Congress 2nd list: కాంగ్రెస్ 2వ జాబితా మరింత జాప్యం.. మిత్రపక్షాలతో సీట్ల సర్దుబాటే కారణమా..?
Telangana Assembly Elections: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు తొలి జాబితాను ప్రకటించిన కాంగ్రెస్, రెండవ జాబితా విషయంలో మరింత ఆచితూచి వ్యవహరిస్తోంది. ఒకట్రెండు రోజుల్లోనే రెండవ జాబితా ఉంటుందని పార్టీ పెద్దలు ప్రకటించినప్పటికీ, ఆ పరిస్థితి కనిపించడం లేదు. జాతీయస్థాయిలో ఏర్పాటు చేసిన 'ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇంక్లూజివ్ అలయన్స్'లో భాగంగా ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు సీపీఐ, సీపీఐ(ఎం)తో పొత్తులు, సీట్ల సర్దుబాటు వ్యవహారం ఇంకా కొలిక్కి రావాల్సి ఉంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు తొలి జాబితాను ప్రకటించిన కాంగ్రెస్, రెండవ జాబితా విషయంలో మరింత ఆచితూచి వ్యవహరిస్తోంది. ఒకట్రెండు రోజుల్లోనే రెండవ జాబితా ఉంటుందని పార్టీ పెద్దలు ప్రకటించినప్పటికీ, ఆ పరిస్థితి కనిపించడం లేదు. జాతీయస్థాయిలో ఏర్పాటు చేసిన ‘ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇంక్లూజివ్ అలయన్స్’లో భాగంగా ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు సీపీఐ, సీపీఐ(ఎం)తో పొత్తులు, సీట్ల సర్దుబాటు వ్యవహారం ఇంకా కొలిక్కి రావాల్సి ఉంది. ఈ
ఇక రెండు పార్టీలతో పాటు కోదండరాంకు చెందిన తెలంగాణ జన సమితి(టీజేఎస్)ను కూడా కాంగ్రెస్ కూటమిలో చేర్చుకునేందుకు చర్చలు కొనసాగుతున్నాయి. ఇవన్నీ కొలిక్కి వచ్చేందుకు మరికొన్ని రోజులు సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు రెండో జాబితాలో అభ్యర్థులను ఖరారు చేయాల్సిన స్థానాల్లో పార్టీని గెలిపించగలిగే బలమైన నేతల కోసం కూడా కాంగ్రెస్ పార్టీ ఇంకా అన్వేషిస్తున్నట్టు తెలుస్తోంది. అభ్యర్థిత్వం కోసం పార్టీలో దరఖాస్తు చేసుకున్న నేతల బదులు ఇతర పార్టీల్లో బలంగా ఉన్న నేతలపై దృష్టి పెట్టినట్టు సమాచారం.
ఇప్పటికే విడుదల చేసిన తొలి జాబితాలోని 55 మందిలో ఏకంగా 11 మంది నేతలు ఇతర పార్టీల నుంచి వచ్చినవారే ఉన్నారు. ఈ నిర్ణయం పార్టీలో సుదీర్ఘకాలంగా సేవలందిస్తున్న నేతలకు ఆగ్రహం తెప్పిస్తున్నప్పటికీ.. ఈసారి ఎలాగైనా తెలంగాణలో గెలిచి తీరాలన్న పట్టుదలతో తెలంగాణ రాష్ట్ర నాయకత్వం, పార్టీ అధిష్టానం ఉన్నాయి. ఈ క్రమంలో కొన్ని త్యాగాలకు సైతం పార్టీ నేతలు సిద్ధం కాక తప్పదన్న సంకేతాలు ఇస్తోంది అధిష్టానం.
బలమైన నేతలను కాంగ్రెస్‌లోకి చేర్చుకునే ప్రయత్నాల్లో భాగంగా మాజీ ఎమ్మెల్యేలు మండవ వెంకటేశ్వర రావు, ఏనుగు రవీందర్ రెడ్డి, రేవూరి ప్రకాశ్ రెడ్డి వంటి నేతలతో రాష్ట్ర నాయకత్వం సంప్రదింపులు సాగిస్తోంది. మండవ వెంకటేశ్వర్లును పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి స్వయంగా కలిసి మాట్లాడిన విషయం తెలిసిందే. ఆయన్ను నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుంచి బరిలోకి దించే ఆలోచనలో రాష్ట్ర నాయకత్వం ఉంది. అలాగే ఏనుగు రవీందర్ రెడ్డిని బాన్సువాడ నుంచి పోటీ చేయించాలని చూస్తోంది. పాత వరంగల్ జిల్లాలో బలమైన నేతగా ఉన్న ఎర్రబెల్లి దయాకర్ రావును ఓడించేందుకు రేవూరి ప్రకాశ్ రెడ్డిని బరిలోకి దించాలని భావిస్తోంది.
మరోవైపు సీపీఐ, సీపీఐ(ఎం)తో పొత్తుల చర్చల్లో రెండు పార్టీలకు చెరో రెండు సీట్లు ఇవ్వాలని పార్టీ అధిష్టానం నిర్ణయించినట్టు తెలిసింది. అందులో సీపీఐకి చెన్నూరు, కొత్తగూడెం సీట్లు ఇచ్చేందుకు అధిష్టానం అంగీకారం తెలిపింది. అయితే సీపీఐ(ఎం)కు ఇచ్చే సీట్ల విషయంలోనే ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. అలాగే టీజేఎస్ కోదండరాంకు ఎన్ని సీట్లు ఇవ్వాలన్న విషయంపై కూడా ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఇవన్నీ కొలిక్కి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరిగే అవకాశం ఉంది.
ఇక కొందరు నేతలు చెబుతున్న కథనాల ప్రకారం రెండోసారి పార్టీ సీఈసీ సమావేశం జరపాల్సిన అవసరం లేకుండానే, నిర్ణయాధికారాన్ని పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌కు అప్పగించిందని చెబుతునర్నారు. వేణు గోపాల్‌తో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాణిక్ రావు ఠాక్రే సమావేశమై రెండో జాబితాపై కసరత్తు చేస్తున్నారని తెలుస్తోంది. కసరత్తు తుది రూపం వచ్చాక రెండో జాబితాను ప్రకటించేందుకు సిద్ధమవుతోంది కాంగ్రెస్.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..