Telangana Election: హోరా హోరీ ప్రచారంతో పార్టీల దూకుడు.. అధికార, విపక్షాల మధ్య పేలుతున్న మాటల తూటాలు
తెలంగాణ ఎన్నికల్లో ప్రచారం పీక్స్‌కు చేరుతోంది. అధికార పార్టీ తరఫున ఓ వైపు గులాబీ అధినేత, సీఎం కేసీఆర్..మరోవైపు మంత్రులు ప్రచార బరిలో దూసుకుపోతున్నాయి. బీఆర్‌ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూనే.. కాంగ్రెస్, బీజేపీల వైఫల్యాలను ప్రజలకు వివరిస్తున్నారు.

తెలంగాణ ఎన్నికల్లో ప్రచారం పీక్స్‌కు చేరుతోంది. అధికార పార్టీ తరఫున ఓ వైపు గులాబీ అధినేత, సీఎం కేసీఆర్..మరోవైపు మంత్రులు ప్రచార బరిలో దూసుకుపోతున్నాయి. బీఆర్‌ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూనే.. కాంగ్రెస్, బీజేపీల వైఫల్యాలను ప్రజలకు వివరిస్తున్నారు.
ఓ వైపు ప్రచారాన్ని హోరెత్తిస్తూనే.. మరోవైపు నామినేషన్లకు సన్నాహాలు చేసుకుంటున్నారు. బీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్. దశాబ్దాలుగా కొనసాగుతున్న సెంటిమెంట్‌ను అనుసరించి.. సిద్దిపేట జిల్లా కోనాయిపల్లి వేంకటేశ్వర స్వామిని కేసీఆర్ దర్శించుకున్నారు. వెంకన్న సన్నిధిలో నామినేషన్ పత్రాలతో ప్రత్యేక పూజలు చేశారు. ఎన్నికల్లో నామినేషన్ వేసే ప్రతిసారి కేసీఆర్ ఈ ఆలయంలో పూజలు చేస్తూ వస్తున్నారు. నవంబర్ 9న గజ్వేల్‌తో పాటు కామారెడ్డిలో నామినేషన్లు వేయనున్నారు కేసీఆర్. అదే రోజు బీఆర్‌ఎస్ ఆశీర్వాదసభల్లో కూడా పాల్గొంటారు.
కోనాయిపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయం సీఎం కేసీఆర్‌తో పాటు పార్టీకి సెంటిమెంట్‌గా ఉంది. ఏ ఎన్నికలు వచ్చినా ఇక్క డ పూజలు చేసిన తర్వాతే సీఎం కేసీఆర్ నామినేషన్ వేస్తారు. కేసీఆర్‌తో పాటు హరీశ్‌రావు, ఇతర పార్టీ నేతలు కూడా స్వామివారిని దర్శించుకున్న అనంతరం నామినేషన్లు వేయడం ఆనవాయితీగా వస్తున్నది. కేసీఆర్ 1985లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందినప్పటి నుంచి ప్రతి ఎన్నికల్లో ఈ ఆలయంలో నామినేషన్ పత్రాలకు పూజలు చేసి, నామినేషన్ వేస్తున్నారు. అదే సెంటిమెంట్ ఈ ఎన్నికల్లో కూడా కొనసాగించారు బీఆర్‌ఎస్ అధినేత.
మరోవైపు మంత్రి కేటీ రామారావు ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటూనే.. వివిధ వర్గాలు, పార్టీ నేతలతో సదస్సులు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ జలవిహార్‌లో ఏర్పాటు చేసిన తెలంగాణ న్యాయవాదుల సమ్మేళనంలో పాల్గొన్న కేటీఆర్..గత తొమ్మిదేళ్లలో తెలంగాణ అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతోందన్నారు. కంటి ముందే అభివృద్ధి కనిపిస్తున్నా కూడా కొంతమంది అబద్దాలు చెబుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి సీఎంలే తప్ప..ఓటర్లు దొరకడం లేదని సెటైర్లు వేశారు కేటీఆర్. ఈ ఎన్నికల్లో ఎంతమంది కలిసొచ్చినా కూడా..తాము సింగిల్‌గానే వచ్చి హ్యాట్రిక్ కొడతామన్నారు మంత్రి కేటీఆర్. తమకు ప్రజలతో తప్ప ఎవరితోనూ పొత్తు లేదన్న కేటీఆర్.. మన రాష్ట్రంపై పక్క రాష్ట్రాల నేతల దాడి ఎందుకు అని ప్రశ్నించారు. శేరిలింగంపల్లిలో బీఆర్ఎస్ బూత్ కమిటీ సమావేశంలో పాల్గొన్న కేటీఆర్..పలు అంశాలపై క్యాడర్‌కు సూచనలు చేశారు.
ఇక కరెంట్ విషయంలో ఇప్పటికే బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుండగా..డీకే శివకుమార్ పేరుతో వైరల్ అయిన లేఖ మరో రచ్చకు కారణమైంది. దీంతో కర్నాటక ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు మంత్రి కేటీఆర్. అయితే అసలు ఆ లేఖ తాను రాయలేదంటూ డీకే శివకుమార్ ట్వీట్ చేయడం మరో కొసమెరుపు..
ఇదిలావుంటే, కాంగ్రెస్‌తో వామపక్షాల పొత్తు కథ.. సీరియల్‌ను తలపిస్తోంది. ముగిసిపోయింది అనుకునేలోగానే.. మళ్లీ మొదటికి వస్తుంది. శుభం కార్డు పడింది అనేలోపే.. మరో ట్విస్ట్ తెరమీదకు వస్తుంది. దీంతో ఇకపై పొత్తు అంశంపై మాట్లాడకూడదని డిసైడ్ అయ్యారు రాష్ట్ర నేతలు. అంతా హస్తినలోనే అంటూ.. బాల్‌ను జాతీయ కోర్టులోకి నెట్టేశారు.
మరోవైపు తెలంగాణలో బీజేపీ జనసేన పొత్తు దాదాపు ఖరారు అయినట్లు కనిపిస్తుంది. పొత్తులో భాగంగా జనసేనకు 8 లేదా 9 సీట్లు ఇచ్చే విషయాన్ని బీజేపీ పరిశీలిస్తున్నట్లు సమాచారం. గ్రేటర్ హైదరాబాద్‌లో రెండు స్థానాలు, ఖమ్మంలో నాలుగు సీట్లు జనసేనకు ఇవ్వడానికి బీజేపీ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. పొత్తులో భాగంగా జనసేనకు ఇచ్చే అవకాశం ఉన్న సీట్లలో కూకట్‌పల్లి, వైరా, ఖమ్మం, అశ్వారావుపేట, కొత్తగూడెం, కోదాడ, నాగర్‌కర్నూల్, తాండూరు ఉన్నాయి. కూకట్‌పల్లితో పాటు గ్రేటర్‌లో మరో సీటు జనసేనకు ఇచ్చే ఛాన్స్ కూడా ఉందని చెబుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…