షి నటరాజన్ లు సభ్యులుగా ఉన్నారు. కమిటీ ఏర్పాటు చేసిన మొదటి రోజు అఘమేఘాల మీద సమావేశాన్ని ఏర్పాటు చేసిన కమిటీ తిరా అభ్యర్థులను ప్రకటించిన తరువాత పత్తా లేకుండా పోయిందని గాంధీభవన్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మొదటి జాబితాలో పెద్దగా ఇబ్బంది లేకపోవడం వల్ల నష్టం జరగనప్పటికీ రెండవ జాబితా వచ్చేలోపు క్లిష్టమైన నియోజకవర్గాల్లో దాదాపు ఇద్దరు నుంచి ముగ్గురు ముఖ్య నేతలు పోటీ పడుతున్నారు. అక్కడ టికెట్ ఖారరయ్యే అభ్యర్థితో పాటు టికెట్ ఆశించిన ఆశావహులను కూర్చోబెట్టి మాట్లాడాల్సి ఉంది. దీంతో నష్టాన్ని తగ్గించవచ్చని సునీల్ కనుగోలు టీం సూచిస్తుంది. టికెట్ రానటువంటి ముఖ్య నేతలకు వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఎంపీలుగా, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్ల లాంటి పదవుల అవకాశాలు కల్పిస్తామని ఒప్పించేలా జానారెడ్డి కమిటీ ముందున్న లక్ష్యం. రెండవ జాబితా కోసం మరో మూడు రోజుల సమయం పట్టే అవకాశం ఉండడంతో ఇప్పటికైనా అసంతృప్త నేత‌ల‌తో చర్చించాలని కోరుతున్నారు. మొదటి జాబితా ప్రకటనతోనే పెద్ద తతంగం జరగడంతో రెండో జాబితాలో కూడా బుజ్జగించడంలో జానారెడ్డి కమిటీ విఫలమైతే ఎన్నికల్లో పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో టీపీసీసీ.. కాంగ్రెస్ అధిష్టానం ఏం చేస్తుందో చూడాల్సిందే..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..